Toli Ekadashi 2024 : జూలై 17 తొలి ఏకాదశి
జూలై 16 మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఏకాదశి ఘడియలు జూలై 17 బుధవారం సాయంత్రం 5 గంటల 56 నిముషాల వరకూ ఉన్నాయి. అందుకే తొలి ఏకాదశి విషయంలో ఎలాంటి గందరగోళం అవసరం లేదు. జూలై 17 బుధవారం తొలి ఏకాదశి. ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు.
వర్షాకాలం ఆరంభం తొలి ఏకాదశి
అప్పట్లో తొలి ఏకాదశి రాగానే వానాకాలం ఆరంభమైందనుకునేవారు. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా అంటువ్యాధులు, అనారోగ్య సమస్యలు పెరుగుతాయి..అందుకే తొలి ఏకాదశి రోజు ఉపవాస నియమాలు కఠినంగా పాటించేవారు.
లంఖణం పరమ ఔషధం అన్నట్టు...ఉపవాస దీక్షలకు తొలి ఏకాదశి మొదలు...
తొలి ఏకాదశి రోజు నుంచి రాత్రి సమయం పెరుగుతుంది అనేందుకు కూడా సూచన
Also Read: ఈ రాశులవారికి వానాకాలం అంటే చాలా ఇష్టం - చిరుజల్లుల సవ్వడి వింటూ ఊహా ప్రపంచంలోకి వెళ్లిపోతారు!
శయన ఏకాదశి
ఆషాఢంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిరోజు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళతాడు. విష్ణువు నిద్రకు ఉపక్రమించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అంటారు. అందుకే ఈ రోజంతా ఉపవాస నియమాలు పాటించి జాగరణ చేసి శ్రీ మహావిష్ణువు ధ్యానంలో గడిపి ద్వాదశి రోజు దాన , ధర్మాలు చేసి ఉపవాస దీక్ష విరమించాలి. తొలి ఏకాదశి రోజు పాటించే నియమాల వల్ల జన్మజన్మల పాపాలు ప్రక్షాళణ అవుతాయని భక్తుల విశ్వాసం. ఈ రోజు యోగనిద్రలోకి వెళ్లే శ్రీ మహావిష్ణువు...సరిగ్గా నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటాడు.
ఏకాదశి అనే పేరెలా వచ్చింది?
సత్యయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మ వరంతో దేవతలను, మహర్షులను హింసించేవాడు. ఆ రాక్షసుడితో వెయ్యేళ్లు పోరాడిన విష్ణువు అలసిపోయి ఓ గుహలో నిద్రించాడట. అప్పుడు శ్రీ హరి శరీరం నుంచి ఓ కన్య ఉద్భవించి ఆ రాక్షసుడిని సంహరించింది. సంతోషించిన శ్రీ మహావిష్ణువు వరం కోరుకోమని చెప్పగా.. తాను విష్ణుప్రియగా ఉండాలని అడిగింది. అప్పుడు ఆమెకు ఏకాదశిగా నామకరణం చేసిన విష్ణువు.. తిథుల్లో భాగం చేశాడని ...అందుకే ఏకాదశి తిథి ప్రత్యేకం అని చెబుతారు.
ఉపవాసం ఎందుకు?
తిథుల్లో పదకొండవది ఏకాదశి...ఏకాదశి అంటే పదకొండు. అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. వీటిని మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి భగవంతుడికి నివేదించాలి. దీనివలన సహజంగా అలవడే బద్దకం దూరమవుతుంది, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని చెబుతారు. ఉపవాసం వల్ల జీర్ణకోశంలో ఉండే సమస్యలు తొలగిపోయి నూతనోత్తేజం వస్తుంది.
Also Read: ఎవ్వరూ చూడడం లేదు అనుకుంటే ఎలా...మిమ్మల్ని మౌనంగా గమనించే 18 సాక్షులు ఇవే!
పేలపిండి ప్రత్యేకం
ఏకాదశి రోజు పేల పిండిని తీసుకుంటారు. పేలాల్లో బెల్లం, యాలకులు చేర్చి తయారు చేస్తారు. ఆషాఢంలో వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది పేలపిండి. శరీరానికి వేడినిచ్చే పేలపిండి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.