Trisha OTT Debut Brinda Web Series Review In Telugu: త్రిష... సౌత్ క్వీన్! తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో 50కు పైగా సినిమాల్లో నటించారు. ఫర్ ద ఫస్ట్ టైమ్... ఆవిడ ఓ వెబ్ సిరీస్ చేశారు. 'బృంద'తో ఓటీటీకి పరిచయం అయ్యారు. సోనీ లివ్ (Sony Liv APP)లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, బెంగాలీ, హిందీ భాషల్లో వీక్షకులకు అందుబాటులో ఉంది. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సిరీస్ (Brinda Web Series Review Telugu) ఎలా ఉంది? అనేది చూడండి.


కథ (Brinda Web Series Story): హైదరాబాద్ సిటీలోని కాటేరు స్టేషనులో బృంద (త్రిష) లేడీ ఎస్సై. స్టేషన్ పరిధిలో దొరికిన ఓ మృతదేహం ఆమెలో అనుమానానికి కారణం అవుతుంది. ఇన్వెస్టిగేషన్ చేయగా... అదొక్కటే కాదని, ఓ సీరియల్ కిల్లర్ ఇంకొన్ని మర్డర్స్ చేశాడని తెలుసుకుంటుంది. సమాజంలో పలుకుబడి ఉన్న సైకాలజీ ప్రొఫెసర్ కబీర్ ఆనంద్ (ఇంద్రజిత్ సుకుమారన్) మీద అనుమానం వ్యక్తం చేస్తుంది. అయితే, అది తప్పని తేలుతుంది. సస్పెండ్ అవుతుంది.


సస్పెన్షన్ తర్వాత సీరియల్ కిల్లర్ ఒక్కొక్క మర్డర్ కాదని, మాస్ మర్డర్స్ (పదుల సంఖ్యలో జనాలను పైలోకాలకు పంపించాడని) చేశాడని బృంద మదిలో కొత్త సందేహం కలుగుతుంది. అందుకు కారణం ఏమిటి? హత్యల వెనుక ఉన్నది ఎవరు? ఠాకూర్ (ఆనంద్ సమీ), సత్య (రాకేందు మౌళి), కబీర్ ఆనంద్ ఎవరు? వాళ్లకు, బృందకు ఉన్న సంబంధం ఏమిటి? ఇన్వెస్టిగేషన్‌లో బృందకు మరో ఎస్సై సారథి (రవీంద్ర విజయ్) ఎటువంటి సహకారం అందించాడు? చివరకు, ఆ సీరియల్ కిల్లింగ్స్ వెనుక ఉన్నది ఎవరో బృంద కనిపెట్టిందా? లేదా? ఆమె గతం ఏమిటి? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి. 


విశ్లేషణ (Brinda Web Series Review Telugu): తీగ లాగితే డొంక అంతా కదిలినట్లు అని ఓ సామెత ఉంది కదా! 'బృంద'కు సరిగ్గా అది సరిపోతుంది. ఓ మర్డర్ వెనుక మరొక మర్డర్, ఆ వెనుక ఇంకో మర్డర్... ఒక్కొక్కటీ కాదు, వందల మర్డర్స్ అంటూ కథను మలుపులతో ముందుకు తీసుకు వెళ్లిన విధానం ప్రతి సన్నివేశంలో, ప్రతి అడుగులో... ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.


సీరియల్ కిల్లింగ్స్... ఈ సబ్జెక్ట్ వెబ్ సిరీస్ లేదా సినిమాకు కొత్త కాదు. ఆల్రెడీ మన ఆడియన్స్ చూసిన కథల నుంచి 'బృంద' కథను వేరు చేసింది దర్శకుడు సూర్య మనోజ్ వంగాల తెరకెక్కించిన తీరు, పద్మావతి మల్లాదితో కలిసి రాసిన స్క్రీన్ ప్లే! ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 'నెక్స్ట్ ఏంటి?' అని క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. వ్యూవర్స్ అటెన్షన్ గ్రాబ్ చేయడంలో, మిస్ లీడ్ చేయడంలో దర్శక రచయితలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు. త్రిష బాల్యానికి, హంతకుడికి ముడిపెట్టిన తీరు కూడా బాగుంది. దేవుడి మీద నమ్మకం, మూఢనమ్మకం... రెండిటి మధ్య తేడాను చక్కగా చూపించారు.


