భోగి పండుగ రోజు పొద్దున్నే బొమ్మల కొలువుతో సంబరాన్నంతా నట్టింట్లో కూర్చోబెట్టి సాయంత్రం అయ్యేసరికి పేరంటం చేస్తారు. ఈ సందర్భంగా భోగిపళ్లు పోస్తారు. ఈ రోజున రేగు పళ్లు కాస్తా భోగిపళ్లుగా మారిపోతాయి. చుట్టుపక్కల ముత్తైదువులందర్నీ పిలిచి వారితో పిల్లలకు దిష్టి తీయిస్తారు. దోసిలి నిండా రేగు పళ్లు, చిల్లర, చెరుకు ముక్కలు, బంతిపూల రెక్కలు మూడుసార్లు తలమీదుగా దిష్టి తీసి పోస్తారు. ఇంకొందరు దిష్టితీసినవి పిల్లలపై పోయకుండా గుమ్మం బయటకు విసురుతారు. చుట్టుపక్కల ఆడుకునే చిన్న పిల్లలంతా వచ్చి చిల్లర నాణేలు, రేగుపళ్లు ఏరుకునేందుకు పోటీపడతారు. 


Also Read:  ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకంటారా.. అయితే మీకు ఈ విషయం తెలియదేమో..
సాక్షాత్తూ ఆ నారాయణులు ఈ బదరీ వృక్షం (రేగుచెట్టు) వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడనీ, ఆ ఫలాన్ని తింటూ తపస్సు సాగంచాడని అందుకే రేగు చెట్టుకి అంత ప్రాధాన్యత అంటారు పండితులు.  మరోవిషయం ఏంటంటే రేగుపళ్లను అర్కఫలం అని కూడా అంటారు.  ‘అర్కుడు’ అంటే సూర్యుడు. సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్లే సమయం కావడంతో  ఆయన కరుణాకటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు భోగి పళ్లు పోస్తారు.  పైగా భారతదేశ వాతావరణానికి అనుగుణంగా ఎలాంటి ప్లేస్ లో అయినా రేగు చెట్టు పెరుగుతుంది. ఎండని, వాననీ అన్నింటినీ తట్టుకుంటుంది. సరిగ్గా సంక్రాంతి రోజు ఈ రేగుపళ్లు అందుబాటులోకి వస్తాయి. పుల్లగా ఉండే ఈ రేగుపళ్లు తినడానికి రుచిగా ఉండడమే కాదు వీటిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. సంప్రదాయ వైద్యంలో రేగుపళ్లది ప్రత్యేత స్థానం... జలుబు, దగ్గు నుంచి సంతానలేమి సమస్య వరకూ అన్ని రుగ్మతలకీ రేగుపళ్లు దివ్య ఔషధంగా భావిస్తారు. ఈ పళ్లనుంచి వచ్చే వాసన మనసుని ఆహ్లాదంగా ఉంచుంతుదంటారు. భూటాన్ వాసులు ఇంటిని పరిశుభ్రంగా ఉంచేందుకు రేగుపళ్లు మరిగిస్తారట. 


Also Read: ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి..
భోగిపళ్లుగా రేగుపళ్లు ఎందుకు పోస్తారు
భోగి పళ్లను ఐదేళ్లలోపు పిల్లలకి పోస్తారు. ఈ వయసులో ఉన్న పిల్లల్లో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఊపిరితిత్తులూ, జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటాయి. వీరికి రేగుపళ్లు అమృతంలా పనిచేస్తాయట. ఎందుకంటే వీటిలో విటమిన్ 'సి' ఎక్కువగా ఉండి రోగనిరోధక శక్తి పెంచడమే కాదు జీర్ణసంబంధిత వ్యాధులు నివారించేందుకు ఉపయోగపడుతుందంటారు


బంతిపూల రెక్కలెందుకు
ఇక రేగుపళ్లతోపాటు బంతిపూల రెక్కలని వాడటం వల్ల కూడా పిల్లల చుట్టూ క్రిమికీటకాలు దరిచేరవని చెబుతారు.  ఎందుకంటే బంతిపూలకి ఉన్న ప్రాథమిక లక్షణం క్రిములని చంపడమే. పైగా ఇవి చర్మానికి తగిలితే చర్మసంబంధమైన వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందట. 


దిష్టిపోతుందని విశ్వాసం
నర దిష్టికి నల్లరాయి కూడా పగులుతుందంటారు. ముఖ్య పసిపిల్లలకు దిష్టి తగలడం సహజం. అందుకే.. వారికి అప్పటివరకూ ఉన్న దిష్టి మొత్తాన్ని తీసి పారేయడమే భోగి పళ్లు పోయడం వెనుక ముఖ్య ఉద్దేశం అని చెబుతారు. సాయంత్రం పిల్లలతో సంది గొబ్బెళ్లు పెట్టించి భోగిపళ్లు పోస్తారు. 


Also Read: 11 ఇంద్రియాలపై నియంత్రణే వైకుంఠ ఏకాదశి దీక్షలో ఆంతర్యం
Also Read:  సంక్రాంతికి శ్రీశైలం మల్లన్న కల్యాణం, భక్తులకు ఈ నిబంధనలు తప్పనిసరి...
Also Read:  గతేడాది ఎలా చేశారో తెలియదు కానీ… ఈ సంక్రాంతికి ఇలా చేయండి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి