ఐసీసీ టోర్నీల్లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. అందుకు ఏ మాత్రం తీసిపోవు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పోరాటాలు! దాదాపుగా దాయదుల తరహాలోనే ఈరెండు జట్ల మధ్య వైరానికి ఎంతో చరిత్ర ఉంది. అందుకే శనివారం దుబాయ్ వేదికగా వీరి మధ్య జరిగే సూపర్ 12 మ్యాచుపై అంచనాలు భారీగా ఉన్నాయి. వీరిలో ఎవరిపై ఎవరిది పైచేయి అవుతుందో చూడాల్సిందే!
నువ్వా - నేనా!
టీ20ల్లో ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 19 సార్లు తలపడగా 10 సార్లు ఆంగ్లేయులే గెలిచారు. ఒక మ్యాచ్ ఫలితం తేల్లేదు. ఈ రెండు జట్లు పోటీ పడితే మైదానంలో జోష్ వచ్చేస్తుంది. ఆటగాళ్లు నువ్వా నేనా అన్నట్టు తలపడతారు. ఫామ్ పరంగా చూస్తే ఇంగ్లాండ్‌కు తిరుగులేదు. పొట్టి క్రికెట్లో చివరి ఐదు మ్యాచుల్లో ఆఖరి నాలుగు వరుసగా గెలిచింది. ఆసీస్ సైతం మూడు విజయాలతో ఉంది. ఇక ప్రపంచకప్‌లో చెరో రెండు మ్యాచులు గెలిచి 4 పాయింట్లతో టాప్-2లో ఉన్నాయి. ఈ రోజు గెలిచిన వారు 6 పాయింట్లతో టాప్‌లోకి వెళ్లిపోతారు.
ఆ ఇద్దరితో జాగ్రత్త
నాలుగేళ్లుగా ఇంగ్లాండ్‌కు పరిమిత ఓవర్ల క్రికెట్లో తిరుగులేదు! నిర్భయంగా క్రికెట్ ఆడుతూ ప్రపంచాన్ని ఎంటర్‌టైన్ చేస్తోంది. ఆ జట్టుకు అన్ని రకాల వనరులూ ఉన్నాయి. బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లకు కొదవలేదు. గత రెండు మ్యాచుల్లో పవర్‌ప్లేలో మొయిన్ మూడు ఓవర్లు వేశాడు. ఈ సారీ అదే వ్యూహం అమలు చేయొచ్చు. కానీ పవర్‌ప్లేలో ఆఫ్‌స్పిన్‌పై ఆరోన్ ఫించ్‌కు 177 స్ట్రైక్‌రేట్ ఉంది. క్రిస్ జోర్డాన్‌పై స్టాయినిస్‌కు తిరుగులేదు. అతడి బౌలింగ్‌లో 36 బంతుల్లోనే 87 పరుగులు చేశాడు. ఒక్కసారీ ఔట్ అవ్వలేదు. ఇవి రెండూ ఇంగ్లాండ్ చూసుకోవాలి. భీకరమైన పేస్‌తో భయపట్టే మార్క్‌వుడ్ గాయపడటం ఆంగ్లేయులకు బాధాకరమే. ఏదేమైనా ఆ జట్టులో ఏ ఇద్దరు బ్యాటర్లు రాణించినా భారీ స్కోరు ఖాయం.
ఆసీస్‌కు అడ్వాంటేజ్
డేవిడ్ వార్నర్ ఫామ్‌లోకి రావడంతో ఆస్ట్రేలియాకు ఓపెనింగ్ కష్టాలు పోయినట్టే! ఫించ్‌తో అతడు దంచికొడితే పరుగుల వరద పారుతుంది. ఇక మిచెల్ మార్ష్, స్టీవ్‌స్మిత్, మ్యాక్స్‌వెల్, స్టాయినిస్, మాథ్యూవేడ్‌తో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. అవసరమైతే కమిన్స్, స్టార్క్ కూడా పరుగులు చేయగలరు. హేజిల్‌వుడ్, స్టార్క్, కమిన్స్ వంటి పేసర్లకు ఆడమ్ జంపా స్పిన్ బౌలింగ్‌తో అండగా ఉంటున్నాడు. అవసరమైతే ఆరో బౌలర్‌గా మాక్సీ, స్టాయినిస్ ఉపయోగపడతారు. ఆసీస్‌కు ఇంగ్లాండ్‌పై సైకలాజికల్ అడ్వాంటేజ్ ఉంది. ఛేదనకు దిగితే మాత్రం ఆసీస్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువుంటాయి. ఒకవేళ ఇంగ్లాండ్ టాస్ గెలిస్తే పరిస్థితి ఉత్కంఠగా మారుతుంది.
Also Read: IPL 2022 Retention Rules: కొత్త రూల్స్ ఇవే! ఐపీఎల్ జట్లు ఎంతమందిని అట్టిపెట్టుకోవచ్చంటే..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి