ఆహ్లాదకరమైన వాతావరణం, ఎత్తైన కొండలు ఆ మధ్యలో రెండు గుహలపై స్వయంభులుగా వెలిసిన హరిహరుల క్షేత్రం ఇది. జనగామ జిల్లా పాలకుర్తిలో కొలువైన సోమేశ్వరాలయానికి కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ విశిష్టత ఏంటంటే ఏటా కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ కొండపై వెలిగించే జ్యోతి ఆ చుట్టుపక్కల పాతిక గ్రామాల వరకూ దర్శనమిస్తుంది. శబరిమల, అరుణాచలం తర్వాత దక్షిణభారత దేశంలో మూడో అతి పెద్ద జ్యోతి అనీ అంటారు. 


సప్తరుషుల తపస్సుకి మెచ్చి
పరమేశ్వరుడి అనుగ్రహం కోసం సప్తరుషులు తపస్సు చేశారట. ఆ తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమవ్వడంతో నారాయణుడితో కలిసి ఈ ప్రాంతంలో కొలువుదీరమంటూ ఆ రుషుల కోరిక మేరకు ఈ రెండు గుహల్లో స్వయంభువులుగా వెలిశారని చెబుతారు.  ఆ తర్వాత కొన్నాళ్లకు శివ భక్తురాలైన ఓ వృద్ధురాలు రోజూ ఈ గుడికి వచ్చి కొండపైకి వెళ్లలేక కింద నుంచే కొండచుట్టూ ప్రదక్షిణ చేసి వెనక్కి వెళ్లిపోయేదట. ఆమె భక్తికి మెచ్చిన సోమేశ్వరుడు ఆలయం దగ్గరున్న కొండను రెండుగా చీల్చడంతో సులువుగా ప్రదక్షిణ చేసుకోవడం మొదలుపెట్టిందట. అప్పటినుంచీ ఇక్కడకు వచ్చే భక్తులు ఈ మార్గంలో వెళ్లి కొండపైనున్న ఉపాలయాన్ని దర్శించుకుంటారు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే...చాలా సన్నగా ఉన్న ఈ కొండమార్గంలో ఎంత స్థూలకాయులైనా పడతారట. అయితే భగవంతుడిపై విశ్వాసంతో వెళ్లాలి...అపనమ్మకంతో ట్రై చేస్తే మాత్రం తేనెటీగల దాడి తప్పదని స్థానికులు చెబుతారు. 


Also Read: 2022-2023 ఈ రాశులవారికి అద్భుతంగా ఉంటే, ఆ రెండు రాశులవారికి అరాచకంగా ఉంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
కొబ్బరికాయ ముడుపు కడితే పిల్లలు కలుగుతారు
ఇక్కడకు వచ్చే భక్తులు మొదట సోమేశ్వరుడినీ, ఆ తరువాత లక్ష్మీనరసింహస్వామినీ దర్శించుకుంటారు. సంతానం లేనివారు ఈ ఆలయంలో కొబ్బరికాయల్ని ముడుపుగా కడితే పిల్లలు కలుగుతారని భక్తుల విశ్వాసం. మహాశివరాత్రి  పర్వదినాన బ్రహ్మోత్సవాలు, మహాజాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఏటా కార్తిక పౌర్ణమి సందర్భంగా ఈ కొండపైన సుమారు నలభై అడుగుల ఎత్తులో జ్యోతిని వెలిగించే వేడుకను చూసేందుకు రెండు కళ్లూ చాలవు.  ఈ జ్యోతి ఆ చుట్టుపక్కల 25 గ్రామాల వారికి కనిపిస్తుంది.  


కొండపైన హరిహరులను దర్శించుకున్న తర్వాత కొండ కింద దత్తాత్రేయుడు, ఓంకారేశ్వరుడు, రమా సహిత సత్యనారాయణుడు, వాసవి కన్యకాపరమేశ్వరి, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. హైదరాబాద్‌ వరంగల్‌ దారిలో స్టేషన్‌ఘన్‌పూర్‌ రైల్వేస్టేషన్‌ లో దిగి..అక్కడి నుంచి 14 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో వెళితే స్వామిని దర్శించుకోవచ్చు. నేరుగా వరంగల్ నుంచి బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. 


Also Read: శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది, మీరున్నారా అందులో