Breaking News Live: తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు... ఒమిక్రాన్ దృష్ట్యా ప్రభుత్వం నిర్ణయం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 03 Jan 2022 10:05 PM
తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు... ఒమిక్రాన్ దృష్ట్యా ప్రభుత్వం నిర్ణయం

తెలంగాణలో స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 8 నుండి 16 వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఒమిక్రాన్ దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ 

ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భేటీ ముగిసింది. రాష్ట్ర సమస్యలపై ప్రధానికి సీఎం జగన్‌ వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక  విషయాలపై సీఎం జగన్‌ ప్రధానితో చర్చించారు. విభజన హామీలు, పోలవరం, జల వివాదాలకు సంబంధించిన అంశాలను ప్రధాని మోదీ దృష్టికి జగన్ తీసుకెళ్లారు. 

మరికాసేపట్లో ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ

ఏపీ సీఎం జగన్ దిల్లీలో పర్యటిస్తున్నారు. సీఎం జగన్ మరికాసేపట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం కానున్నారు. రేపు ఉదయం గం.9.30లకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో తో భేటీ కానున్నారు.  

గవర్నర్‌కు జీవన్ రెడ్డి ఫిర్యాదు

తెలంగాణలో ఉద్యోగుల నియామకాలు, బదిలీలు చేపట్టడానికి తీసుకొచ్చిన జీవో 371పై గవర్నర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాజ్ భవన్ ముందు ఏర్పాటు చేసిన బాక్స్‌లో ఫిర్యాదు చేశారు. 317 జీవోతో రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారని.. ఆర్టికల్ 317 డి ఉల్లంఘన జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే 371 జీవో రద్దు చేసి.. స్థానికత ప్రాతిపదికన బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గవర్నర్ కంప్లైంట్ బాక్స్ పెట్టి వాటి ద్వారా ప్రజల సమస్యలు వినేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందని జీవన్ రెడ్డి అన్నారు.





ఆదిలాబాద్‌లో ఉద్రిక్తతలు

గిరిజన యూనివర్సిటీ కోసం ఆదిలాబాద్‌లో ఆదివాసీ సంఘాల నేతలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ చార్జ్ చేసి వారిని తరిమికొట్టారు. గతంలో ప్రతిపాదించిన గిరిజన యూనివర్శిటీని తక్షణమే ఏర్పాటు చేయాలంటూ ఆదివాసీలు ఆందోళనకు దిగారు. కొమరం భీమ్ చౌరస్తాలో జిల్లా కలెక్టర్, ఎస్పీల వాహనాలను అడ్డుకుని నిరసన తెలిపారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.

సీఎం కేసీఆర్‌పై మంత్రి ప్రశంసలు

సీఎం కేసీఆర్‌ ఓ ఇంజినీర్‌ అని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అభివర్ణించారు. ఒక ఆర్కిటెక్టు తరహాలో యాదాద్రి ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని  అన్నారు. ఆదివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. కలలో కూడా ఊహించని విధంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం రూపుదిద్దుకుంటోందని, ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు.

వరంగల్ ఫైనాన్స్ వ్యాపారి వెంకటేశ్వరరావు మర్డర్ కేసు ఛేదించిన పోలీసులు

వరంగల్:  ఫైనాన్స్ వ్యాపారి వెంకటేశ్వరరావు మర్డర్ కేసు మిస్టరీ వీడింది. మృతుడు వెంకటేశ్వరరావు స్నేహితుడే ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. ఆర్ధిక లావాదేవీల్లో తేడాలే కారణమని.. మృతుడి కాల్ డేటా ఆధారంగా మిస్టరీ ఛేదించారు. నవంబర్ 22న వ్యాపారి వెంకటేశ్వరరావు హత్యకు గురయ్యారు.

సంగారెడ్డి: ప్రేమికుల ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి మండలం బుదెర గ్రామ శివారులో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మృతులు వికారాబాద్ జిల్లాకు చెందిన బొగ్గుల అమృత కొహిర్, బ్యాగరి శివగా గుర్తించారు. ఇద్దరు హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కళాశాలలో బీ ఫార్మసీ చదువుతున్నారు. తాము తప్పు చేశామని ఇంట్లో చెప్పే ధైర్యం లేదంటూ ప్రేమికులు సూసైడ్‌ నోట్‌ రాసి చనిపోయారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు పీసీ రెడ్డి కన్నుమూత

గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ప్రముఖ దర్శకుడు పీసీ రెడ్డి కన్నుమూశారు. సోమవారం ఉదయం చెన్నై లోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. పి.సి.రెడ్డి పూర్తి పేరు పందిళ్లపల్లి చంద్రశేఖరరెడ్డి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అనుమసముద్రం గ్రామంలో 1933 అక్టోబర్ 15వ తేదీన  జన్మించారు. 1959లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి రోజుల్లో వి.మధుసూధనరావు, ఆదుర్తి సుబ్బారావు వద్ద సహాయ దర్శకుడిగా, సహ దర్శకుడిగా పని చేశారు పీసీ రెడ్డి. అనూరాధ అనే సినిమాతో దర్శకుడిగా మారారు. సుమారు 75 చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ఏపీ రైతుల ఖాతాల్లో వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ నిధులు జమ

ఏపీ రైతుల ఖాతాల్లో వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ నిధులు జమయ్యాయి. వరసగా మూడవ ఏడాది, మూడో విడతగా రైతు భరోసా సాయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు.

