సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన 'సర్కారు వారి పాట' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.171 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శుక్రవారం దర్శించుకున్నారు దర్శకుడు పరశురామ్.
ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చారు పరశురామ్. 'సర్కారు వారి పాట' సినిమాలో సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఉద్దేశించి విలన్ తో ఓ డైలాగ్ చెప్పించారు. విలన్ ని స్వామివారితో పోల్చడం భక్తులకు నచ్చలేదు. దీంతో పరశురామ్ ను ఈ విషయంపై ప్రశ్నించారు. దీనిపై ఆయన రియాక్ట్ అవుతూ.. కావాలని చేయలేదని.. భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంటే క్షమించాలని తెలిపారు.
శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిపై తనకు ఎంతో భక్తి ఉందని.. వీలైనప్పుడల్లా స్వామిని దర్శించుకుంటానని అన్నారు. 'సర్కారు వారి పాట' సినిమాను మొదలుపెట్టినప్పుడు స్వామిని దర్శించుకున్నానని.. సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పారు. త్వరలోనే నాగచైతన్యతో సినిమా తీస్తున్నట్లు చెప్పారు. దర్శనార్థం వచ్చిన పరశురామ్ ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆయన పేరిట అర్చకులు స్వామికి పూజలు చేశారు. వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం టెంపుల్ ఇన్‌స్పెక్టర్ కనకరాజు స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు.