K.E. Prabhakar News: మరో వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. అయినా ప్రధాన పార్టీల్లో టికెట్ల పంచాయితీ ఇంకా తేలలేదు. అసంతృప్తులు దారికి రాలేదు. అధినాయకత్వంపై కారాలు మిరియాలు నూరుతూనే ఉన్నారు. అలాంటి సమస్యాత్మక జిల్లాల్లో ఒకటి కర్నూలు. ఇక్కడ టీడీపీకి తలనొప్పులు ఇంకా తగ్గలేదు. 


టీడీపీకి రాజీనామా చేేసే ఆలోచనలో కేఈ ప్రభాకర్


కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ వస్తున్న కెఈ కుటుంబం ఇప్పుడు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కేఈ ప్రభాకర్‌కు సీటు రాలేదన్న అసంతృప్తితో ఉన్న ఆ ఫ్యామిలీ ఇప్పుడు ఫ్యాన్ వైపు చూస్తున్నట్టు టాక్ నడుస్తోంది. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ పార్టీ మారుతున్నారన్న వార్త సంచలనంగా మారింది. దీంతో టీడీపీ అధినాయకత్వం అలర్ట్ అయింది. కేఈ కుటుంబాన్ని బుజ్జగించేందుకు నేతలను రంగంలోకి దింపింది.  


కేఈతో చర్చించిన పార్టీ నేతలు 


కేఈతోపాటు ఆయన కుటుంబంతో చర్చించేందుకు కీలక నేతలు రంగంలోకి దిగారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే గత రెండు రోజులుగా జరుగుతున్న చర్చలు కొలిక్కి రాలేదని సమాచారం. తనకు సీటు ఇవ్వక పోవడంపై కేఈ ప్రభాకర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పుకుంటున్నారు. అందుకే పార్టీ మారేందుకే నిర్ణయం తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. 


డోన్, పత్తికొండ రెండూ దక్కలేదని అసంతృప్తి


కుటుంబంలో నెలకొన్న భిన్నాభిప్రాయాల కారణంగా పత్తికొండ సీటును తన సోదరుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబుకు కేటాయించాల్సి వచ్చింది. దాంతో ఆయన డోన్ శాసన సభ స్థానాన్ని ఆశించి అక్కడ కార్యాలయం ప్రారంభించడానికి ప్రయత్నించారు. అయితే పార్టీ అందుకు అంగీకరించలేదు. అప్పుడే ఇంటికి ఒక సీటే ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందని వివరించారు. సోదరులిద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చి ఒక పేరు చెబితే వారికే టికెట్ కేటాయిస్తామని పేర్కొన్నట్లు వెల్లడవుతోంది. 


తరువాత పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో పత్తికొండ శ్యాంబాబుకు, డోన్ స్థానాన్ని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డికి కేటాయించారు. ఈ టికెట్ల కేటాయింపుపై కేఈ ప్రభాకర్ స్పందించలేదు కానీ డోన్‌లో తాను వ్యతిరేకిస్తున్న సుబ్బారెడ్డికి టికెట్ ఇవ్వకపోవడంతో సంతృప్తి చెందారని అనుకున్నారు. అయితే కొద్ది రోజుల నుంచి మౌనంగా ఉన్న ఆయన పార్టీ మారేందుకు ప్రయత్నాలు ప్రారంభించడంతో టిడిపి చర్చలు జరిపింది. 


కర్నూలు ఎంపీ స్థానం ఇవ్వబోతున్నట్టు సమాచారం


కేఈ ప్రభాకర్ అసంతృప్తిని గుర్తించిన వైసిపి నాయకులు కొందరు ఆయనతో చర్చించి పార్టీలోకి ఆహ్వానించేందుకు రంగం సిద్ధం చేశారని తెలిసింది. ఇందులో కర్నూలు లోక్ సభ స్థానాన్ని కేటాయించేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు చర్చ సాగుతోంది. దీనికి ఓకే చెప్పారని కూడా అంటున్నారు. పార్టీ మార్పు మినహా ఇతర అంశాలు చర్చించాలని లేదంటే వెళ్లవచ్చని తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్పేశారట. 


వైసీపీలో సమస్యలు 


ఇప్పటికే కర్నూలు లోక్ సభ స్థానాన్ని బివై రామయ్యకు కేటాయించింది వైసీపీ. ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీ నేతలతో ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కేఈ ప్రభాకర్‌కు టికెట్ ఇస్తే పార్టీలో గందరగోళం నెలకొంటుందని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ స్థానాన్ని వాల్మీకులకు కేటాయించడంతో పలువురు నేతలు మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఆ స్థానాన్ని మరో సామాజికవర్గానికి కేటాయిస్తే ఇబ్బందులు వస్తాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 


కేఈ ప్రభాకర్ పార్టీ మారితే వారి కుటుంబానికి, సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంకు ప్రధానంగా ఎటు వెళ్తుందన్న చర్చ సాగుతోంది. మెజారిటీ ఓటర్లు కేఈ వెంట వెళ్తారా లేదా అన్నది లెక్కలు వేస్తున్నట్లు సమాచారం. కేఈ పార్టీ మారకుండా ఉండేందుకు అన్నదమ్ముల మధ్య తలెత్తిన విబేధాల పరిష్కారానికి టిడిపి నేతలే కాకుండా కేఈ సన్నిహితులు కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐక్యంగా ఉంటేనే మంచిదని లేదంటే రాజకీయంగానే కాకుండా ఇతర ఇబ్బందులు తలెత్తే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నట్లు సమాచారం. 


అన్ని వైపుల నుంచి ఒత్తిడి తీవ్రంగా ఉన్న వేళ కేఈ ప్రభాకర్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో అన్న ఆసక్తి నెలకొంది. మొత్తం మీద కేఈ విషయం ఒక్కసారిగా తెరపైకి రావడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.