Chilukuru Temple Priest CS Rangarajan | మొయినాబాద్: చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్‌పై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రంగా ఖండించారు. అర్చకులు రంగరాజన్‌‌కు బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా నిలుస్తోంది. వీడియోలు, ఫొటోలు ఆధారాలున్నా నిందితులపై ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ క్రమంలో చిలుకూరు బాలాజీ ఆలయానికి కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు బీఆర్ఎస్ నేతల బృందం వెళ్లింది. దాడికి గురైన చిలుకూరు ఆలయ అర్చకులు రంగరాజన్‌ను బీఆర్ఎస్ నేత కేటీఆర్ పరామర్శించారు. రంగరాజన్ ను పరామర్శించిన వారిలో కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇంచార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ఉన్నారు.


అసలేం జరిగిందని కేటీఆర్ అర్చకుడు రంగరాజన్‌ను అడిగి తెలుసుకున్నారు. కొందరు వ్యక్తులు వచ్చి తమది రాజరాజ్యం అని అందులో చేరాలని, సైన్యం అందించాలని బెదిరింపులకు పాల్పడినట్లు కేటీఆర్ కు ఆయన తెలిపారు. వీరరాఘవరెడ్డి చెప్పిన దానికి తాను అంగీకరించకపోవడంతో తనపై ఉద్దేశపూర్వకంగానే దాడి జరిగిందని రంగరాజన్ తెలిపారు. 


ఇది దుర్మార్గమైన చర్య.. బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలి


‘చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ ఎన్నో ఏళ్ల నుంచి ఆలయంలో సేవలు అందిస్తున్నారు. అలాంటి వ్యక్తిపై దాడికి పాల్పడటం నీచమైన, దుర్మార్గమైన కార్యక్రమం. రంగరాజన్‌పై జరిగిన దాడి తెలంగాణలో శాంతి భద్రతలు ఉన్నాయా అని ప్రజలకు తెలిసేలా చేసింది. దాడికి పాల్పడింది ఎవరైనా, వారు ఏ జెండా పట్టుకున్నా.. వారి వెనుక ఎవరున్నా అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. సౌందరరాజన్ గారి తనయుడు రంగరాజన్ నిత్యం దైవసేవలో పాల్గొంటారు. దేవుడికి పూజలు చేసే వారి పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఆందోళన మొదలైంది. దాడి చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని’ కేటీఆర్ డిమాండ్ చేశారు.


రంగరాజన్‌పై దాడి చేసిన వీరరాఘవరెడ్డి అరెస్ట్
ఇక్ష్వాకు వంశం వారసులుగా ప్రకటించుకుని ప్రకటించుకున్న వీరరాఘవరెడ్డి(Vera Raghavareddy) చిలుకూరు ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి చేయడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. ఓ ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకున్న వీరరాఘవరెడ్డి రామరాజ్యం ఏర్పాటు అంటూ గట్టిగానే ప్రచారం చేసుకుంటున్నాడు. తన అనుచరులతో కలిసి చిలుకూరు బాలాజీ ఆలయానికి శుక్రవారం ఉదయం వీరరాఘవరెడ్డి వచ్చాడు. ఆలయ పూజారి  రంగరాజన్‌తో మాట్లాడాలని పిలిచి.. రామరాజ్య స్థాపనకు ఆయన చేసిన ప్రతిపాదనను రంగరాజన్‌ తిరస్కరించారు. దాంతో ఆవేశానికి లోనైన వీరరాఘవరెడ్డి, అతడి అనుచరులు రంగరాజన్ పై దాడి చేయగా, అర్చకుడి కన్నుకు తీవ్ర గాయమైంది. రంగరాజన్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వీరరాఘవరెడ్డిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. అతడి అనుచరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.



వీసా బాలాజీగా పేరుగాంచిన చిలుకూరు బాలాజీ ఆలయాన్ని దర్శించుకునే వారికి ప్రధాన అర్చకులు రంగరాజన్ సుపరిచితులే. భక్తులకు విలువైన సూచనలు, సలహాలు ఇస్తూ వారి చేత గోవింద నామాలు స్మరించచేసే రంగరాజన్ పై దాడి జరగడాన్ని హిందువులు భరించలేకపోతున్నారు. వీరరాఘవరెడ్డి, అతడి అనుచరులు పలు ఆలయాలకు వెళ్లి తాను ఇక్వాకు వంశస్థుడినని, రామరాజ్యం స్థాపనకు తనకు సైన్యం కావాలని డిమాండ్ చేస్తుంటారు. గతంలో అతడిపై కేసులు నమోదు కావడంతో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.


Also Read: Chilukur Temple: చిలుకూరు బాలాజీ అర్చకుడు రంగరాజన్‌పై దుండగుల దాడి కేసు, నిందితుల అరెస్ట్