ETV Win original movie Veeranjaneyulu Vihara Yatra review in Telugu: కుటుంబం అంతా చూసే వెబ్ సిరీస్, సినిమాలను అందిస్తోంది ఈటీవీ విన్ యాప్. అందులో వచ్చిన 'నైంటీస్' వెబ్ సిరీస్ తెలుగు ప్రేక్షకులను అలరించింది. 'వీరాంజనేయులు విహార యాత్ర' (Veeranjaneyulu Vihara Yatra Movie) ప్రచార చిత్రాలు చూసినప్పుడు అటువంటి ఫీలింగ్ కలిగింది. సీనియర్ నరేష్, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. అనురాగ్‌ పలుట్ల దర్శకత్వంలో బాపినీడు .బి, సుధీర్‌ ఈదర నిర్మించారు. ఆగస్టు 14 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి, ఈ సినిమా ఎలా ఉంది? అనేది తెలుసుకోండి.


కథ (Veeranjaneyulu Vihara Yatra Story): నాగేశ్వరరావు (నరేష్ విజయకృష్ణ) ఓ పాఠశాలలో 30 ఏళ్లుగా లెక్కల మాస్టారు. ఇంగ్లీష్ రాని కారణంగా ఉద్యోగం పోతుంది. సరిగ్గా ఆ సమయంలో అమ్మాయి సరు అలియాస్ సరయు (ప్రియా వడ్లమాని) పెళ్లి కుదురుతుంది. తమ కుమారుడు ప్రేమించాడని తరుణ్ (రవితేజ మహాదాస్యం) తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకొంటారు. కానీ, ఘనంగా చేయాలని కండిషన్ పెడతారు. అందుకు సరేనని నాగేశ్వరరావు అంగీకరిస్తాడు. 


ఉద్యోగం పోయి చేతిలో డబ్బులు లేక కష్టాలు పడుతున్న నాగేశ్వరరావు... గోవాలో తన తండ్రి వీరాంజనేయులు (బ్రహ్మానందం) కొన్న ఇంటిని అమ్మేసి అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటాడు. ఆ విషయం ఇంట్లో చెప్పకుండా అస్థికలు గోవాలోని సముద్రంలో కలపాలని తన తండ్రి చివరి కోరికగా లేఖ రాసినట్టు అందర్నీ గోవా తీసుకు వెళతాడు.


వీరాంజనేయులు ఫ్యామిలీ గోవా జర్నీలో ఏం జరిగింది? నాగేశ్వరరావు అబ్బాయి వీరు (రాగ్ మయూర్), అమ్మాయి సరయు (ప్రియా వడ్లమాని) మధ్య గొడవ ఏంటి? వాళ్లిద్దరూ తల్లిదండ్రుల దగ్గర ఏం దాచారు? ఆ విషయాలు తెలిసి ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయ్యింది? గోవాలో ఇంటికి అమ్మేయాలనుకున్న నాగేశ్వరరావు నిర్ణయం తెలిసి అతని తల్లి (శ్రీలక్ష్మి), పిల్లలు ఎలా రియాక్ట్ అయ్యారు? చివరకు ఏమైంది? అనేది సినిమా.


విశ్లేషణ (Veeranjaneyulu Vihara Yatra Review Telugu): నాన్న... ఎవర్ గ్రీన్ ఎమోషన్. అందులోనూ మిడిల్ క్లాస్ నాన్న అంటే ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయ్యే ఎమోషన్. మెజారిటీ ఆడియన్స్ మిడిల్ క్లాస్ కనుక. బరువు బాధ్యతలు, బంధాలకు నడుమ నాన్న ఎన్ని కష్టాలు పడతాడు? అనే కాన్సెప్టుతో తెలుగులో కొన్ని సినిమాలు వచ్చాయి. 'వీరాంజనేయులు విహార యాత్ర' కూడా అటువంటి చిత్రమే.


గోవా అంటే యూత్ అంతా వెళ్లి ఎంజాయ్ చేస్తారని ఓ ఇమేజ్ ఉంది. అటువంటి ప్రాంతానికి అస్థికలు కలపడానికి వెళ్లడం అనే పాయింట్ చెబితే మాంచి కామెడీ ఉంటుందని ఆడియన్స్ ఆశిస్తారు. బామ్మ, తల్లిదండ్రులతో న్యూ ఏజ్ బ్రదర్ అండ్ సిస్టర్ అనేసరికి కొత్తగా ఉంటుందని అనుకుంటారంతా! కానీ, ఈ సినిమాలో అవేవీ లేవు.


