kark sankranti 2024 : ఆదిత్యుడు ఏడాదికి రెండుసార్లు తన దిశను మార్చుకుంటాడు. వీటినే ఉత్తరాణయం, దక్షిణాయణం అని పిలుస్తారు. ఈ ఏడాది 2024 జూలై 16న కర్కాటక సంక్రాంతి వచ్చింది. అంటే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో దక్షిణాయణం ప్రారంభమవుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. మనకు సంవత్సర కాలం దేవతలకు ఓరోజుతో సమానం. దక్షిణాయణం ప్రారంభమయ్యే సమయంలో శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళతాడు..అంటే దేవతలకు రాత్రికాలం ప్రారంభం. తిరిగి మకర సంక్రాంతికి నిద్రనుంచి మేల్కొనే సమయం...అంటే పగటి సమయం. అందుకే ఉత్తరాణయంలో పగటి సమయం ఎక్కువ ఉంటే దక్షిణాయణంలో రాత్రి సమయం ఎక్కువ ఉంటుంది. 


Also Read: జూలై 16 నుంచి నెలపాటు ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే - అన్నింటా విజయం!


ఉత్తరాయణం - దక్షిణాయణం ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి?  


సూర్య భగవానుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని 'ఉత్తరాయాణం' అని , ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని 'దక్షిణాయణం' అని అంటారు. సూర్యుడి గమనంలో వచ్చే మార్పులను అనుసరించి ఉత్తరాయణాన్ని వేసవి కాలంగా, దక్షిణాయణాన్ని రుతుపవన కాలంగా పిలుస్తారు.  భానుడు  ఉత్తరాయణంలోకి ప్రవేశించినప్పుడు పగటి సమయం ఎక్కువ - రాత్రి సమయం తక్కువ ఉంటుంది. అందుకే ఈ సమయంలోనే దైవారాధన ఎక్కువగా ఉంటుంది. పండుగలు, జాతరలు, దానధర్మాలు రాత్రుళ్లు తక్కువగా ఉంటాయి. ఈ కాలంలో అనేక పండుగలు, తీర్థయాత్రలు ఉంటాయి. ఈ కాలాన్ని దేవతారాధ‌న‌, దానాలు, ధ‌ర్మాలు, వివాహాలకు అత్యంత అనుకూల‌ కాలంగా చెబుతారు. ఇక దక్షిణాయణంలో పగటి సమయం తక్కువ, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ ఆరు నెలలు శుభకార్యాల కన్నా దైవారాధనకే అధిక ప్రాధాన్యత ఇస్తారు.  


Also Read: తొలి ఏకాదశి ప్రత్యేకత ఏంటి - ఈ రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి!


పితృదేవతారాధన


దక్షిణాయనంలో పితృ దేవతలు భూమ్మీదకు వచ్చే సమయం...తమ సంతానం ఇచ్చే తర్పణాలు స్వీకరించి ఆశీర్వదిస్తారని విశ్వాసం. అందుకే దక్షిణాయణం పితృదేవతల ఆరాధననకు అత్యంత ఉత్తమం. మహాలయ పక్షాలు ప్రారంభమయ్యేది ఇప్పుడే. పితృదేవతలు సంతృప్తి చెందితే కుటుంబవృద్ధి జరుగుతుంది.  కర్కాటక సంక్రాంతి రోజు నదీస్నానం  ఆచరించి దానధర్మాలు చేస్తే విశేష పుణ్యం లభిస్తుంది. నదీస్నానం ఆచరించడం సాధ్యంకానివారు నీటిలో గంగాజలం కలుపుకుని స్నానమాచరించవచ్చు. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. వేదపండితులకు స్వయంపాక సమర్పించి..పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయాలి. 


అనారోగ్యం పెరిగే సమయం


దక్షిణాయణ కాలంలో భూమిపై సూర్యకాంతి తక్కువగా ప్రసరిస్తుంది. ఫలితంగా అనారోగ్య సమస్యలు  విజృంభించే సమయం. అందుకే ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకునేందగుకు బ్రహ్మచర్యం , ఉపాసన , ఉపవాసం , పూజలు , వ్రతాల పేరుతో ఎన్నో నియమాలు పెట్టారు. ఇవన్నీ అనుసరించడం అంటే భక్తి మాత్రకే కాదు... మీ ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టే.  


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.