అపార్ట్ మెంట్‌లో అగ్ని ప్రమాదం

నిజాంపేట్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌కు లీకేజీ అవడంతో మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. బాచుపల్లి కౌసల్యకాలనీలోని సుఖినైన్‌ అపార్ట్‌మెంట్‌లో సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో 6వ ఫ్లోర్‌లో ఈ ఘటన జరిగింది. చుట్టుపక్కల వారు మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనా స్థలాన్ని స్థానిక కార్పొరేటర్‌, పోలీసులు సందర్శించారు.

Background

మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండలం కౌసల్యాదేవి పల్లిలో విషాదం చోటు చేసుకుంది. వేడి సాంబార్‌లో పడి ఓ బాలుడు మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని కుటుంబసభ్యులు హుటాహుటాన ఆస్పత్రికి తరలించారు. కాగా వారం రోజుల పాటు చికిత్స పొందిన బాలుడు పరిస్థితి విషమించడంతో ఈరోజు మృతి చెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఆయన రచ్చబండ కార్యక్రమంతో పాటు బాధిత రైతు కుటుంబాలను పరామర్శించడం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలోనే హౌస్ అరెస్ట్‌లు, పెద్ద ఎత్తున కార్యకర్తలు రేవంత్ ఇంటికి రావడం, ఆయనను కలవడం వంటివి జరుగుతున్నాయి. ‘‘స్వల్ప లక్షణాలతో నేను కోవిడ్ బారిన పడ్డాను. గత కొద్ది రోజులుగా నన్ను కాంటాక్ట్ అయినవారు.. తప్పనిసరిగా కావల్సిన జాగ్రత్తలు తీసుకోండి’’ అని ట్వీట్ చేశారు.


సూర్యాపేటలో ర్యాగింగ్ భూతం
సూర్యాపేటలో ర్యాగింగ్ రక్కసి వెలుగు చూసింది. పట్టణంలోని మెడికల్ కాలేజీలో హాస్టల్‌లో ఉంటూ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి సీనియర్ల నుంచి ర్యాగింగ్‌కు గురయ్యాడు. ఈ విషయాన్ని విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేయగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌‌కు చెందిన విద్యార్థి ఇంటి నుంచి శనివారం రాత్రి హాస్టల్‌‌కు చేరుకున్నాడు. అతణ్ని చూసిన రెండో సంవత్సరం సీనియర్ విద్యార్థులు దాదాపు 25 మంది తమ గదిలోకి రమ్మని పిలిచారు.


వారు అప్పటికే మద్యం సేవించి ఉన్నట్లుగా బాధితుడు ఫిర్యాదులో పేర్కొ్న్నాడు. ‘‘వారు నా దుస్తులు విప్పించి సెల్‌ ఫోన్‌ లో వీడియో తీశారు. కొంత మంది మద్యం తాగి నాపై దాడికి కూడా పాల్పడ్డారు. అనంతరం ట్రిమ్మర్ తీసుకొని నాకు గుండు గీసేందుకు ప్రయత్నించారు. సీనియర్లు నాలుగు గంటలు గదిలో బంధించి హింసించారు. మోకాళ్లపై కూర్చోబెట్టి సెల్యూట్‌ చేయించుకోవడమే కాకుండా నాపై పిడి గుద్దులు గుద్దారు. కన్నీరుపెట్టి వేడుకున్నా వదలకుండా ట్రిమ్మర్‌తో గుండు గీసేందుకు ప్రయత్నించారు. టాయిలెట్‌ వస్తుందని చెప్పి నేను తప్పించుకుని నా గదికి వెళ్లిపోయాను. నా తండ్రికి ఫోన్‌ చేసి చెప్పాను. ఆయన వెంటనే డయల్‌ 100 కు ఫిర్యాదు చేశారు.’’ అని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటన పై ఆరా తీశారు. ప్రాథమిక సమాచారం మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిజంగా ర్యాంగింగ్‌ జరిగితే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడినట్లు తెలిస్తే ఉపేక్షించేది లేదని కాలేజీ సూపరింటెండెంట్ కూడా తేల్చి చెప్పారు.


హైదరాబాద్‌లోని మైలార్‌ దేవుపల్లికి చెందిన విద్యార్థి సూర్యాపేట మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గత నెల 15 నుంచి జనవరి 2 వరకు సెలవులు ప్రకటించడంతో ఇంటికి వెళ్లాడు. పరీక్షలు ఉండటంతో ప్రిపేర్‌ అయ్యేందుకు ఈ నెల 1న రాత్రి 8 గంటలకు మెడికల్‌ కళాశాలకు సంబంధించిన రెడ్డి హాస్టల్‌కు చేరుకున్నాడు. రాత్రి భోజనం చేసి హాస్టల్‌లోని రెండో ఫ్లోర్‌లోని తన గదికి వెళ్లాడు. రాత్రి 8.40కు సాయి కుమార్‌ను ఫస్ట్‌ ఫ్లోర్‌కు రమ్మని హరీశ్‌తో పాటు మరికొందరు రెండో సంవత్సరం విద్యార్థులు.. కబురు పంపారు. దీంతో ఫస్ట్‌ ఫ్లోర్‌కు వచ్చిన సాయిని ఫార్మల్‌ డ్రెస్, షూ వేసుకురమ్మనగా అతను అలాగే వేసుకొని వచ్చాడు. ఆ తర్వాత దుస్తులు విప్పించి ర్యాగింగ్‌కు పాల్పడ్డారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.