సినిమా పరిశ్రమకు ప్రతి రోజూ ఎంతో మంది కోటి ఆశలతో వస్తారు. ఎలాగైనా ఫిల్మ్ ఇండస్ట్రీలో స్థిరపడాలని విశ్వ ప్రయత్నాలు చేస్తారు. తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. ఎన్ని కష్టాలైనా పడతారు. అందులో 'రాధా మాధవం' దర్శకుడు దాసరి ఇస్సాకు ఒకరని చెప్పాలి. మార్చి 1న సినిమా విడుదల కానున్న సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు... 


ఇంట్లో నుంచి పారిపోయి హైదరాబాద్ వచ్చాను!
తనకు చిన్నతనం నుంచి సినిమాలపై ఆసక్తి ఉందని, సినిమాల కోసం ఇంట్లో నుంచి పారిపోయి హైదరాబాద్ సిటీకి వచ్చానని దాసరి ఇస్సాకు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''హైదరాబాద్‌లో ఉంటూ ఏదొక పని చేస్తూ అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవాడిని. ఎడిటింగ్, కెమెరా... ఇంకా పలు శాఖల్లో పని చేశా. నా గోల్ మాత్రం డైరెక్షన్. దర్శకత్వంపై ఆసక్తితో అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌లో చేరా. పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ... ఆ వచ్చిన డబ్బులు సేవ్ చేసుకుని కోర్స్ చేశా'' అని చెప్పారు. 


ఆహా కోసం సినిమా అనుకుంటే క్యాన్సిల్ అయ్యింది!
''అన్నపూర్ణలో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత 2019లో స్నేహితుడి ద్వారా గోనాల్ వెంకటేష్ గారు పరిచయమయ్యారు. ఆయన నిర్మాణంలో తొలుత ఆహా కోసం ఓ సినిమా చేయాలనుకున్నాం. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత గోనాల్ గారు 'రాధా మాధవం' కథ చెప్పారు. రచయిత వసంత్ వెంకట్ బాలా రాసిన కథ నచ్చింది. దాంతో సినిమా స్టార్ట్ అయ్యింది'' అని దాసరి ఇస్సాకు చెప్పారు. 


వినాయక్ దేశాయ్... నేను... జిమ్ మేట్స్! 
హీరో వినాయక్ దేశాయ్ తన జిమ్ మేట్ అని దర్శకుడు దాసరి ఇస్సాకు చెప్పారు. 'రాధా మాధవం' సినిమాలో వినాయక్ సెలక్షన్ గురించి మాట్లాడుతూ ''వినాయక్ కటౌట్ బాగుంటుందని తీసుకున్నా. అయితే... ఆయన జోడీగా మంచి హైట్ ఉన్న హీరో కోసం వెతికాం. చివరకు అపర్ణా దేవీ నటన బావుంటుందని, ఆమె హైట్ తక్కువ అయినా సరే నటన బావుంటుందని తీసుకున్నాం'' అని తెలిపారు.


Also Read: 


'రాధా మాధవం' కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని దాసరి ఇస్సాకు చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అంశాలతో పాటు యువతను అట్రాక్ట్ చేసే ప్రేమ సన్నివేశాలూ ఉన్నాయి. ప్రేమతో పాటు మంచి సందేశాన్ని ఇచ్చాం. థియేటర్ల నుంచి మంచి సినిమాను చూశామనే చక్కటి అనుభూతితో ప్రేక్షకులు బయటకు వస్తారు'' అని చెప్పారు.


Also Read:


వినాయక్ దేశాయ్, అపర్ణా దేవి జంటగా నటించిన ఈ సినిమాలో మేక రామకృష్ణ, జయ ప్రకాష్, ప్రియ, నవీన్, రవి శివతేజ, సుమన్, రాచర్ల లాస్య, ధనుష్ ఆచార్య, రాచర్ల మహేష్, శ్రీకాంత్ పర్కాల, సతీష్ కొల్లిపల్లి, శ్రీను, అడెపు మణిదీప్, చిరంజీవి, కామనగరి జ్యోతి, సురభి శ్యామల ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి నిర్మాత:  గోనాల్ వెంకటేష్, దర్శకత్వం: దాసరి ఇస్సాకు, కథ - మాటలు - పాటలు: వసంత్ వెంకట్ బాలా, సంగీతం : చైతు కొల్లి, ఛాయాగ్రహణం: తాజ్ జీడీకే, కూర్పు: కె. రమేష్, పోరాటాలు: రాబిన్ సుబ్బు.