Narmada Pushkaralu 2024: ప్రతి నదికి పన్నెండేళ్లకు ఓసారి వచ్చే అతిపెద్ద పండుగ పుష్కరాలు. సంవత్సరానికో నదికి చొప్పున పుష్కరాలు జరుగుతాయి. 12 నదులకు ఒక్కో నదికి ఒక్కో ఏడాది పుష్కరాలు జరుగుతాయి. గతేడాది గంగానది పుష్కరాలు జరిగాయి...2024 లో నర్మదానదికి పుష్కరాలు జరగనున్నాయి. బృహస్పతి వృషభరాశిలో ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటూ నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి. 


Also Read: చిన్న చిన్న లాభాల కోసం మీ బంధాన్ని రిస్క్ లో పెట్టొద్దు - రాశి ఫలాలు 1 మే 2024 !


ఓంకారేశ్వర్ -మధ్యప్రదేశ్


పన్నెండు జ్యోతిర్లింగాలలో ఓంకారేశ్వర్ ఒకటి . మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో న‌ర్మ‌దా న‌ది తీరంలో కొలువయ్యాడు  ఓంకారేశ్వరుడు. ఇక్కడున్న అమ్మవారు అన్నపూర్ణదేవి. సంస్కృత ఓం ఆకారంలో వెలసిన ఈ క్షేత్రంలో ఓంకారేశ్వర లింగం , అమలేశ్వర లింగం పక్కపక్కనే ఉండడం విశేషం. ఇక్కడ అమర్‌కంటక్ ఆలయం, ఓంకారేశ్వర్ ఆలయం, చౌసత్ యోగిని ఆలయం, చౌబీస్ అవతార్ ఆలయం, మహేశ్వర్ ఆలయం, నెమవార్ సిద్ధేశ్వర్ మందిరం , భోజ్‌పూర్ శివాలయం చాలా పురాతనమైనవి.  


నర్మదా నది ఒడ్డున ఘాట్లు ఇవే


ఓంకారేశ్వర్‌లో నర్మదా నది ఒడ్డున ఘాట్లు సిద్దమయ్యాయి.  ఘాట్లలో నది లోతు కూడా ఎక్కువగా ఉండదు. భక్తులు లోతు నీటిలోకి వెళ్లకుండా కాపాడేందుకు ఇనుప వలలు, పడిపోకుండా పట్టుకునే చైన్‌లను ఏర్పాటు చేశారు. భద్రక కోసం సేఫ్టీ బోటు కూడా ఏర్పాటు చేశారు. ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న కోటి తీర్థ ఘాట్ అన్ని ఘాట్‌లలో అత్యంత ముఖ్యమైనది. ఈ ఘాట్ లో స్నానమాచరిస్తే కోటి తీర్థయాత్రల పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక మిగిలిన ఘాట్ల విషయానికొస్తే....చక్ర్ తీర్థ ఘాట్  , గౌముఖ్ ఘాట్  , భైరోన్ ఘాట్  ,కేవల్రామ్ ఘాట్  , నగర్ ఘాట్  , బ్రహ్మపురి ఘాట్  , సంగం ఘాట్  , అభయ్ ఘాట్


Also Read: శివుడిని నేరుగా దర్శించుకోకూడదా!
 
పుష్కరాలు ఎలా మొదలయ్యాయి!


తుందిలుడు అనే మహర్షి ఘోర‌ తపస్సుకి మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమై వ‌రం కోరుకోమంచే నేను నీలో శాశ్వతంగా ఉండిపోయేలా వ‌రాన్ని ప్రసాదించ‌మ‌ని అడిగాడు. అప్పుడు శివుడు తనలో ఉన్న జలశక్తికి ప్రతీకగా తుందిలుడిని నియమించాడు. అలా ముల్లోకాల్లో ఉన్న నదులకు తుందిలుడు ప్రతినిధి అయ్యాడు. జీవరాశుల మనుగడకు జలమే జీవనాధారం కాబట్టి తుందిలుడిని పుష్కరుడు ( పోషించేవాడు) అని పిలుస్తారు. మరో కథనం ప్రకారం పుష్కరుడనే బ్రాహ్మణుడు పరమేశ్వరుడికోసం తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన భోళాశంకరుడు వరం కోరుకోమంటే..జీవులు చేసిన పాపాలతో నదులు అపవిత్రమైపోతున్నాయని...తన స్పర్శతో నదులు పునీతం అయ్యే వరం ప్రసాదించమని కోరుకున్నాడు. నువ్వు ఏనదిలోకి ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థం అవుతుందని..ఏడాదికి ఓ నది చొప్పున 12 ఏళ్లకు 12 నదుల్లో ప్రవేశిస్తావని వరమిచ్చాడు శంకరుడు. పుష్కరుడికి ఇచ్చినవరంలో భాగం కావాలని దేవగురువు బృహస్పతి అడగడంతో.. బృహస్పతి రాశిమారినప్పుడే పుష్కరుడు ఆ నదిలోకి ప్రవేశిస్తాడు.


Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే


ఈ ఏడాది మే 1 నుంచి 12 వరకూ నర్మదానది పుష్కరాలు జరుగుతున్నాయి. పుష్కరస్నానం చేస్తే జన్మజన్మల పాపాలు నశిస్తాయనీ అక్కడ పిండప్రదానాలు చేస్తే పితృదేవతలు పుణ్యలోకాలు పొందుతారని పురాణాలు చెబుతున్నాయి.