BJP Election Manifesto 2024 Highlights: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మేనిఫెస్టోను (Bjp Manifesto 2024) విడుదల చేసింది. 'సంకల్ప పత్రం' (Sankalpa Patram) పేరుతో ప్రజల ముందుకు తమ ఎన్నికల హామీలను తీసుకొచ్చింది. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ప్రధాన మంత్రి మోదీ, ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్ ఆదివారం మేనిఫెస్టోను ఆవిష్కరించారు. మోదీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్ తో మొత్తం 14 అంశాలతో మేనిఫెస్టోను రూపొందించారు.
15 లక్షల సలహాలు
కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల కమిటీ ఈ సంకల్ప పత్రాన్ని రూపొందించింది. దేశ ప్రగతి, మహిళలు, యువత, పేదలు, రైతులే అజెండాగా మేనిఫెస్టోను రూపొందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేనిఫెస్టో రూపకల్పన కోసం దాదాపు 15 లక్షల సలహాలు, సూచనలు పరిశీలించింది. మేనిఫెస్టోలో 14 అంశాలను చేర్చగా.. విశ్వబంధు, సురక్షిత భారత్, సమృద్ధ భారత్, ఈజ్ ఆఫ్ లివింగ్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, సాంస్కృతిక వికాసం, సాంకేతిక వికాసం, సుపరిపాలన, స్వస్థ భారత్, అత్యుత్తమ శిక్షణ, సంతులిత అభివృద్ధి, క్రీడా వికాసం, సుస్థిర భారత్ ప్రధానంగా ఉన్నాయి.
మేనిఫెస్టోలో ముఖ్యాంశాలివే..
☛ మరో ఐదేళ్లు ఉచిత రేషన్
☛ 3 కోట్ల ఇళ్ల నిర్మాణం
☛ పైప్ లైన్ ద్వారా ఇంటింటికీ వంట గ్యాస్
☛ 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ లో భాగంగా రూ.5 లక్షల వరకూ ఉచిత వైద్యం
☛ ముద్ర రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంపు
☛ దివ్యాంగుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం
☛ ట్రాన్స్ జెండర్లకు సైతం ఆయుష్మాన్ భారత్
☛ 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చే ప్రణాళిక, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
☛ డెయిరీ సహకార సంఘాల సంఖ్య పెద్ద సంఖ్యలో పెంపు, కూరగాయల సాగు, నిల్వ కోసం కొత్త క్లస్టర్లు
☛ ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం, మత్స్య ఉత్పత్తి, ప్రాసెసింగ్ కోసం ప్రత్యేక క్లస్టర్లు వంటి కీలక హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచారు.
Also Read: బోర్న్‌విటాతో చిన్నారులకు ముప్పు, ఈ-కామర్స్ కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు