Prakasam Road Accident : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్కాపురం మండలం తిప్పాయపాలెం సమీపంలో జాతీయ రహదారిపై కారు, లారీ ఢీకొన్నాయి. కంభం నుంచి మార్కాపురం వైపు వెళుతున్న కారు టైరు పేలి లారీని ఢీకొట్టింది. ప్రమాదం సమయంలో పెట్రోల్ ట్యాంక్ కు మంటలంటుకుని కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు సజీవదహనం అయ్యారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపుచేశారు.


ముగ్గురు మిత్రులు 


ఈ ప్రమాదంలో మృతులు భాకరాపేట గ్రామానికి చెందిన ఇమ్రాన్, బాలాజీ, తేజగా పోలీసులు గుర్తించారు. ఇమ్రాన్ అనే యువకుడు గుంటూరులోని ఓ ప్రైవేట్ టెలికాం డిపార్ట్​మెంట్ ​కు చెందిన బొలెరో వాహనానికి డ్రైవర్ గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇమ్రాన్, అతని స్నేహితులు బాలాజీ, తేజ ముగ్గురు కలిసి మార్కాపురం జాతీయ రహదారిపై కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరు ముగ్గురూ ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 


అసలేం జరిగింది 


తిరుపతి జిల్లా భాకరాపేటకు చెందిన తేజ(29) , ఇమ్రాన్‌(21), బాలాజీ (21), కారులో కంభం నుంచి మార్కాపురం వైపు వెళ్తున్నారు. ఆ సమయంలో చేపల లోడుతో ఓ కంటెయినర్‌ మార్కాపురం నుంచి కంభం వైపు వస్తుంది. తిప్పాయిపాలెం దాటిన తర్వాత కారు టైరు ఒకసారిగా పేలింది. దీంతో అదుపుతట్టిన కారు ఎదురుగా వస్తున్న కంటెయినర్‌ను ఢీకొంది. ఈ కంటెయినర్ కారును దాదాపు 40 మీటర్లు  ఈడ్చుకుపోయింది. దీంతో కారు పెట్రోల్‌ ట్యాంక్‌ పగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారు మంటలు అంటుకుని అందులో ఉన్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కంభం ఫైర్ డిపార్ట్ మెంట్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమై అందులో ఉన్న వ్యక్తుల మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా దహనమయ్యాయి. లారీ, కారు రెండూ వేగంగా ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగిందని సీఐ ఆంజనేయరెడ్డి తెలిపారు. కారులో ఎంత మంది ప్రయాణిస్తున్నారో ఇంకా తెలియాల్సి ఉంది. వాహన యజమాని చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం అదినవారిపల్లికి చెందిన ఈటిమరుపు నరేంద్రగా పోలీసులు గుర్తించారు. ఆయన వాహనంలో లేరని తెలిపారు.