Ugadi 2024 Date -  Krodhi Nama Samvatsara 2024-2025


2024 ఏప్రిల్ 09 ఉగాది 
ఏప్రిల్ 08 సోమవారం కొత్త అమావాస్యతో శోభకృత్ నామ సంవత్సరం పూర్తవుతుంది... ఎప్రిల్ 9 మంగళవారం నుంచి క్రోధినామ సంవత్సరం ప్రారంభమవుతుంది.
 
చైత్రమాసి జగద్బ్రహ్మ సపర్ణ పథమే అహని,
వత్సరాదౌ వసంతాదౌ రసరాద్యే తథైవచ


బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభవ. మొదటి ఋతువు వసంతం.మొదటి నెల చైత్రం.మొదటి తిథి పాడ్యమి.మొదటి వారం ఆదివారం. ఆ రోజే సృష్టి ప్రారంభమైంది. చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయవేళకు పాడ్యమి తిథి ఉన్నరోజును ఉగాదిగా నిర్ణయిస్తారు. 


Also Read: శివుడికి 5 రూపాలు - మీరు ఏ రూపం పూజించాలో తెలుసా!


ఉగస్య ఆదిః ఉగాదిః 
ఉగ అంటే నక్షత్ర గమనం. దీనికి ప్రారంభమే ఉగాది అని అర్థం. బ్రహ్మకు పగలు అంటే మనుషుల లెక్కల ప్రకారం 432,00,00,000 సంవత్సరాలు
రాత్రికూడా అంతే. అంటే బ్రహ్మకు ఒకరోజు అంటే…864,00,00,000 సంవత్సరాలన్నమాట. ఇలాంటివి 360 రోజులు పూర్తి చేస్తే ఆయనకు ఒక సంవత్సరం అయినట్లు లెక్క. అంటే 3 లక్షల 11 వేల 40 కోట్ల సంవత్సరాలు. ఇలా వందేళ్లు బ్రహ్మ ఆయుష్షు.


ఇప్పుడున్నది ఏడో బ్రహ్మ
ఇప్పటివరకు ఆరుగురు బ్రహ్మలు సృష్టికార్యాలు ముగించారు. ఏడవ బ్రహ్మ ఇప్పుడు ద్వితీయపరార్థంలో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆయన వయస్సు 51 సంవత్సరాలు. కలియుగం ప్రమాది నామ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి రోజు ప్రారంభమైంది. ఈ కల్పం ప్రారంభమై 197,29,49,114 సంవత్సరాలు పూర్తైంది. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలోని కలియుగంలో ఉన్నాం.


Also Read: మహా శివరాత్రి ఎప్పుడొచ్చింది - ఆ రోజు విశిష్టత, పాటించాల్సిన నియమాలు


వేదాలు రక్షించినరోజు ఇదే
శ్రీ మహా మహావిష్ణువు మత్స్యావతారము ధరించి సోమకుడనే రాక్షసుడిని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజుకూడా ఇదే. 
శ్రీరాముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజుకూడా ఉగాదే
వరాహమిహిరుడు పంచాగాన్ని జాతికి అంకితం చేసినది ఉగాదినాడే
 
తెలుగు సంవత్సరాలకు పేర్లు ఎలా వచ్చాయ్


2024-2025 తెలుగు సంవత్సరం పేరు క్రోధి. తెలుగు సంవత్సరాలు మొత్తం 60. ప్రభవ నుంచి మొదలై అక్షయతో పూర్తయితే ఒక ఆవృతం పూర్తయినట్లు. మళ్లీ ప్రభవతో ప్రారంభమవుతుంది లెక్క. ఈ సంవత్సరాలకు పేర్లు పెట్టడం వెనుక విభిన్న వాదనలు ఉన్నాయి. 



  • శ్రీకృష్ణుడికి 16,100మంది భార్యలు. వారిలో సందీపని అనే రాజకుమారికి 60మంది సంతానం. వారిపేర్లే తెలుగు సంవత్సరాలకు పెట్టారని అంటారు.

  • నారదుడి సంతానం పేర్లే వీటికి పెట్టారన్న మరో కథకూడా ప్రచారంలో ఉంది.

  • దక్షప్రజాపతి కుమార్తెల పేర్లుకూడా ఇవేనని అంటారు. 


Also Read: దోసపండుకి - మృత్యువుకి ఏంటి సంబంధం శివయ్యా!


చాంద్రమానం అనుసరించి
ఈ పండుగను తెలుగువారు చాంద్రమానాన్ని అనుసరించి నూతన సంవత్సరంగా జరుపుకుంటారు.ఈ పండుగను కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాలలోను జరుపుకుంటారు. కర్ణాటకలో 'ఉగాది'గా పరిగణిస్తే మహారాష్ట్రలో 'గుడిపాడ్వా' పేరుతో పిలుస్తారు. తమిళులు "పుత్తాండు" అనే పేరుతో, మలయాళీలు "విషు" అని, సిక్కులు "వైశాఖీ" గానూ, బెంగాలీలు "పొయ్‌లా బైశాఖ్" గానూ జరుపుకుంటారు.


ఈ ఉగాదితో ప్రారంభయ్యే క్రోధి నామసంవత్సరం అందరికీ శుభాలు తెస్తుందని ఆశిద్దాం.


Also Read: మహా శివరాత్రి ఎప్పుడొచ్చింది - ఆ రోజు విశిష్టత, పాటించాల్సిన నియమాలు


నోట్: పండితుల సూచనలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన విషయాలివి...వీటిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం