Sri Rama Navami 2024 Ramanarayanam Temple: శ్రీరాముడు తన కోదండం ఎక్కుపెట్టినట్టు నిర్మించిన ఈ ఆలయం ఉత్తరాంధ్రలో ప్రత్యేక ఆకర్షణ. విజయనగరం నుంచి కోరుకొండ వెళ్లేదారిలో విజయనగరం రైల్వే స్టేషన్ కు 9 కిలోమీటర్ల దూరంలో NCS ట్రస్ట్ నిర్మించిన దేవాలయం ఇది. ఆ ట్రస్ట్ వ్యవస్థాపకులు నారాయణం నరసింహ మూర్తి కోరిక మేరకు ఆయన కుమారులు నిర్మించారు. గరికపాటి నరసింహారావు ,చాగంటి కోటేశ్వర రావు సహా పలువురు ప్రముఖులు 2014 మార్చి 22 న ఈ ఆలయాన్ని ప్రారంభించారు. 15 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ ఆధ్యాత్మిక కట్టడం మంచి పర్యాటక ప్రదేశం కూడా...
Also Read: రామయ్య ఆకాశం సీతమ్మ పుడమి - ఇద్దరి కళ్యాణం ప్రకృతికి పులకరింత!
కోదండం ఆకారంలో ఆలయం
ధనుస్సు ఆకారంలో నిర్మించి ఈ ఆలయంలో వాల్మీకి మహర్షి రచించిన రామాయణంలో ముఖ్యమైన సన్నివేశాలను 72 ఘట్టాలుగా విభజించి 72 విగ్రహాలుగా చెక్కారు. శ్రీ మహా విష్ణువు ఆలయంతో మొదలయ్యే ధనుస్సు ఆకారం ఆ చివర రామచంద్రుడి ఆలయంతో ముగుస్తుంది. అంటే శ్రీ మహావిష్ణువు అవతారమే రాముడు అని చెప్పడం. సరిగ్గా ధనుస్సు మధ్యలో 60 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం నిర్మించారు . ఈ ఆలయపు ధనుస్సు ఆకారం ఎంత విశిష్టమైందో ... ఆ 60 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం కూడా అంతే ప్రత్యేకమైంది.
Also Read: చెప్పుడు మాటలు విని తర్వాత పశ్చాత్తాప పడితే ఏ లాభం - అయోధ్యకాండలో ఆసక్తికర విషయాలివే!
రెండస్తుల్లో ఎక్కడ ఏమున్నాయి
రెండంతస్తులుగా నిర్మితమైంది ఆలయంలో బయట జయ విజయులు, గరుత్మంతుడు, శుకుడు, నారద తుంబురుల విగ్రహాలు ఉన్నాయి. కింద మెట్లకు ఇరువైపులా 16 అడుగుల ఎత్తున్న శ్రీ మహాలక్ష్మి, శ్రీ సరస్వతుల విగ్రహాలు కనిపిస్తాయి. ఈ రెండు విగ్రహాల దగ్గర ఫౌంటెన్ లు ప్రత్యేక ఆకర్షణ. మెట్లకు ముందు ఈ ఆలయాన్ని నిర్మించిన నారాయణం నరసింహమూర్తి విగ్రహం...పెద్ద పూలతోట ఉంటుంది. కింద అంతస్తులో అల్పాహార శాల, అన్న ప్రసాద శాల, గ్రంథాలయం, వేద పాఠశాల, ధ్యాన మందిరం, కళ్యాణ మండపం, గోశాల ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో వేదపాఠశాల నిర్వహిస్తున్నారు.
ఇతర దేవతలు కూడా కొలువైయ్యారు
రామనారాయణం ఆలయంలో ఇతర దేవతలకు చెందిన చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. ఆయా దేవతా మూర్తుల జన్మ నక్షత్రాన్ని బట్టి ఆ రోజుల్లో ప్రత్యేక పూజలూ జరుగుతుంటాయి . రామాయణ ఘట్టాలు వివరించేలా చెక్కిన విగ్రహాల దగ్గర ఆ ఘట్టాలను వివరిస్తూ తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో రాశారు.
Also Read: ఈ ఏడాది మే 1 నుంచి నర్మదానది పుష్కరాలు - ఘాట్ల వివరాలివే!
లేజర్ షో ప్రత్యేక ఆకర్షణ
మామూలుగా చూస్తేనే అందంగా కనపడే ఈ ఆలయ నిర్మాణాన్నిఎత్తునుంచి చూస్తే అద్భుతం అనిపిస్తుంది . పగటిపూట కన్నా రాత్రివేళ విద్యుత్ కాంతుల్లో వెలిగిపోతుంది. ప్రతిరోజూ సాయంత్రం వేళ.. 60 అడుగుల ఆంజనేయ స్వామిపై ప్రదర్శించే 3D మ్యాపింగ్ లేజర్ షో భక్తులను అలరిస్తుంది. శ్రీరామనవమి రోజు మరింత ప్రత్యేకం. ఈ తరం పిల్లలకు రామాయణం గురించి చెప్పాలి అనుకుంటే ఈ ఆలయాన్ని సందర్శించండి.
Also Read: రామచంద్రుడి నుదుట సూర్యుడు - అయోధ్య రామ మందిరంలో అద్భుతం ఈ ఏడాది శ్రీరామ నవమికే!