Donald Trump Global Trade War: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తాను చెప్పినట్లే, అమెరికాలోకి వస్తున్న ఉత్పత్తులపై సుంకాలను (దిగుమతి సుంకాలు) పెంచేస్తున్నారు. తాజా, అమెరికాలోకి దిగుమతి చేసుకునే ఉక్కు & అల్యూమినియంపై 25 శాతం సుంకాన్ని (25 percent tariff on sreel and aluminium imports) ఆయన ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ ప్రకటన వెంటనే అమల్లోకి రాలేదు, కానీ ఒకటి లేదా రెండు రోజుల్లో ఇది అమల్లోకి వస్తుంది. ఆదివారం న్యూ ఓర్లీన్స్‌లోని ఎయిర్ ఫోర్స్ వన్‌లో మీడియా ముందు అమెరికా అధ్యక్షుడు ఈ ప్రకటన చేశారు. ఇది ప్రపంచంలోని అన్ని దేశాలకు వర్తిస్తుందని ట్రంప్ అన్నారు. అంటే, భారత్ అమెరికాకు ఎగుమతి చేసే ఉక్కు & అల్యూమినియం ఉత్పత్తులపైనా ఈ ప్రభావం ఉంటుంది.
అమెరికాలోకి దిగుమతి చేసుకునే ఉక్కు & అల్యూమినియంపై 25 శాతం సుంకానికి సంబంధించిన అధికారిక ప్రకటన, అమెరికా కాలమానం ప్రకారం సోమవారం, ఫిబ్రవరి 10న వెలువడుతుంది. ఆ తర్వాత, ఇది ఒకటి లేదా రెండు రోజుల్లో అమలులోకి వస్తుంది. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని రోజులకే, డోనాల్డ్ ట్రంప్, అమెరికాతో వ్యాపారం చేసే దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలను సమీక్షిస్తానని, అందరినీ ఓ పట్టు పడతానని వార్నింగ్ ఇచ్చారు. అలాగే, అమెరికా విధానాలకు సహకరించని దేశాల దిగుమతులపై సుంకాలు పెంచుతానని హెచ్చరించారు. కొన్ని రోజుల ముందు, చైనా, కెనడా & మెక్సికో నుంచి దిగుమతులపై భారీ సుంకాలను విధించడం ద్వారా ట్రంప్ తన ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా వ్యక్తం చేశారు. సుంకాల యుద్ధం శ్రేణిలో ఇది ట్రంప్ చేసిన రెండో దాడి అనుకోవాలి. రెండో దాడిలో, అన్ని దేశాల నుంచి లోహ దిగుమతులపై సుంకాలు విధించడం ద్వారా అన్ని దేశాలను కలిపి ట్రంప్ దెబ్బకొట్టారు.
లోహ దిగుమతులపై సుంకాలు ఎందుకు పెంచారు?
లోహ దిగుమతులపై సుంకాలు పెంచుతూ డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచాన్ని కచ్చితంగా ఆశ్చర్యపరచదు. ఎందుకంటే, ట్రంప్ వైఖరి అదే. ఎన్నికల ప్రచార సమయంలోనూ సుంకాల యుద్ధం గురించి ట్రంప్ పదేపదే చెప్పారు. ఇప్పుడు ఆ మాటలు నిజం చేసి చూపిస్తున్నారు. అయితే, లోహ దిగుమతులపై సుంకాలు పెంచడం వెనుక ఉన్న తర్కాన్ని కూడా ట్రంప్ వెల్లడించారు. అమెరికన్ పరిశ్రమలను రక్షించడం & వాణిజ్య సమతుల్యతను మెరుగుపరచడమే తన ఉద్దేశ్యం అని ట్రంప్ చెబుతున్నారు. మీడియా నివేదికల ప్రకారం, ఇది అదనపు లోహ సుంకాల కిందకు వస్తుంది, ఈ వారం చివరి నాటికి పూర్తి స్పష్టత వస్తుంది.
పెరుగుతున్న ప్రపంచ వాణిజ్య యుద్ధం ముప్పు
పైకి వ్యక్తం చేయకున్నా, అమెరికా అధ్యక్షుడి చర్యతో ప్రపంచ దేశాలు లోలోన మండిపడుతున్నాయి. ట్రంప్ దూకుడు ప్రపంచ వ్యాపార నాయకుల ఆందోళనలను మరింత తీవ్రంగా మార్చింది. అమెరికా లోహ దిగుమతులపై సుంకాలను ప్రకటించడంతో, కొన్ని ప్రధాన దేశాలు ప్రతీకార దాడిని తప్పక ప్రారంభిస్తాయి. ఈ కారణంగా, ప్రపంచంలో వాణిజ్య యుద్ధం తీవ్రత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు భయపడుతున్నారు.
మరో ఆసక్తికర కథనం: రెపో రేటు తగ్గడం వల్ల మీ హోమ్ లోన్‌లో 10 EMIలు కట్టక్కర్లేదు, ఇదిగో లెక్క