భక్తులు వేడుకున్న వెంటనే కాపాడే దయగల దేవుడు నరసింహస్వామి. అందుకే ఆదిశంకరాచార్యులు కూడా తనని ఆపద నుంచి రక్షించమని శ్రీ నరసింహస్వామిని వేడుకుంటూ కరావలంబన స్తోత్రం చేశారు. అంతటి దయామయుడైన ఆ స్వామి కృష్ణానదీ తీరంలో గుంటూరు జిల్లా మంగళగిరిలో వెలసి పానకాల నరసింహస్వామిగా భక్తుల పూజలందుకుంటున్నాడు.
ఆలయ చరిత్ర
హిరణ్యకసిపుడిని వధించిన తర్వాత నరసింహస్వామి భయంకర రూపంతో రౌద్రంగా ఈ క్షేత్రానికి చేరుకున్నారు.ఆయన ఉగ్రరూపం తో ఏర్పడిన వేడి కారణంగా కొండ అగ్ని పర్వతంగా మారిందట. ఆ కొండలోపల లావా కూడా ఉందనే ప్రచారం ఉంది. ఆ సమయంలో దేవతలంతా ప్రార్థించినా స్వామివారు శాంతించలేదు. అప్పడు లక్ష్మీదేవి తపస్సు చేసి స్వామికి అమృతాన్ని సమర్పించడంతో శాంతించారట. అలా మంగళాద్రిపై పానకాల లక్ష్మీ నరసింహస్వామిగా కొలువై ఉండిపోయారు. స్వామికి కృతయుగంలో అమృతాన్ని, త్రేతా యుగంలో ఆవునెయ్యిని, ద్వాపర యుగంలో ఆవు పాలను సమర్పించారు. కలియుగంలో వాటి లభ్యత తక్కువగా ఉండటంతొ బెల్లం పానకాన్ని సమర్పిస్తున్నారు. కొండపై ప్రధాన ఆలయంలో కేవలం నోరు తెరిచి ఉన్న స్వామి వారి ముఖం మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది. భక్తులు తీసుకొచ్చిన పానకాన్ని అక్కడ పూజారి స్వామివారి నోట్లో పోస్తారు. సగం అవ్వగానే గుటక వేసిన శబ్దం వస్తుంది. మిగిలిన పానకాన్ని ప్రసాదంగా తిరిగి భక్తులకు అందజేస్తారు. ఎంత పానకం ఉన్నా ఒక్క చీమ కూడా స్వామి సన్నిధిలో కనిపించకపోవడం విశేషం.
Also Read: శబరిమల, అరుణాచలం తర్వాత అతిపెద్ద జ్యోతి కనిపించే ఆలయం ఇదే
ఇక ప్రధాన ఆలయం పైన కొండ శిఖరాగ్ర భాగంలో గండాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఉంది. ఇక్కడ విగ్రహం ఉండదు. భక్తులకు ఏదైనా గండాలు వస్తే అవి తొలగిపోవాలని స్వామిని ప్రార్థిస్తారు. సమస్య తీరిన వెంటనే వారు గండాల స్వామి వద్ద ఆవు నేతితోకాని నూనెతో కాని దీపారాధన చేసి మొక్కు చెల్లించుకుంటారు. కొండపైన లక్ష్మీదేవి ఆలయం కూడా ఉంది. ఆలయం పక్కన ఒక సొరంగ మార్గం ఉంది. ఆ మార్గంలో నుంచి ఉండవల్లి గుహలకు దారి ఉందని ఆ దారి నుంచే రుషులు కృష్ణానదికి వెళ్లి స్నానాలు చేసేవారని చారిత్రక ఆధారాలున్నాయి.లక్ష్మీదేవి కొండపై తపస్సు చేయడంతో మంగళగిరిగా మారిందంటారు.
Also Read: నిత్యం కలలో పాములు కనిపిస్తున్నాయా, అయితే ఈ ఆలయానికి వెళ్లండి
ఆలయానికి నాలుగు దిక్కులా గాలి గోపురాలు ఉన్నా తూర్పు గాలి గోపుర నిర్మాణ శైలితో భక్తుల దృష్టిని ఆకర్షిస్తుంది. వెడల్పు తక్కువగా ఉండి ఎత్తు ఎక్కువగా ఉండే గోపురాలు చాలా అరుదుగా ఉంటాయి. అందులో ఇది ఒకటి. ఫాల్గుణ మాసంలో 11 రోజులపాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. శ్రీదేవి, భూదేవిలతో నరసింహస్వామికి కల్యాణం చేసిన అనంతరం మరుసటి రోజు జరిగే రథోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. స్వామి వారి రథం లాగేందుకు భక్తులు పోటీపడతారు. కనీసం తాడు తాకినా పుణ్యం లభిస్తుందంటారు. తిరునాళ్లకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భక్తులు లక్షల మంది తరలివస్తారు. ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ క్షేత్రాన్ని ప్రతిఒక్కరూ ఒక్కసారైనా దర్శించాల్సిందే. ఇక కొండ దిగువ భాగాన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా ఉంది.అ మెత్తం ప్రాంగణాన్ని అభివృద్ది చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మాఢ వీధులను కూడా నిర్మించనున్నారు.
Also Read: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి