Sri Rama Navami Date 2024


రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః


ధర్మ బద్ధ జీవనానికి  నిలువెత్తు నిర్వచనం శ్రీరామచంద్రుడు. మనిషి ఇలా బ్రతకాలని ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి... మనిషి జన్మకు ఉన్న విశిష్టతను చాటిచెప్పిన పురుషోత్తముడు. 2024లో శ్రీరామనవమి ఎప్రిల్ 17న వచ్చింది. 


'రామస్య ఆయన రామాయణం'
అయనము అంటే నడక అని అర్థం . రామాయణము అంటే రాముని నడక అని అర్థం. సరిగ్గా గమనిస్తే శ్రీ మహవిష్ణువు  దశావతారాల్లో ఒక్క రామావతారంలో తప్ప ఇక ఏ అవతారం గురించి ప్రస్తావనలోనూ అయనము అనే మాట వినియోగించలేదు. ఎందుకంటే  రామావతారంలో స్వామి పరిపూర్ణముగా మానవుడే.  అందుకే ఎక్కడా రాముడు తాను దేవుడిని అనికానీ, దైవత్వం గురించి ప్రకటించడం కానీ చేయలేదు.  “రామస్య ఆయనం రామాయణం” అంటారు కదా మరి రాముడి కదలికకు అంత ప్రాధాన్యత ఎందుకు వచ్చింది.  అంటే ఆయన అడుగు తీసి అడుగు వేస్తే అది ధర్మం, మరో అడుగు వేస్తే అది సత్యం .ఆయన నడక ఆయన కదలిక అంతా సత్య -ధర్మములే. అందుకే  “రామో విగ్రహవాన్ ధర్మః ” అన్నారు .


Also Read: ఈ ఏడాది ఉగాది ఎప్పుడు - చైత్ర పాడ్యమి రోజే ఎందుకు జరుపుకుంటారు!


నారాయణుడి కథగా కాదు నరుడి కథగా చదవాలి
 రామాయణాన్ని నారాయణుడి కథగా కాదు నరుడి కథగా చదవాలని చెబుతారు పెద్దలు.  రాముడు దేవుడు అని కాకుండా మానవుడు అని చదివినప్పుడే..ఓ మనిషి సత్యం, ధర్మంగా ఇలా జీవించగలడా అనే ఆలోచన వస్తుంది.  


Also Read: శివుడికి 5 రూపాలు - మీరు ఏ రూపం పూజించాలో తెలుసా!


రామ నామం ఎందుకంత పవర్ ఫుల్!


శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ||


పరమశివుడు పార్వతీ దేవి తో చెప్పిన ఈ శ్లోకం అందరికీ తెలిసిందే. శ్రీ రామ రామ రామ అని మూడు సార్లు జపిస్తే శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేసినంత ఫలితం వస్తుందని  ఈ శ్లోకం భావం. 


అదెలా అంటే కటపయాది సూత్రం ప్రకారం “య” వర్గంలో “రా” రెండవ అక్షరం కాగా “ప” వర్గం లో “మ ” ఐదవ అక్షరం రెండు * ఐదు =పది కదా , దీనిని బట్టి ఒక సారి రామ అంటే పది సంఖ్య కు సంకేతం .ఇక మూడు సార్లు జపిస్తే 10*10*10 =1000 కి సమానమవుతుంది .  


Also Read: మహా శివరాత్రి ఎప్పుడొచ్చింది - ఆ రోజు విశిష్టత, పాటించాల్సిన నియమాలు


నవమి తిథి రోజే ఎందుకు జన్మించాడు
శ్రీ రాముడు జన్మించిన నవమి తిథి విషయానికొస్తే...నవమి పరమేశ్వర తత్వాన్ని సూచిస్తుంది. తొమ్మిదిని ఏం సంఖ్యతో హెచ్చించినా ఆనంబర్స్ కలిపితే మళ్లీ  తొమ్మిదే వస్తుంది. 


9*1=9


9*2=18 —– 8+1 =9


9*3=27 —– 2+7=9


9*4=36 —– 3+6=9


9*5=45 —– 4+5=9
 
దీనికి పరమాత్మ చిహ్నానికి సంబంధం ఏంటంటే..ఆయన ఎన్ని రూపాలలో ఉన్నా ఎన్ని అవతారములు ఎత్తినా ఎన్ని పేర్లు పెట్టుకున్నా అసలుతత్వము ఒక్కటే అని.  శ్రీరాముడు నవమి రోజు జన్మించడం వెనుకున్న ఆంతర్యం ఇదే.  


Also Read: దోసపండుకి - మృత్యువుకి ఏంటి సంబంధం శివయ్యా!


భద్రాద్రిలో బ్రహ్మోత్సవాలు


 భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం వైదిక కమిటీ ఏప్రిల్​17న సీతారాముల కల్యాణం నిర్వహించాలని ముహూర్తం ఖరారు చేసింది. ఏప్రిల్​9 (ఉగాది రోజు) నుంచి 23వ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.ఏప్రిల్​9 నుంచి 23 వరకు నిత్య కల్యాణాలు, దర్బారు సేవలను రద్దు చేశారు. మే 1వ తేదీ వరకు పవళింపు సేవలు జరగవని ఆలయ నిర్వాహకులు స్పష్టం చేశారు. 


శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం
ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి