IND vs SL, Asia Cup 2022 Live: ఆసియాకప్ నుంచి టీమ్‌ఇండియా ఔట్! లంక చేతిలో ఘోర పరాభవం
IND vs SL asia cup 2022: సూపర్- 4 లో తన రెండో మ్యాచ్ లో నేడు భారత్ శ్రీలంకతో తలపడుతోంది. ఈ మ్యాచ్ టీమిండియాకు కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ఫైనల్ తలుపులు తెరిచి ఉంటాయి.
కోరుకున్నది ఒకటి! జరిగింది మరొకటి! ఆసియాకప్‌ను 8వ సారి గెలవాలన్న టీమ్‌ఇండియా ఆశలు నెరవేరలేదు. శ్రీలంకతో జరిగిన సూపర్-4 మ్యాచులో హిట్‌మ్యాన్ సేన ఊహించని రీతిలో ఓటమి పాలైంది. 173 పరుగుల్ని కాపాడుకోలేక 6 వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది.
టీమ్‌ఇండియా పరిస్థితి అటో.. ఇటో తేలిపోనుంది. 18 ఓవర్లకు శ్రీలంక 153-4తో నిలిచింది. దసున్ శనక (22), రాజపక్స (19) దూకుడుగా ఆడుతున్నారు. ఆ జట్టు 12 బంతుల్లో 21 పరుగులు చేస్తే గెలిచేస్తుంది. ఇక ఆశలన్నీ భువీపైనే ఉన్నాయి.
16 ఓవర్లకు లంక 132-4తో నిలిచింది. భానుక రాజపక్స (17) సిక్సర్లు బాదుతున్నాడు. శనక (4) అతడికి తోడుగా ఉన్నాడు. ఆ జట్టుకు 24 బంతుల్లో 42 పరుగులు కావాలి. టీమ్‌ఇండియా కట్టుదిట్టంగా బంతులు వేయకపోతే గెలవడం చాలా కష్టం.
14 ఓవర్లకు లంక 110-3తో ఉంది. 13.5వ బంతికి గుణతిలక (1)ను అశ్విన్ ఔట్ చేశాడు. భానుక రాజపక్స (0), మెండిస్ (57) క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ ఏదైనా చేయగల సమర్థులే! వీరున్నంత వరకు భారత్‌కు గెలుపుపై ఆశలు తక్కువే!
కొద్దిగా ఆశలు చిగురిస్తున్నాయి. చాహల్ వేసిన 12వ ఓవర్లో శ్రీలంక 2 వికెట్లు చేజార్చుకుంది. తొలి బంతికి ఓపెనర్ పాథుమ్ నిసాంక (52), నాలుగో బంతికి చరిత్ అసలంక (0) ఔటయ్యారు. ప్రమాదకర కుశాల్ మెండిస్ (46), దనుష్క గుణతిలక (౦) క్రీజులో ఉన్నారు.
లంకేయులు ఛేదనను ఘనంగా ఆరంభించారు. 10 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 89 పరుగులు చేశారు. పాథుమ్ నిసాంక (50; 34 బంతుల్లో) హాఫ్ సెంచరీ చేశాడు. కుశాల్ మెండిస్ (39) సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. వీరిద్దరూ ఇలాగే ఆడితే టీమ్‌ఇండియాకు మ్యాచ్ చేజారినట్టే. ఆ జట్టుకు 60 బంతుల్లో 85 పరుగులు కావాలి. అంటే 3-4 సిక్సర్ల దూరంలోనే విజయం ఉందన్నమాట!!
8 ఓవర్లకు శ్రీలంక వికెట్ నష్టపోకుండా 74 పరుగులు చేసింది. అశ్విన్, యూజీ వేసినా పరుగులు నియంత్రణలోకి రావడం లేదు. లంకకు 72 బంతుల్లో 100 కావాలి. నిసాంక (39), మెండిస్ (35) దూకుడుగా ఆడుతున్నారు.