'వీరాంజనేయులు విహార యాత్ర' దర్శక రచయిత అనురాగ్ పాలుట్ల ఆలోచనలో కొత్తదనం ఉంది. కామెడీకి స్కోప్ ఉంది. కానీ, స్క్రీన్ మీదకు అవేవీ కనెక్ట్ కాలేదు. రొటీన్ రొట్ట కొట్టుడు సన్నివేశాలతో సినిమాను సాగదీశారు. ఆడియన్స్ సర్‌ప్రైజ్ అవుతారని దర్శకుడు అనున్నారేమో కానీ... ఒక్క ట్విస్ట్ కూడా వర్కవుట్ కాలేదు. అదేంటో... ప్రతిదీ మనకు ముందు అర్థం అవుతూ ఉంటుంది. చివరకు క్లైమాక్స్ కూడా! కామెడీ అయితే అక్కడక్కడా తప్పితే పెద్దగా వర్కవుట్ కాలేదు. తొలుత తండ్రిని అపార్థం చేసుకుని, ఆ తర్వాత అర్థం చేసుకునే కొడుకులను చాలా సినిమాల్లో చూడటం వల్ల ఆ ఎమోషన్ సైతం సోసోగా పాస్ అవుతుందంతే!


Also Read: కమిటీ కుర్రోళ్ళు రివ్యూ: ఆ క్లైమాక్స్ పవన్ కోసమేనా - నిహారిక నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?



'వీరాంజనేయులు విహార యాత్ర'కు రైటింగ్ వీక్ అయితే... మ్యూజిక్ స్ట్రాంగ్. ఆర్ హెచ్ విక్రమ్ బాణీలు, నేపథ్య సంగీతం బావున్నాయి. మెలోడీ ట్యూన్లు మళ్లీ మళ్లీ వినొచ్చు. కెమెరా వర్క్ ఓకే. కథకు తగ్గట్టు, అవసరం మేరకు ఖర్చు చేశారు.


రొటీన్ రైటింగ్ ఉన్నప్పటికీ... నటీనటులు తమ భుజాల మీద 'వీరాంజనేయులు విహార యాత్ర'ను మోసే ప్రయత్నం చేశారు. నరేష్ (Naresh VK)కు ఇటువంటి క్యారెక్టర్, ఎమోషన్ చేయడం కొత్త కాదు. కానీ, ఆ పాత్రను అర్థం చేసుకుని అందుకు తగ్గట్టు చక్కగా నటించారు. రాగ్ మయూర్ మంచి పెర్ఫార్మర్. తన వరకు పాత్రకు న్యాయం చేశారు. ఇప్పటి వరకు ప్రియా వడ్లమాని చేసిన క్యారెక్టర్లకు సరయు డిఫరెంట్ రోల్. నటన మాత్రమే చూపించే అవకాశం దక్కింది. బాగా చేశారు. శ్రీలక్ష్మి, రవితేజ మహాదాస్యం, హర్షవర్ధన్, ప్రియదర్శిని తదితరులు తమ పరిధి మేరకు చేశారు. బ్రహ్మానందం స్క్రీన్ మీద కనిపించలేదు. కానీ, ఆయన్ను ఫీల్ అయ్యామంటే కారణం ఆ వాయిస్, ఆయనకు ఉన్న ఇమేజ్ కారణం.


'వీరాంజనేయులు విహార యాత్ర' సినిమాలో వినోదం తగ్గింది. సినిమా నిడివి రెండు గంటలే అయినా మూడు గంటలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. కుటుంబంతో చూసేలా తీశారు. కానీ, వీక్షకులు అందరూ ఆ ఎమోషన్స్‌తో కనెక్ట్ కావడంతో పాటు క్యారీ అయ్యేలా సన్నివేశాలను తీయడంలో ఫెయిల్ అయ్యారు. ఈ విహార యాత్రలో వినోదం తక్కువ... విచారం, విషాదం (ప్రేక్షకులకు) ఎక్కువ.


Also Readబృంద రివ్యూ: Sonyliv OTTలో త్రిష వెబ్ సిరీస్ - సౌత్ క్వీన్ ఓటీటీ డెబ్యూ హిట్టా? ఫట్టా?