Ram Navami 2024: ఏప్రిల్ 17 శ్రీరామనవమి... తెలుగు నూతన సంవత్సరాది చైత్ర పాడ్యమి రోజ ఉగాది జరుపుకుంటాం. అక్కడి నుంచి వచ్చే తొమ్మిదో తిథి నవమి...ఈ రోజునే శ్రీరామ నవమి. ఏటా శ్రీరామ నవమి భద్రాద్రి, ఒంటిమిట్ట, రామతీర్థం లాంటి ప్రత్యేక వైష్ణవ ఆలయాల్లో కన్నుల పండువగా జరిగేది. ఈ ఏడాది నవమికి మరింత ప్రత్యేకత ఏంటంటే...తన జన్మభూమి అయోధ్యలో శ్రీరామ చంద్రుడు కొలువుతీరిన తర్వాత వచ్చిన మొదటి శ్రీరామ నవమి. వేల సంవత్సరాలకు పైగా చెక్కుచెదరకుండా నిర్మించిన అయోధ్య ఆలయంలో అడుగడుగునా ప్రత్యేకతలే. అందులో ఒకటి సూర్య తిలకం. ఏటా శ్రీరామనవమి రోజు గర్భగుడిలో ఉండే రాముడి నుదుట సూర్య కిరణాలు ప్రసరించేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశారు. 


Also Read: Sri Rama Navami Date 2024: శ్రీరామ నవమి ఎప్పుడొచ్చింది - రాముడు నవమి తిథిరోజే ఎందుకు జన్మించాడు!


6 నిముషాలు కనిపించే అద్భుతం
ఏటా శ్రీ రామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటలకు..అంటే రామయ్య కళ్యాణం జరిగే అభిజిత్ లగ్నానికి కొద్దిసేపు ముందు మొదలయ్యే సూర్య కిరణాల వెలుగు 6 నిమిషాల పాటు కొనసాగనుంది. ఇందుకోసం గర్భగుడిలో ప్రత్యేక టెక్నాలజీ రూపొందించారు. సీఎస్‌ఐఆర్‌ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ -సీబీఆర్ఐ ఈ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌-ఐఐఏ సహాయం తీసుకుంది. ఇందుకు అవసరమైన వస్తువులను బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఆప్టిక్స్‌ సంస్థ తయారు చేసి అందించింది. సూర్య కిరణాలు రామచంద్రుడి నుదిటిపై ప్రసరించేలా కటకాలు, అద్దాలు, గేర్‌బాక్స్‌లు, గొట్టాలను  ఏర్పాటు చేశారు. మూడో అంతస్తు నుంచి నేరుగా రామయ్య నుదుట కిరణాలు ప్రసరించేలా ఈ పరికరాలు అమర్చారు. 


2024 శ్రీరామ నవమికి సాధ్యమేనా!
ఏటా శ్రీరామనవమికి జరిగే ఈ అద్భుతం..ఈ ఏడాదికి సాధ్యం కాకపోవచ్చని అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ సమయంలో ట్రస్ట్ సభ్యులు అన్నారు. ఎందుకంటే సూర్య కిరణాలు మూడో అంతస్తు నుంచి ప్రసరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు..అయోధ్య రామ మందిరంలో గ్రౌండ్ ఫ్లోర్ పనులు మాత్రమే పూర్తయ్యాయి అని...2025 డిసెంబర్ నాటికి మొత్తం 3 అంతస్థులు పూర్తి అవుతాయని వెల్లడించారు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. అంటే 2026 రామనవమి వరకూ సూర్యతిలకం చూసే భాగ్యం కలగదు అనుకున్నారు భక్తులు. కానీ ఈ ఏడాదే ఆ అద్భుతాన్ని ఆవిష్కరించే ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఈ మధ్యే ట్రయల్ రన్ నిర్వహించారని..ఈ ఏడాది ఏప్రిల్ 17న శ్రీరామ నవమి రోజే ఇది సాధ్యం అవుతుందని శ్రీరామ జన్మభూమి తీర్ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. రూర్కీలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CBRI)కి చెందిన నిపుణులు ఈ సూర్య తిలకం  కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు ప్రస్తుతం అయోధ్యలో ఉన్నారు. 


Also Read: Effects of Shani Dev 2024 to 2025: ఈ ఏడాదంతా ఏల్నాటి శని, అష్టమ శని ఉన్న రాశులివే!


ఈ రామనవమికి ​​సూర్యకాంతి రామ్ లల్లాపై పడే ఖగోళ కార్యక్రమం సాధ్యమవుతుందని మేం ఆశిస్తున్నాం. అందుకు తగిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రసార భారతి ద్వారా ఏప్రిల్ 17న ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం కానుందని స్పష్టం చేశారు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్. ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తైంది...ఏప్రిల్ 17న భక్తులంతా రాముడి నుదుట సూర్యతిలకం వీక్షించవచ్చని చెప్పారు  విశ్వహిందూ పరిషత్ (VHP) సీనియర్ నాయకులు గోపాల్ రావు.