శ్రీలంక ఓపెనర్లు కుశాల్ మెండిస్ (24), నిసాంక (33) దూకుడుగా ఆడుతున్నారు. పవర్‌ప్లేలో భారీ స్కోరు చేశారు. సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డారు. 6 ఓవర్లకు 57 స్కోర్ అందించారు. గెలుపు సమీకరణాన్ని సింపుల్‌గా మార్చేశారు.
శ్రీలంక ఛేదన ఆరంభించింది. 3 ఓవర్లకు 17-0తో ఉంది. భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్ కట్టుదిట్టమైన లెంగ్తుల్లో బంతులు వేస్తున్నారు. రెండు వైపులా స్వింగ్ చేస్తున్నారు. నిసాంక (14) దూకుడుగా ఆడుతున్నాడు. కుశాల్ మెండిస్ (3) నిలకడగా ఆడుతున్నాడు.
శ్రీలంకతో జరుగుతున్న మ్యాచులో టీమ్‌ఇండియా మోస్తరు స్కోరే చేసింది. 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో భువీని కరుణ రత్నె ఔట్ చేశాడు. 12 పరుగులు ఇచ్చాడు. అశ్విన్ (15; 7 బంతుల్లో) ఒక సిక్సర్ కొట్టి స్కోరును 170 దాటించాడు. అర్షదీప్ (1) ఒక సింగిల్ తీశాడు.
మదుశనక వేసిన 18.1 బంతికి దీపక్ హుడా, 18.3వ బంతికి రిషభ్ పంత్ ఔటయ్యారు. ప్రస్తుతం టీమ్‌ఇండియా 158-7తో ఉంది.
టీమ్‌ఇండియా మరో వికెట్ చేజార్చుకుంది. దసున్ శనక వేసిన 17.3వ బంతికి హార్దిక్ పాండ్య (17) ఔటయ్యాడు. నెమ్మదిగా వేసిన బంతిని లాంగ్ బౌండరీ సైడ్ కొట్టబోయి నిసాంకకు క్యాచ్ ఇచ్చాడు. దీపక్ హుడా (3) క్రీజులోకి వచ్చాడు. పంత్ (17) నిలకడగా ఆడుతున్నాడు. 18 ఓవర్లకు భారత్ 157-5తో ఉంది.
టీమ్‌ఇండియా మరో వికెట్ కోల్పోయింది. శనక వేసిన 14.2వ బంతికి సూర్య (34) ఔటయ్యాడు. అయితే పంత్ (8) ఆఖరి 3 బంతుల్లో 2 బౌండరీలు కొట్టాడు. పాండ్య (4) నిలకడగా ఆడుతున్నాడు. 15 ఓవర్లకు భారత్ 127-4తో ఉంది.
టీమ్‌ఇండియా భిన్నమైన అప్రోచ్‌తో ఆడుతోంది. రోహిత్ ఔటవ్వగానే డగౌట్‌లో లేచిన రిషభ్ పంత్‌ను ఆపేశారు. అతడి బదులు హార్దిక్ పాండ్యను పంపించారు. దాంతో పంత్ నిరాశగా కూర్చుకున్నాడు. బహుశా ఫామ్‌లో ఉన్న పాండ్యకు ఎక్కువ బంతులు ఆడే అవకాశం ఇవ్వాలన్నదే కారణం కావొచ్చు. 14 ఓవర్లకు టీమ్‌ఇండియా 118-3తో ఉంది. సూర్య (34), హార్దిక్ (3) క్రీజులో ఉన్నారు.
టీమ్‌ఇండియాకు మరో షాక్ తగిలింది. విజృంభించి ఆడుతున్న రోహిత్ శర్మ (71; 41 బంతుల్లో) ఔటయ్యాడు. కరుణ రత్నె ఆఫ్‌సైడ్‌గా వేసిన 12.2వ బంతిని బౌండరీ బాదబోయి నిసాంకకు క్యాచ్ ఇచ్చాడు. క్రీజులో పాండ్య, సూర్య ఉన్నారు.
టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వీర విహారం చేస్తున్నారు. సిక్సర్లు, బౌండరీలతో డీల్ చేస్తున్నాడు. 40 బంతుల్లో 72 కొట్టాడు. అతడికి సూర్య (28) సపోర్ట్ చేస్తున్నాడు. సింగిల్స్‌తో స్ట్రైక్ ఇస్తూనే దొరికితే బౌండరీలు కొడుతున్నాడు. 12 ఓవర్లకు స్కోరు 109-2తో ఉంది. రోహిత్ సెంచరీ చేసేలా ఉన్నాడు.
టీమ్‌ఇండియా జోరు పెంచింది. 10 ఓవర్లకు 79-2తో నిలిచింది. రోహిత్ శర్మ (53) దొరికిన బంతిని సిక్సర్‌గా మలుస్తున్నాడు. లేదంటే బౌండరీకి పంపిస్తున్నాడు. అతడికి తోడుగా సూర్య కుమార్ (17) ఉన్నాడు. హిట్‌మ్యాన్‌కు ఎక్కువగా స్ట్రైక్ ఇస్తున్నాడు.
లంకతో మ్యాచులో పవర్ ప్లే పూర్తైంది. వెంటవెంటనే 2 వికెట్లు కోల్పోయిన టీమ్‌ఇండియా కాస్త కోలుకుంది. రోహిత్ (29) మూడు బౌండరీలు, ఒక సిక్సర్ కొట్టడంతో కాస్త స్కోరు వచ్చింది. 6 ఓవర్లకు 44-2తో నిలిచింది. సూర్య (6) అతడికి తోడుగా ఉన్నాడు.
దిల్షాన్ మదుశనక వేసిన 2.4వ బంతికి విరాట్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వికెట్లు ఎగిరిపోయాయి. టీమ్‌ఇండియా ఆదిలోనే కష్టాల్లో పడింది. 3 ఓవర్లకు భారత్ 15-2తో ఉంది.
టీమ్‌ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. థీక్షణ వేసిన 1.5 వ బంతికి కేఎల్ రాహుల్ (6) ఔటయ్యాడు. ముందుకొచ్చి ఆడిన అతడి కాలికి బంతి తగిలింది. అంపైర్ ఎల్బీ ఇచ్చాడు. రివ్యూ తీసుకున్నా రాహుల్‌కు అదృష్టం కలిసిరాలేదు. 2 ఓవర్లకు టీమ్‌ఇండియా 11-1తో ఉంది.
శ్రీలంకతో జరుగుతున్న సూపర్ 4 మ్యాచులో టీమ్‌ఇండియా టాస్ ఓడింది. ప్రత్యర్థి జట్టు సారథి దసున్ శనక వెంటనే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఛేదనకు పిచ్ అనుకూలిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
Background
IND vs SL Asia Cup 2022:ఆసియా కప్ 2022లో టీమ్‌ఇండియా, శ్రీలంక తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ రోహిత్ సేనకు అత్యంత కీలకం. ఇందులో ఓడిపోతే దాదాపుగా ఇంటికెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గెలిస్తేనే ఫైనల్‌కు వెళ్లే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.
