Never Make These Mistakes at Tirumala:  కలియుగప్రత్యక్షదైవం అయిన శ్రీ వేంకటేశ్వరస్వామిని కళ్లారా దర్శించుకున్నాను..జన్మ ధన్యం అనుకుంటారు. మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్లేవారు కొందరు, కష్టం చెప్పుకుని తీరుతుందనే ఆశతో వెళ్లేవారు ఇంకొందరు, శ్రీ వేంకటేశ్వరస్వామిపై చూసి పులకించిపోయేందుకు వెళ్లొచ్చేవారు మరికొందరు. కారణం ఏదైనా శ్రీవారి సన్నిధి నిత్యం భక్తులతో కళకళలాడిపోతుంటుంది. అయితే వేంకటేశ్వరస్వామి కరుణాకటాక్షాలు మీపై ఉండాలంటే అత్యంత పుణ్యక్షేత్రమైన తిరుమలలో ముఖ్యంగా ఈ నాలుగు తప్పులు చేయకూడదు. అప్పుడే శ్రీవారి కరుణ మీపై ఉంటుందంటారు పండితులు.. ఆ నాలుగు తప్పులేంటో తెలుసుకుందాం..


వరాహస్వామి దర్శనమే ముందు


సాధారణంగా తిరుమలకు వెళ్లే చాలామంది భక్తులు చేసే మొదటి తప్పు నేరుగా శ్రీవారి దర్శనానికి వెళ్లిపోతారు. వాస్తవానికి వరాహస్వామి దర్శనం చేసుకోకుండా శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకోకూడదు. ఎందుకంటే తిరుమల క్షేత్రం శ్రీనివాసుడిది కాదు..వరాహస్వామిది. అక్కడ స్వామివారు కొలువైనప్పుడు వరాహస్వామికి మూడు వాగ్ధానాలు చేసి ప్రమాణపత్రం కూడా రాసిచ్చారు. మొదటి పూజ, మొదటి నైవేద్యం, మొదటి దర్శనం నీకే ఇస్తానని మాటిస్తూ ఆ శాసనంలో ఉంది. అందుకే అర్చకస్వాములు మొదటి పూజ, మొదటి నైవేద్యం వరాహస్వామికే అర్పిస్తారు. కానీ భక్తులు చాలామంది వరాహస్వామిని దర్శించుకోకుండా శ్రీనివాసుడిని చూసి తరిస్తున్నారు.  


వరాహ దర్శనాత్ పూర్వం శ్రీనివాసం నమేన్నచ
దర్శాత్ ప్రాగ్ వరాహస్య శ్రీనివాసో న  తృప్యతి
 
వరాహస్వామి కన్నా ముందు వచ్చిన నన్ను దర్శించుకుంటే దానికి ఫలితం ఉండదని ఈ శ్లోకం అర్థం.


తమిళులు వరాహా స్వామిని జ్ఞానం ఇచ్చేవాడుగా భావిస్తారు.. శరీరంలో ఉన్న అన్నమయకోశం, విజ్ఞానమయకోశం, ఆనందమయకోశం అని ఉంటాయి. వరహాస్వామి దర్శనంతో  జీవుడు విజ్ఞానమయ కోశంలోకి ప్రవేశించి ఆ తర్వాత ఆనందకోశంలో ఉన్న స్వామిని దర్శించుకోవడం సాధ్యమవుతుందని అర్థం. అందుకే వరాహస్వామిని చూడకుండా వెళ్లేవారికోసమే అన్నట్టు...తిరుమల ఆలయంలో లోపల దర్శనానికి వెళ్లినప్పుడు ఓ స్తంభంపై వరాహస్వామి కనిపిస్తారు. 


Also Read: శ్రావణమాసంలో 4 శుక్రవారాలు ఎలా పూజ చేయాలి - వరలక్ష్మీ వ్రతం రోజు కలశంపై పెట్టిన కొబ్బరికాయ ఏం చేయాలి!


లౌకిక సుఖాలకోసం తిరుమల వెళ్లొద్దు


అత్యంత పవిత్రమైన తిరుమలకు లౌకిక సుఖాల కోసం ఎప్పుడూ వెళ్లకూడదు. అందుకే పెళ్లి జరిగితే ఆరు నెలల పాటూ  పుణ్యక్షేత్రాలకు వెళ్లకూడదని పెద్దలు చెప్పేవారు. ఎందుకంటే పెళ్లైన తర్వాత ఆ వ్యామోహం నుంచి బయటపడేందుకు కనీసం ఆరు నెలలు పడుతుంది. అందుకే ఈ నియమం. ఇది కేవలం భక్తులకే కాదు..వేంకటేశ్వరుడు కూడా పద్మావతిని వివాహం చేసుకున్న తర్వాత ఆరు నెలల పాటూ కొండకిందనున్న అగస్త్య మహర్షి ఆశ్రమంలోనే ఉండిపోయారు. ఆ తర్వాతే కొండెక్కారు..


దొంగ దర్శనాలు చేసుకోకండి


తిరుమలలో చాలామంది చేసే మూడోతప్పు దొంగ దర్శనాలు. దేవస్థానం పెట్టిన నియమాలను గాలికి వదిలేసి వేర్వేరు లెటర్లు తీసుకొచ్చి దర్శనాలు చేసుకుంటారు. దానివల్ల ఎలాంటి ఫలితం ఉండబోదు. ఎన్నిసార్లు, ఎంతసేపు దర్శించుకున్నాం అనికాదు..మనసు పవిత్రంగా ఉందోలేదో అన్నదే ముఖ్యం.  


మాడవీధుల్లో పాదరక్షలతో తిరగకండి 


తిరుమలకు వెళ్లే భక్తులు ఇలా చేయకండి అంటూ రామానుజులు ఓ రెండు విషయాలు చెబుతూ శాసనం చేశారు. ముఖ్యంగా తిరుమల మాడవీధుల్లో పాదరక్షలతో నడవకూడదు. వాస్తవానికి కొండమొత్తం శాలగ్రామశిల. కొండమొత్తం చెప్పుల్లేకుండా తిరగడం సాధ్యంకాకపోయినా మాడవీధుల్లో చెప్పులు వేసుకోవద్దు. కొండపై ప్రతి పూవూ స్వామికే అంకితం. అందుకే స్వామివారి వాడిన పూలు కూడా తీసి ఎవ్వరికీ ఇవ్వరు. అయినప్పటికీ అక్కడ పూలు అమ్మేస్తున్నారు, కొనుక్కుని పెట్టేసుకుంటున్నారు...కానీ కొండపై పూలు పెట్టుకోకూడదు.. ఆ ప్రదేశంలో ప్రతికుసుమం స్వామివారి సొంతం..
 
ఈ తప్పులు చేయకుండా పుష్కరిణిలో స్నానమాచరించి శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకుంటే అన్నీ శుభాలే జరుగుతాయి...


Also Read: శ్రావణమాసంలో అమ్మవారి పూజ చేస్తున్నారా.. ఈ తప్పులు పొరపాటున కూడా చేయకండి!