Bournvita Drink: బోర్న్‌విటా (Bournvita) కంపెనీకి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈకామర్స్ కంపెనీలు బోర్న్‌విటాని హెల్త్ డ్రింక్స్ కేటగిరీలో నుంచి తొలగించాలని తేల్చి చెప్పింది. పోర్టల్స్ నుంచి వెంటనే తీసేయాలని ఆదేశించింది. బోర్న్‌విటాతో పాటు ఇతర డ్రింక్స్‌ని కూడా తొలగించాలని స్పష్టం చేసింది. వాటిని హెల్తీ డ్రింక్స్‌గా పరిగణించలేమని వెల్లడించింది. ఆహార భద్రతా ప్రమాణ సంస్థ ప్రకారం హెల్త్ డ్రింక్‌కి ఎలాంటి నిర్వచనం లేదని, అలాంటప్పుడు కొన్ని డ్రింక్స్‌ని ఆ ట్యాగ్ తగిలించి ఆ కేటగిరీలో ఎలా ఉంచుతారని ప్రశ్నించింది. ఏప్రిల్ 10వ తేదీనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. National Commission for Protection of Child Rights ఇలా అప్రమత్తం చేసింది. బోర్న్‌విటాలో షుగర్ లెవెల్స్ పరిమితికి మించి ఉన్నాయని వెల్లడించింది. Food Safety and Standards Authority of India (FSSAI) వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ప్రమాణాలకు తగ్గట్టుగా లేని డ్రింక్స్‌ని హెల్త్ డ్రింక్స్‌గా ప్రమోట్ చేయాడన్ని ఖండించింది. 


నిజానికి ఆహార చట్టాల్లో ఎక్కడా ఈ హెల్త్ డ్రింక్స్‌ గురించి ప్రస్తావించలేదు. అసలు అందుకు సంబంధించిన డెఫినేషన్ లేదు. గత నెల కూడా ఈకామర్స్ కంపెనీలకు ఇలాంటి హెచ్చరికలే చేసింది. డైరీ ఉత్పత్తులనూ హెల్తీ డ్రింక్స్ కేటగిరీలో చేర్చి విక్రయిస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. ఇదంతా ఇప్పుడు వెలుగులోకి రావడానికి ఓ కారణముంది. ఓ యూట్యూబర్ బోర్న్‌విటాలో ఏవో పౌడర్‌లు కలుపుతున్నారని, చక్కెర స్థాయి ప్రమాదకరంగా ఉందని చెప్పాడు. అంతే కాదు. ఇందులో కలుపుతున్న రంగులు చిన్నారుల ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయని హెచ్చరించాడు. క్యాన్సర్ కూడా వస్తుందని ఆందోళన వ్యక్తం చేశాడు. అలా మొదలైన వివాదం ఇక్కడి వరకూ వచ్చింది.