Like America UK has also decided to deport those who are working illegally: అమెరికా తమ దేశం నుంచి అక్రమ వలసదారుల్ని పంపేస్తున్నట్లుగానే యూకే కూడా అదే పని చేయాలని నిర్ణయించుకుంది. చాలా మంది అక్రమ మార్గాల్లో యూకేకు వస్తున్నారు .. అలా వచ్చిన వారు ఇల్లీగల్ గా పని చేస్తున్నారని. దానికి ముగింపు పలకబోతున్నామని యూకే ప్రధాని స్టార్మర్ ట్వీట్ చేశారు.
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అవగానే దేశంలోకి అక్రమంగా చొరబడిన వారందర్నీ డిపోర్ట్ చేయడం ప్రారంభించారు. ఇండియాకు చాలా స్వల్పంగానే తరలించారు.. మెక్సికో వంటి దేశాలకు అత్యధిక మందిని తరలించారు. అలాగే వీసా నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా పని చేస్తున్నా సరే ఉపేక్షించడం లేదు. వెంటనే పంపేస్తున్నారు. దీంతో అక్కడి విద్యార్థులు పార్టుటైమ్ ఉద్యోగాలు చేయడం కూడా మానేశారు. ఎవరూ బయటకు రాకుండా.. కాలేజీల్లోనే ఉంటున్నారు. వాలిడ్ వీసా దొరకదు అనుకున్నవారు తిరిగి వెళ్లిపోతున్నారు.
ఇప్పుడు అదే పద్దతిలో యూకే ప్రధాని కూడా చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు. అమెరికా తర్వాత ఇండియా నుంచి అత్యధిక మంది విద్యార్థులు ఇటీవలి కాలంలో లండన్ వెళ్తున్నారు. అక్కడ యూనివర్శిటీల్లో ఫీజులు కట్టి చేరి.. పార్టుటైమ్ ఉద్యోగాలు చేసుకుంటూ టైం పాస్ చేస్తున్నారు. అక్కడ చదువు కాకుండా ఉద్యోగం చేస్తూ ఉండాలంటే హై స్కిల్ ఎంప్లాయీ అయి ఉండాలి. అయితే అక్కడ చదువుకోవడానికి వెళ్లే అత్యధిక మంది చదువు కన్నా కొంత కాలం పని చేసి ఎంతో కొంత సంపాదించుకుందామని అనుకునేవారు. అందుకే ఇప్పుడు యూకే ప్రధాని కూడా అలాంటి వారందర్నీ పంపేయాలని అనుకుంటున్నారు.
యూకే ప్రధాని స్టార్మర్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని అనుకోలేదు. అమెరికా స్థాయిలో కాకపోయినా యూకేకు కూడా సరైన పత్రాలు లేకుండా వలస వచ్చేవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారి సంఖ్య రాను రాను పెరుగుతోంది. శాంతిభద్రతల సమస్య కూడా ఏర్పడుతోంది. ఈ కారణంగానే అందర్నీ డిపోర్టు చేయాలని స్టార్మర్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అయితేకొంత మంది మాత్రం స్టార్మర్ అలాంటి ప్రకటనలే చేస్తారు కానీ నిర్ణయం తీసుకోరని అంటున్నారు.
కారణం ఏదైనా .. ట్రంప్ విధానాన్ని కొన్ని అగ్రదేశాలు పాటించేందుకు సిద్ధమవుతున్నాయి.