ఉక్రెయిన్‌లోని మేరియా పోల్‌లో కొన్ని నెలల పాటు సాగిన యుద్ధం ముగిసినట్లు రష్యా ప్రకటించింది. అజోవ్ ప్లాంట్‌కు రక్షణగా ఉన్న సైనికులు పూర్తిగా లొంగిపోయినట్లు రష్యా సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ ఇగర్ కొనషెంకోవ్ తెలిపారు. భారీ పరిశ్రమ అయిన అజోవ్ ప్లాంట్‌లో నెలల పాటు ఉక్రెయిన్ దళాలు తలదాచుకున్నాయి. ఆ ప్లాంట్‌పై రష్యా ఆధిపత్యాన్ని ఆ దళాలు అడ్డుకున్నాయి. అయితే శుక్రవారం ఆ ప్లాంట్ నుంచి చివరి దళాన్ని బయటకు పంపారు. మరియపోల్ నగరంతో పాటు అజోవ్ స్టీల్ ప్లాంట్ పూర్తిగా విముక్తి అయినట్లు రష్యా రక్షణశాఖ కార్యాలయం పేర్కొంది. 2400 మంది ఇప్పటి వరకు లొంగిపోయినట్లు రష్యా సైనిక అధికారులు తెలిపారు.
3 నెలలుగా యుద్దం జరుగుతున్నా... దీన్ని యుద్ధం అని రష్యా చెప్పట్లేదు. ఇదో ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ అని మాత్రమే అంటోంది. ఫిబ్రవరి 24న ఈ ఆపరేషన్ ప్రారంభమయింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని రెండు దేశాలు ధృవీకరించాయి. ఈ ప్రతిష్టంభనకు మీరు కారణమంటే మీరు కారణమని ఇరు దేశాల ప్రభుత్వాలు పరస్పరం నిందించుకుంటున్నాయి. ఉక్రెయిన్ మొండిగా వ్యవహరిస్తూ,సంప్రదింపుల ప్రక్రియ నుంచి ఉపసంహరించుకోవడం వల్లే చర్చలు నిలిచిపోయాయని రష్యా ఉప విదేశాంగ మంత్రి ఆండ్రీ రుడెంకో ఆరోపించారు. పశ్చిమ దేశాలు తమ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం ఉక్రెయిన్‌ను ఉపయోగించుకోవాలని చూస్తునాుయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ చెప్పారు. ఉక్రెయిన్‌లో తక్షణ పరిస్థితిపై కాకుండా పశ్చిమ దేశాల ఆందోళనలపై దృష్టి పెడితే శాంతి ఒప్పందం ఎలా కుదురుతుందని ఆయన ప్రశ్నించారు.
మరోవైపు.. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో ఆంక్షలపర్వం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌పై దాడుల్లో రష్యాకు సహకారం అందించిన కారణంగా బెలారస్‌పై సెర్బియా ఆంక్షలు విధించింది. అంతకుముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, రష్యాకు చెందిన ప్రముఖులపై కెనడా బ్యాన్ విధించింది.