AP Telangana Rain Updates Live: హైదరాబాద్‌లో చెరువు పొంగింది- జూ మునిగింది

AP Telangana Rain Updates Live: ఏపీ, తెలంగాణతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మరో రెండు రెండులు భారీ వర్ష సూచన ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

ABP Desam Last Updated: 13 Jul 2022 04:24 PM
కడెం ప్రాజెక్టుకు తగ్గిన వరద ప్రవాహం

నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు వద్ద కాస్త టెన్షన్ తగ్గింది. ఎడమ కాలువ వైపు మైసమ్మ ఆలయం వద్ద గండి పడటంతో దిగువకు వరద నీరు వెళ్లిపోతోంది. దీంతో హరిత రిసార్ట్ సమీపంలో వరద తాకిడి బాగా తగ్గింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 కాగా... ప్రస్తుతం నీటి మట్టం 698 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 4 లక్షల క్యూసెక్కులు ఉంటే... ఔట్ ఫ్లో మూడున్నర లక్షల క్యూసెక్కులు ఉంది. ప్రస్తుతం 17 గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్నారు. ఇంకో గేటు తెరుచుకోలేదు.

AP Telangana Rain Updates Live: ధవళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి ఉధృతి, మూడో ప్రమాద హెచ్చరికకు ఛాన్స్

ఎగువ రాష్ట్రల్లో వర్షాల వల్ల పెరుగుతున్న గోదావరి ఉధృతి


ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో  15.07 లక్షల క్యూసెక్కులు


స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఏపీ విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి జి.సాయిప్రసాద్


  వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు సూచనలు


   రేపు మూడో ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం 


    మూడో ప్రమాదహెచ్చరిక వస్తే ప్రభావితం చూపే మండలాలపై అప్రమత్తం


    సహాయక చర్యల్లో మొత్తం 5 ఎన్డీఆర్ఎఫ్ 4 ఎస్డీఆర్ఎఫ్,  బృందాలు 


    లోతట్టు ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి


     -  ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.

హైదరాబాద్‌లో చెరువు పొంగింది- జూ మునిగింది
హైదరాబాద్‌లోని జూ పార్కులోకి వరద నీరు వచ్చి చేరింది. మీరాలం చెరువు నిండి జూపార్కులోకి నీరు ఉప్పొంగింది. సఫారీ జోన్‌ మొత్తం నీట మునిగింది. సఫారీ జోన్‌లో సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, అడవి దున్నలను నైట్ అండ్ క్లోజర్‌లో ఉంచారు అధికారులు. వరద ఉధృతి తగ్గిన తర్వాతే సఫారీలోకి విడుదల చేయనున్నట్టు చెప్పారు. జూ పార్క్‌లోని సఫారీ సందర్శనను ప్రస్తుతానికి నిలిపేసినట్టు ప్రకటించారు జూ అధికారులు. ఐదు రోజులుగా కురిసిన వర్షాలకు పొంగి పోర్లుతున్న మీరాలం చెరువు.
గోదావరి ఉగ్రరూపం- భయం గుప్పెట్లో తూర్పుగోదావరి జల్లా నదీపరివాహక ప్రజలు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. పుష్పఘాట్‌ వద్ద సుమారు 56 అడుగులకు చేరింది గోదావరి నీటి మట్టం. కోటిలింగాల ఘాట్, శంకర్ ఘాట్, దుర్గా ఘాట్, గణపతి ఘాట్, మార్కండేయ ఘాట్, కుమారి ఘాట్, ఇస్కాన్ ఘాట్, గాయత్రి ఘాట్, విఐపి ఘాట్, అన్ని ఘాట్లు నీట మునిగాయి. భక్తులెవరూ అటుగా వెళ్లకుండా ఉండేందుకు పోలీసు సిబ్బంది పహారా కాస్తున్నారు. గోదావరి నదికి లంక భూముల్లో నివాసం ఉంటున్నవారిని, లోతట్టు ప్రాంతాల్లో  నివాసం ఉంటున్న ప్రజలను సురక్షి ప్రాంతాలకు తరించాలని అధికారుల ప్రయత్నిస్తున్నారు. గంటగంటకు గోదావరి ఉద్ధృతి పెరగడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న భయంతో పరివాహక ప్రాంత ప్రజలు జీవిస్తున్నారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో ఆలయాలన్నీ నీట మునిగాయి. వరద ప్రభావంపై జిల్లా కలెక్టర్ మాధవిలత ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. అధికారులను అప్రమత్తం చేసి ప్రాణ నష్టం జరగకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. 

