Dhanurmasam Special Thiruppavi pasuram :  ధనుర్మాసం నెలరోజులు ఆలయాల్లో సుప్రభాతం బదులు పాశురాలు(గోదాదేవి రాసిన పాటలు)  ఆలపిస్తారు. మొత్తం 30 పాశురాలను రోజుకొకటి చొప్పున చదువుతారు. డిసెంబర్ 16న దనుర్మాసం ప్రారంభమైంది. ఇప్పటికే 9 రోజులు పూర్తైంది. డిసెంబర్ 25న పదో రోజు, డిసెంబర్ 26న పదకొండో రోజు, డిసెంబర్ 27న పన్నెండో రోజు.. పాశురాలు పాడాలి.  ఆ పాశురాలు, వాటి అర్థం తెలుసుకుందాం...


తిరుప్పావై పదోరోజు  పాశురం ( డిసెంబర్ 25  బుధవారం )


నోత్తు చ్చువర్ క్కమ్ పుగుగిన్ఱ అమ్మనాయ్!
మాత్తముమ్ తారారో వాశల్ తిఱవాదార్
నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్ - నమ్మాల్
పోత్తప్పఱై తరుమ్ పుణ్ణియనాల్! పణ్డోరునాళ్
కూత్తత్తిన్ వాయ్ వీళ్ న్ద కుమ్బకరణనుమ్
తోత్తు మునక్కే పెరున్దుయిల్ తాన్ తన్దానో?
ఆత్త అనన్దలుడైయాయ్! అరుజ్గలమే!
తేత్తమాయ్ వన్దు తిఱ వేలో రెమ్బావాయ్.


భావము: ధనుర్మాస నోము నోచుతూ..శ్రీకృష్ణుడి కృపకు పాత్రురాలివి అవుతున్న ఓయమ్మా తలుపు తెరువు. తలుపు తెరవకపోయినా నోటితో పలకొచ్చు కదా..పరిమళాలు వెదజల్లే తులసి మాలలను కిరీటంగా ధరించిన శ్రీమన్నారాయణుడు మన స్తోత్రాలకు సంతోషిస్తాడు. రామావతారంలో కుంభకర్ణుడిని సంహరించాడు..ఆ కుంభకర్ణుడు తన నిద్రను నీకు కానుకగా ఇచ్చాడా ఏంటి? ఇక ననైనా నిద్రలే..వచ్చి మాతో కలసి వ్రతాన్ని ఆచరించవమ్మా అని పిలుస్తోంది ఆండాళ్.  


Also Read: తిరుమల భోజనశాలలో ఉన్న ఈ పెయింటింగ్ ఏంటో తెలుసా!



తిరుప్పావై పదకొండో రోజు పాశురం ( డిసెంబర్ 26 గురువారం )


కత్తుక్కఱవై క్కణంగళ్ పల కఱన్ధు
శెత్తార్ తిఱ లళియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుమ్
కుత్త మొన్ఱిల్లాద కోపలర్ దమ్ పొఱ్కొడియే
పుత్తర వల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుత్తత్తు తోళిమారెల్లారుమ్ వనుమ్ నిన్
ముత్తమ్ పుగున్థు ముగిల్ వణ్ణన్ పేర్పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి, నీ
ఎత్తుక్కు ఱజ్ఞమ్ పొరుళే లోరెమ్బావాయ్


భావము: ఓ గోపాలకుల తిలకమా.. పశు సంపద కలిగిన మీ వంశం ఎంతో గొప్పది. ఆ సమూహాల పాలు పితికేవారు, శత్రువులు నశించేలా యుద్ధం చేయగలవారు, ఏ దోషం లేని కులంలో పుట్టిన బంగారు తీగవంటి అందమైన దానా..ఓ వనమయూరమా లేచి రా..నీ సఖులు, బంధువులు అందరూ వచ్చి నీకోసం ఎదురు చూస్తున్నారు. నీలమేఘంలాంటి శరీర కాంతి ఉన్న శ్రీకృష్ణుడి తిరునామాలు పాడుతున్నారు. ఐనా కానీ నువ్వు చలించకుండా ఎలా నిద్రపోతున్నావ్..ఇంత ధ్వని వినిపిస్తుంటే ఉలకవు, పలకవేమి? అందరితో కలసి నువ్వు కూడా వ్రతంలో పాల్గొనేందుకు రావమ్మా..


Also Read: తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు?


తిరుప్పావై పన్నెండో రోజు పాశురం ( డిసెంబర్ 27 శుక్రవారం)


కనైత్తిళజ్గత్తెరుమై కన్ఱుక్కిరజ్గి,
నినైత్తుములై వళియే నిన్ఱుపాల్ శోర,
ననైత్తిల్లమ్ శేఱాక్కుమ్ నఱ్చెల్వన్తజ్గాయ్!
పనిత్తలైవీళ నిన్ వాశల్ కడైపత్తి
చ్చినత్తినాల్ తెన్నిలజ్గైక్కోమానైచ్చెత్త
మనత్తుక్కినియానై ప్పాడవుమ్ నీవాయ్ తిఱవాయ్
ఇనిత్తా నెళున్దిరాయ్ ఈదెన్న పేరు ఱక్కమ్
అనైత్తిల్లత్తారు మఱిన్దేలో రెమ్బావాయ్


భావము: లేగ దూడలను తలుచుకుని పశువులు పాలు స్రవిస్తూనే ఉన్నాయి. ఆ పాలతో ఇంటి ప్రాంగణం మొత్తం తడిసిపోయింది. ఇంత సంపద ఉన్న గోపాలునికి చెల్లెలివైతివి...ఓ అమ్మా మేం అందరం నీ వాకిట నిల్చున్నాం. పైన మంచు కురుస్తోంది..కింద పాలధారలు పారుతున్నాయి.. అయినప్పటికీ మనసులో మాధవుడిని తలుచుకుని నీ ఇంటి ముందే ఉన్నాం. ముప్పేట ధారలతో తడిసి తడిసి కూడా నిన్ను మాతో కలుపుకుని వెళ్లేందుకు పట్టుబట్టి ఇక్కడే ఉన్నాం. అప్పట్లో సీతమ్మను చెరబట్టిన రావణుడిని మట్టుబెట్టిన రాముడి గుణగణాలను స్తుతిస్తున్నాం. మేం ఇంత చెబుతున్నా ఆ మొద్దునిద్రేంటి...లేచి మాతోపాటూ వ్రతంలో పాలుపంచుకోమ్మా అంటూ గోపికను లేపుతోంది ఆండాళ్..


Also Read: తిరుమల వెళుతున్నారా.. ఈ తప్పులు ఎప్పుడూ చేయకండి!