Kumbha Mela: ప్రపంచంలోనే  అతిపెద్ద ఆధ్యాత్మిక కలయిక మహాకుంభమేళా(Kumbh Mela)కు  భక్తులు పోటెత్తుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 40 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. సామాన్య భక్తులతోపాటు రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోంమంత్రితోపాటు తెలుగు రాష్ట్రాల మంత్రులు, ప్రముఖులు సైతం త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
 
మంత్రి కోమటిరెడ్డి పుణ్యస్నానం
తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy Venkat Reddy)  ప్రయాగరాజ్‌లో పుణ్యస్నానాలు ఆచరించారు. మహా కుంభమేళాకు వెళ్లిన ఆయన...ఆ ఆధ్యాత్మిక శోభ చూసి  భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. కోట్లాది మంది భక్తులు తరలివచ్చినా  ఎలాంటి ఇబ్బంది లేకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అద్భుతమైన ఏర్పాట్లు చేసినట్లు  ఆయన కొనియాడారు. మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో స్నానమాచరించడం  ఓ అదృష్టంగా భావిస్తున్నట్లు  ఆయన తెలిపారు. జీవితంలో ఒక్కసారి మాత్రమే  ఇలాంటి అదృష్టం వస్తుందన్నారు. పవిత్ర సంగమంలో  పుణ్యస్నానాలు చేసిన ఆయన ఇటీవల తొక్కిసలాటలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
 
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గాక తెలంగాణ (Telangana)నుంచి చాలామంది రాజకీయ ప్రముఖులు మహాకుంభమేళాకు వెళ్లారు. ఇటీవలే మాజీమంత్రి హరీశ్‌రావు సైతం సతీసమేతంగా  పుణ్యస్నానాలు చేశారు. బ్రహ్మ ముహూర్తంలో షాహీ పుణ్యస్నానం ఆచరించడం జరిగిందని...తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో  ఉండాలని దేవుడిని కోరుకున్నట్లు మంత్రి వెంకట్‌రెడ్డి తెలిపారు. అలాగే ప్రజా ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం పాటుపడేందుకు మరింత శక్తిని ప్రసాదించాలని ఆ దేవదేవుడిని కోరుకోవడం జరిగిందన్నారు.. 
 
12 ఏళ్లకు ఓసారి
ప్రయాగ్‌రాజు(Prayagraj),హరిద్వార్, ఉజ్జయిని,నాసిక్‌లో  ప్రతి 12 ఏళ్లకు  ఒకసారి  మహాకుంభమేళా జరుగుతుంది. అయితే వీటన్నింటిలో ప్రయాగ్‌రాజ్‌లో జరిగే  మహాకుంభమేళానే  అత్యంత విశిష్ఠమైనది. కోట్లాది మంది భక్తులు ఈ మహాసంబరంలో పాల్గొంటారు. జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేలా ఫిబ్రవరి 26 వరకు  కొనసాగుతుంది. సాధారణ భక్తులతోపాటు రాజకీయ ప్రముఖులు ఇప్పటికే పుణ్యస్నానాలు ఆచరించారు. ఈనెల5 న ప్రధాని నరేంద్రమోడీ(Narendra Modi) త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు చేయగా...గత నెల 27న  హోంమంత్రి అమిత్‌షా(Amith Sha) గంగమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఫిబ్రవరి 1న  ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ ప్రయాగరాజ్‌కు  రాగా...నేడు ద్రౌపతి ముర్ము ప్రత్యేక పూజలు చేశారు. మహా కుంభమేళాలో అత్యంత పవిత్రమైన రోజులుగా భావించే మౌని అమావాస్య, వసంత పంచమి రోజు భక్తులు పోటెత్తారు. ఎల్లుడి మాఘ పౌర్ణమి సందర్భంగా మరింత భక్తులు తరలిరానున్నట్లు సమాచారం. మూడో షాహీ స్నానం సందర్భంగా కోట్లాది మంది భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగి భక్తుల ప్రాణాలు కోల్పోవడంతో...ఈసారి అలాండి ఘటనలు జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున కుంభమేళా ముగియనుంది. ఇప్పటికే 40 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమం(Triveni Sanghamam)లో పుణ్యస్నానాలు ఆచరించారని సమాచారం. కుంభమేళా ముగిసే నాటికి ఈ సంఖ్య మరింత పెరగనుంది.

ప్రత్యేక ఏర్పాట్లు సాధారణ భక్తులు మహాకుంభమేళాలో  కొంత ఇబ్బందులుపడుతున్నప్పటికీ, వీఐపీలు, వీవీఐపీలకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రత్యే వసతి, భోజన సదుపాయాలు కల్పించారు.