నిజామాబాద్‌ వెళ్లే వాళ్లు ఆ రూట్‌లో అసలు వెళ్లొద్దు- అధికారుల సీరియస్ వార్నింగ్

నిజామాబాద్‌ జిల్లా మెట్‌పల్లి నుంచి కమ్మర్పల్లి, ఆర్మూర్, నిజామాబాద్ వైపు వెళ్లే వారు ప్రయాణాన్ని వాయిదా  వేసుకోవాలని హెచ్చరిస్తున్నారు అధికారులు. ఊరికి చెందిన పెద్దచెరువు నిండిన కారణంగా ప్రమాదం పొంచి ఉందని అధికారులు చెబుతున్నారు.  మూడు బొమ్మలమేడిపల్లి గ్రామ శివారులో గల పెట్రోల్ బంకు పక్క నుంచి జాతీయ రహదారిపై నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుందని వివరించారు. ఎలాంటి సాహసాలు చేయొద్దని హితవు పలికారు అధికారులు 

AP Telangana Rain Updates Live: కడెం ప్రాజెక్ట్‌కు మూడో ప్రమాద హెచ్చరిక జారీ

కడెం ప్రాజెక్ట్ కు వరద పోటెత్తింది. అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

AP Telangana Rain Updates Live: ఎస్సారెస్పీకి వరద - 3,53,548 క్యూసెక్కుల నీటి విడుదల

ఎస్సారెస్పీకి పోటెత్తుతున్న వరద


3,60,515 క్యూసెక్కుల ఇన్ ఫ్లో.... 30 గేట్లు ఎత్తి 3,53,548 క్యూసెక్కుల నీటి విడుదల.


ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 90 టీఎంసీలు, ప్రస్తుతం 75.145 టీఎంసీలు.


ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్ధ్యం 1091 అడుగులు, ప్రస్తుతం 1087.6


జెన్ కో కి 3000 క్యూసెక్కులు, కాకతీయ కాల్వ నుంచి 4,500 క్యూసెక్కుల నీటి విడుదల

AP Telangana Rain Updates Live: కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఎల్లంపల్లిలోకి భారీగా వరద నీరు

కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ఎల్లంపల్లి లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.  ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 20.175 టి ఎంసిలకు గాను ప్రస్తుతం 14.850టి ఎంసిలకు నీరు చేరింది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 8 లక్షల 97వేల 496 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 9లక్షల 8వేల 496 క్యూసెక్కులు..47 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు

AP Telangana Rain Updates Live: ఫుల్ ట్యాంక్ లెవల్ దాటిన హుస్సేన్ సాగర్ నీటి మట్టం

నిండిన ట్యాంక్ బండ్.. ఫుల్ ట్యాంక్ లెవల్ దాటిన హుస్సేన్ సాగర్ నీటి మట్టం 
హుస్సేన్ సాగర్ FTL ... 513.41 మీటర్లు 
హుస్సేన్ సాగర్ ప్రస్తుత నీటి మట్టం 513.44 మీటర్లకు చేరుకుందని అధికారులు తెలిపారు.

AP Telangana Rain Updates Live: వరద నీటితో నిండు కుండలా ధవళేశ్వరం బ్యారేజ్

ఎగువ ప్రాంతాల నుంచి వెలువెత్తుతున్న వరద నీటితో ధవళేశ్వరం బ్యారేజ్ నిండు కుండలా మారింది. బ్యారేజ్  నుంచి సముద్రంలోనికి ఇప్పటివరకు 15.20 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదలడంతో కోనసీమ లోని లంక గ్రామాలన్ని ముంపుకు గురయ్యాయి.. దీంతో జలదిగ్బంధంలో సుమారు 30 గ్రామాలకు పైగా వెళ్ళిన పరిస్థితి కనిపిస్తోంది. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తదితర అధికార యంత్రాంగం ముంపు గ్రామాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఎక్కడికక్కడే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలను తరలించేందుకు ఏర్పాటు చేశారు.  కోనసీమలో ప్రధానంగా పి గన్నవరం, ముమ్మిడివరం, కొత్తపేట రాజోలు అమలాపురం, రామచంద్రపురం తదితర నియోజకవర్గాల పరిధిలోని ఆరు మండలాల్లో దాదాపు 35 గ్రామాలకు పైగా  వరద నీరు చుట్టుముట్టే పరిస్థితి కనిపిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించేందుకు 90 బోట్లను సిద్ధం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. 

AP Telangana Rain Updates Live: మహా గండంలో ధర్మపురి - గోదావరికి చేరుతున్న వరద నీరు

ప్రముఖ పుణ్య క్షేత్రం ధర్మపురి వరదనీటి గడ్డానికి ముందు నిలిచింది ఒకవైపు ఉగ్ర గోదావరి భారీ వరద నీటితో జనావాసాలను దాదాపుగా తాకుతూ వెళ్తోంది దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు సమీపంలో ఉన్న ఎత్తైన ప్రదేశాల్లో తలదాచుకుంటున్నారు... గోదావరి తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వెలుగొండ, బొంకూరు ,ముదునూరు వెలుగుమట్ల  తో పాటు దమ్మన్నపేట ,రాజారాం దొంతాపూర్, జైనా , దమ్మన్నపేట, రాజారామ్ గ్రామాలకు వరదనీటి వల్ల తీవ్రమైన గండం పొంచి ఉంది .ఆదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు పరిమితికి మించి వరదనీరు వస్తే ధర్మపురి ని ఆనుకొని ఉన్న  సమీప గ్రామాలలో తీవ్రమైన  ఆస్తి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉందని స్థానికులు భయపడుతున్నారు.


 ధర్మపురి పట్టణంలోని పలు ఆలయాలు సమీపంలోకి నీరు వచ్చి చేరింది మరోవైపు రాయపట్నం బ్రిడ్జి వద్ద కూడా ఇదే పరిస్థితి.. ప్రజలు వీలైనంతవరకు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు హెచ్చరిస్తున్నారు అయితే కడెం ప్రాజెక్టు పటిష్టత పైనే గోదావరి నీటి వరద ప్రభావం ఉంటుందని అందరూ భయపడుతున్నారు.

AP Telangana Rain Updates Live: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు, గేట్లు ఎత్తిన అధికారులు

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గం లో గత నాలుగు రోజులుగా  వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నియోజక వర్గం లోని వాగులు వంకలు పొంగిపొర్లుతుండగా, ప్రాజెక్ట్ లు జలకళ ను సంతరించుకొన్నాయి.ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి 9420 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.ప్రాజెక్ట్ పూర్తి స్థాయి మట్టం 1405 అడుగులు ఉండగా 1395 అడుగులకు చేరుకుంది.ప్రాజెక్ట్ పూర్తి స్థాయి సామర్థ్యం 17 టీఎంసీ లు ఉండగా ప్రస్తుతం 7.284 టీఎంసీ లకు చేరుకొంది.అయితే కౌలస్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి మట్టానికి చేరుకోనగా ప్రాజెక్ట్ మూడు నాలుగు గేట్లను ఎత్తి దిగువకు 9544 క్యూసెక్కుల వరద నీటిని ప్రాజెక్ట్ అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.ఇలాగే ఇటు కల్యాణి ప్రాజెక్ట్ నాలుగు గేట్లను ఎత్తి 360 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేయగా సింగీతం రిజర్వాయర్ అలుగు మీదుగా 5350 క్యూసెక్కుల వరద నీళ్లు దిగువకు పరుగులు పెడుతున్నాయి. అయితే భారీ వర్షాలకు నియోజక వర్గం లోని పలు లోతట్టు ప్రాంతాలు, పంట పొలాలు నీట మునిగిపోగ, పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.

Background

ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర తీర ప్రాంతాలపై కొనసాగుతున్న అల్ప పీడనం వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఒడిశా తీర ప్రాంతాల్లోకి విస్తరించి ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలో మీటర్ల ఎత్తు వరకూ విస్తరించి ఎత్తుకు వెళ్లేకొలదీ నైరుతి దిశగా వంగి ఉంటుందని, మరో 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మరో రెండు రెండులు భారీ వర్ష సూచన ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మంగళవారం సైతం తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తడంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఒడిశా తీరంలో వాయువ్య బంగాళాఖాతం మీదుగా అల్ప పీడనం, అక్కడి నుంచి ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
ఒడిశా తీరంలో అల్పపీడనం బలపడటంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. నేటి నుంచి మరో రెండు రోజులపాటు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఈ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మంగళవారం అల్లూరి సీతారామరాజు, పల్నాడు, అనకాపల్లి, నెల్లూరు, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంటలు వేసే పరిస్థితి కనిపించడం లేదు.


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనూ అల్పపీడనం ప్రభావం కొనసాగుతోంది. జిల్లాల్లో నేటి నుంచి 2 రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ఈ జిల్లాలకు సైతం ఎల్లో అలర్ట్ జారీ అయింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ రెండు రోజులు ఎడతెరిపి లేకుండా వర్షాలు పడతాయి.


తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో గత ఐదు రోజులుగా పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, జయశంకర్ భూపాళపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.