Weather Updates : నైరుతి రుతుపవనాలు(Southwest Monsoon) చురుగ్గా విస్తరిస్తున్నాయి. బంగాళాఖాతంలో మరింతగా నైరుతి పవనాలు విస్తరించాయని భారత వాతావరణశాఖ(IMD) తెలిపింది. నైరుతీ రుతుపవనాల ఉత్తర పరిమితి అండమాన్ నుంచి లాంగ్ ఐలాండ్స్ వరకు విస్తరించినట్టు పేర్కొంది. దీంతో రాగల రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం(Bay Of Bengal), అండమాన్ సముద్రం, అండమాన్ దీవులు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంతో పాటు పరిసర ప్రాంతాలకు రుతుపవనాలు మరింతగా విస్తరించేందుకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నట్టు వెల్లడించింది. 


ఆంధ్రప్రదేశ్ లో 


నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళ(Kerala), కర్ణాటకతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల(Telugu States)కు ఈసారి ముందస్తుగా రుతుపవనాలు చేరే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని చాలా చోట్ల రుతుపవనాల కారణంగా వర్షాలు పడే సూచనలు ఉన్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల మూడు రోజుల్లో ఏపీ(Andhra Pradesh)లో ఉరుములతో కూడిన మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.


తెలంగాణలో 


విదర్భ ప్రాంతం నుంచి కర్ణాటక మీదుగా కేరళ వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణ(Telangana)లో రాగల రెండు రోజుల్లో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. పలు జిల్లాల్లో ఈనెల 21వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైదరాబాద్‌ వాతవరణ కేంద్రం పేర్కొంది. బుధవారం రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుప‌వ‌నాలు రెండు రోజుల్లో విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర, దక్షిణ ద్రోణి పశ్చిమ విదర్భ నుంచి కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో రాగల 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.


తగ్గుతున్న ఉష్ణోగ్రతలు 


నైరుతి రుతుపవనాల ఆగమనంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు, 5 జిల్లాల్లో 39 డిగ్రీలకు పైన, మరో 5 జిల్లాల్లో 38 డిగ్రీలకు పైన, 3 జిల్లాల్లో 37 డిగ్రీలపైన పగటి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో అత్యధికంగా 42.8 డిగ్రీలు, కొత్తగట్టులో 42.7, ఆదిలాబాద్‌ జిల్లా భోరజ్‌లో 42.6, ఆదిలాబాద్‌ 42.6 డిగ్రీల పగటి పూట ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.