బ్యాటింగ్ ఓకే.. .. కానీ
పాక్ తో మ్యాచ్ లో ఓపెనర్లు ధనాధన్ బ్యాటింగ్ చేశారు. తొలి 6 ఓవర్లలో ఫీల్డింగ్ పరిమితులను ఉపయోగించుకుని వేగంగా పరుగులు రాబట్టారు. అయితే రోహిత్, రాహుల్ మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచాల్సి ఉంది. విరాట్ కోహ్లీ ఫాం అందుకోవడం భారత్ కు కలిసొచ్చే అంశం. ఆడిన 3 మ్యాచ్ ల్లోనూ కోహ్లీ మంచి పరుగులు చేశాడు. అయితే ఇంకా వేగంగా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. పాక్ తో మ్యాచ్ లో మిడిలార్డర్ వైఫల్యం కూడా కొంపముంచింది. పంత్, పాండ్య, దీపక్ హుడా పెద్దగా పరుగులు చేయలేదు. ఈ మ్యాచ్ లో కీపర్ రిషబ్ పంత్ కు బదులు దినేశ్ కార్తీక్ ను తీసుకుంటారేమో చూడాలి.
బౌలింగ్ తీరు మారాలి
బ్యాటింగ్ లో ఫామ్ చూపిస్తున్న భారత్ ను బౌలింగ్ విభాగం కలవరపెడుతోంది. గాయాలతో బుమ్రా, హర్షల్ పటేల్ టోర్నీకి ముందే దూరమవటంతో బౌలింగ్ విభాగం బలహీనపడింది. జడేజా మధ్యలో గాయపడి అందుబాటులో లేకుండా పోయాడు. అర్హదీప్ బాగానే బౌలింగ్ చేస్తున్నా, అవేష్ ఖాన్ అంతగా రాణించట్లేదు. ప్రధాన స్పిన్నర్ చహాల్ వికెట్లు తీయలేకపోతున్నాడు. గత మ్యాచ్ లో ఆరో బౌలర్ లేనిలోటు స్పష్టంగా కనిపించింది. హుడా స్పిన్ వేయగలిగినా రోహిత్ అతన్ని ఉపయోగించుకోలేదు. జడేజా స్థానంలో ఎంపికైన అక్షర్ పటేల్ ను ఈరోజు ఆడిస్తారేమో చూడాలి. అతను టీంలోకి వస్తే రవి బిష్ణోయ్ పెవిలియన్ కే పరిమితం అవ్వాల్సి ఉంటుంది. అలాగే విఫలమవుతున్న చహాల్ స్థానంలో అశ్విన్ ను తీసుకుంటారేమో చూడాలి. ఏదేమైనా బౌలింగ్ విభాగం రాణించకపోతే గెలవడం కష్టమే.
లంక చేతిలో భారత్ ఓడితే పైనల్ దారులు దాదాపు మూసుకుపోయినట్లే. చివరి మ్యాచ్ లో అఫ్గాన్ పై నెగ్గినా చాలా సమీకరణాలు కలిసిరావాలి. కాబట్టి అంతవరకు రాకుండా ఉండాలంటే బలహీనతల్ని అధిగమించి, సమష్టిగా ఆడి శ్రీలంకపై గెలవాలి.
పిచ్ పరిస్థితి
దుబాయ్ పిచ్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉంది. మొదట టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ కు మొగ్గుచూపొచ్చు.
గత రికార్డు
ఇప్పటివరకూ శ్రీలంక- భారత్ 25 టీ20ల్లో తలపడ్డాయి. అందులో 17 మ్యాచుల్లో టీమిండియా గెలిచింది. ఏడింట్లో లంక విజయం సాధించగా.. ఒక దాంట్లో ఫలితం తేలలేదు.
భారత్ తుది జట్టు (అంచనా)
రోహిత్ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్, పంత్ దినేశ్ కార్తీక్, పాండ్య, భువనేశ్వర్ కుమార్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్ రవి బిష్ణోయ్, అర్హదీప్ సింగ్, చహాల్ అశ్విన్.
శ్రీలంక తుది జట్టు (అంచనా)
నిశాంక్, కుశాల్ మెండిస్, అసలంక, గుణతిలక, భానుక రాజపక్స, దసున్ శనక (కెప్టెన్), హసరంగ, చామిక కరుణరత్నే, తీక్షణ, దిల్షాన్, మదుశంక.
- - - - - - - - - Advertisement - - - - - - - - -