Significance Of Muharram 2024: జూలై 17 మొహర్రం. మహమ్మదీయుల ప్రధాన పండుగలలో రంజాన్ తర్వాత మొహర్రం ప్రధానమైనది.  హసన్, హుస్సేన్ అనే ముస్లిం వీరుల స్మారకార్థం జరుపుకునే కార్యక్రమమే పీర్ల పండుగ. 10 రోజుల పాటూ జరుపుకునే మొహర్రం వేడుకల్లో మొదటి రోజు పీర్లను ప్రతిష్టించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. పీర్ అంటే మహాత్ములు, ధర్మనిర్దేశకులు అని అర్థం. ధర్మ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీరులకు ప్రతీకగా హస్తాకృతి కలిగిన రూపాలను తయారు చేసి వాటిని అలంకరించి, ఊరేగించి, పూజించే వాటిని పీర్లు అని పిలుస్తారు. బెల్లంతో చేసిన నైవేద్యాలు సమర్పిస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొహర్రం నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ నెలలో పదో రోజు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.  పదో రోజు ఆషురా దినంగా పాటిస్తారు. ముందురోజంతా ఉపవాస దీక్ష ఆచరిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో హిందువులు - ముస్లింలు కలపి ఈ పండుగ జరుపుకుంటారు.


Also Read: దక్షిణాయణం - ఉత్తరాయణం మధ్య వ్యత్యాసం ఏంటి , ఏది పుణ్యకాలం! 


అమరవీరుల త్యాగాలు స్మరించుకునే రోజు


ప్రజాస్వామ్యం కోసం మానవ హక్కుల కోసం జరిగిన చరిత్రాత్మక పోరాటాన్నే ‘మొహరం’గా పేర్కొంటారు. అమరవీరుల త్యాగాలు స్మరించుకుంటారు. హజరత్ ఇమామ్ హుసేన్ త్యాగానికి గుర్తుగా ప్రతిమలు ఊరేగించి సంతాపం ప్రకటిస్తారు. మహ్మద్ ప్రవక్త మరణం తర్వాత హజరత్ అబూబకర్ సిద్ధీఖ్, హజరత్ అలీ, హజరత్ ఉమర్ మంచి పరిపాలన అందించారు. వీరి తర్వాత వచ్చిన మావియా చక్రవర్తి అందరినీ హింసించేవాడు. అనంతరం గద్దెనెక్కిన యజీద్ తనను తాను ఖలీఫాగా ప్రకటించేసుకుని క్రూరంగా పాలించాడు. ఆ సమయంలో మహ్మద్ ప్రవక్తమనవడైన హజరత్ హుసేన్.. యజీద్ రాక్షసత్వాన్ని ఎదిరించి ప్రజల తరపున పోరాటం చేశాడు. శాంతికోసం హుసేన్ చేసిన ప్రతిపాదనలను యజీద్ అంగీకరించకుండా యుద్ధానికి పిలుపునిస్తాడు. ఆ యుద్ధంలో మహ్మద్ ప్రవక్త వంశానికి చెందిన వారు దాదాపు 70 మంది  అమరులవుతారు. అప్పుడు హజరత్ హుసేన్  ఆ తెగకు శాపం పెడతారు. వారికి ఎప్పటికీ మోక్షం ప్రసాదించకూడదని అల్లాను వేడుకుని ప్రాణాలు వదిలేస్తాడు. 


Also Read: తొలి ఏకాదశి ప్రత్యేకత ఏంటి - ఈ రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి!


యుద్ధం ముగిసిన తర్వాత యాజిద్ తెగకు చెందిన వారు పశ్చాత్తాపంతో అల్లాహ్ మేం తప్పు చేశాం.. దైవ ప్రవక్త మహమ్మద్ ప్రవక్త వంశానికి చెందిన వారిని హింసించి హతమార్చామని తమని  క్షమించమని గుండెలు బాదుకుంటూ.. హల్బిద.. హల్బిద అని రక్తాలు చిందిస్తూ , నిప్పులపై నడుస్తూ  సమయంలో భగ భగ మండే నిప్పులపై కాలికి కనీసం చెప్పులు కూడా లేకుండా కేవలం పాదాలతో నడుస్తారు. అప్పటినుంచి ఈ సంప్రదాయం ప్రారంభమైంది. ఇస్లాం పునర్జీవానికి ప్రాణం పోసిన ఆ అమరుల త్యాగాన్ని స్మరించడమే మొహర్రం. అందుకే మొహర్రంను పండుగలా కాకుండా మహ్మద్ ప్రవక్త కుటుంబం చేసిన త్యాగాల్ని స్మరించుకునే రోజుగా చేసుకుంటారు. తెలంగాణలో పలుచోట్ల మొహర్రం పండుగను పీర్ల పండుగ పేరుతో జరుపుకుంటారు.  


Also Read: 'కర్కిడకం' పూజ కోసం తెరుచుకున్న శబరిమల ఆలయం - ఈ ఏడాది చివరి వరకూ అయ్యప్ప ఆలయం తెరిచి ఉండే తేదీలివే!