సాధారణంగా సస్పెన్స్ థ్రిల్లర్స్, సీరియల్ కిలింగ్స్ నేపథ్యంలో తెరకెక్కిన కథల్లో హంతకుడు ఎవరు? అనేది చివరి వరకు సస్పెన్సుగా ఉంచుతారు. కానీ, మర్డర్స్ చేసేది ఎవరో ముందు రివీల్ చేసి... ఇన్వెస్టిగేషన్ మీద ఆడియన్స్ చూపు పడేలా చేశాడు దర్శకుడు. హంతకుడిని బృంద ఎలా పట్టుకుంటుందో? అని ఎదురు చూసేలా చేశాడు. చేతికి చిక్కినట్టే చిక్కిన హంతకుడు తప్పించుకుంటుంటే... 'అయ్యో' అనుకునేలా చేశాడు.


'బృంద' సిరీస్, కథను సూర్య మనోజ్ వంగాల ప్రారంభించిన తీరు వెంట వెంటనే మిగతా ఎపిసోడ్స్ అన్నీ చూసేయాలని వీక్షకులు బలంగా కోరుకునేలా చేశాడు. ఈ సిరీస్ స్టార్టింగులో అంత హై ఇచ్చిన దర్శకుడు ఎండింగ్ వచ్చేసరికి కంటిన్యూ చేయడంలో కాస్త తడబడ్డాడు. అందుకు కారణం... 


సాధారణంగా సిరీస్ మొదట నిదానంగా ప్రారంభించి, చివరిలో యాక్షన్ కిక్ ఇవ్వాలని చూస్తారంతా! కానీ, సూర్య మనోజ్ అలా చేయలేదు. మొదట ఉత్కంఠ క్రియేట్ చేసి, ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ - ఎమోషన్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేశారు. క్యూరియాసిటీ క్రియేట్ చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ తర్వాత వచ్చే ఎమోషనల్ ఎపిసోడ్స్ అంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. తల్లి (ఆమని), చెల్లి (యష్ణ)తో త్రిష సన్నివేశాలు రొటీన్ అనిపిస్తాయి. వాటిలో అంత బలం లేదు. చివరి మూడు ఎపిసోడ్లలో లెంత్ ఎక్కువ అయిన ఫీలింగ్ కలుగుతుంది.


'బృంద' (Brinda Review In Telugu)కు మెయిన్ అసెట్ శక్తికాంత్ కార్తీక్ సంగీతం. పాటలే కాదు... నేపథ్య సంగీతం సైతం చాలా బాగుంది. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్, దినేష్ కె బాబు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అడవిని, హైదరాబాద్ సిటీని కొత్తగా చూపించారు. జయ్ కృష్ణ డైలాగులు షార్ట్ అండ్ స్వీట్‌గా ఉన్నాయి. నిర్మాణ విలువలు బావున్నాయి.


ఓటీటీ డెబ్యూ కోసం త్రిష తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చారు. అందంగా కనిపిస్తూ పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఎంపిక చేసుకోవచ్చు. ఇటువంటి క్రైమ్ థ్రిల్లర్స్‌లో ఫిరోషియస్ రోల్స్ ట్రై చేయవచ్చు. కానీ, సొసైటీలో ఫిమేల్ పోలీస్ ఫేస్ చేసే సిట్యువేషన్స్ బేస్ చేసుకుని రాసిన క్యారెక్టర్ చేశారు. బృంద పాత్రలో, ఆ నటనలో ఇంటెన్స్ చూపించారు. కలలో గతం గుర్తుకు వచ్చినప్పుడు ఆ బాధను చూపించే తీరు గానీ, హంతుకుడి వేటలో సవాళ్లు ఎదురైనప్పుడు అధిగమించడానికి పడే తపనలో గానీ త్రిష నటన సహజంగా ఉంది.


Also Read: బహిష్కరణ రివ్యూ: Zee5 OTTలో లేటెస్ట్ బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ - అంజలి వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?



సారథి పాత్రలో రవీంద్ర విజయ్ సైతం అంతే సహజంగా నటించారు. ఇంద్రజిత్ సుకుమారన్ నటనలో హుందాతనం ఉంది. ఆనంద్ సమీ సర్‌ప్రైజ్ ప్యాకేజ్. ఆ ఠాకూర్ పాత్రలో ఆయన నటన కొత్తగా ఉంది. రాకేందు మౌళి డిక్షన్, డైలాగ్ డెలివరీ, నటనకు వంక పెట్టలేం. జయప్రకాశ్, ఆమని, అనీష్ కురువిల్లా తదితరులు పాత్రలకు తగ్గట్టు చేశారు.


వీక్షకులను కట్టిపడేసే కథనం, కళ్లప్పగించి చూసేలా చేసే తారాగణం, కథతో ప్రయాణించేలా చేసే సంగీతం... మూడింటి సమ్మేళనం 'బృంద'. త్రిష నేచురల్ యాక్టింగ్, సూర్య మనోజ్ వంగాల డైరెక్షన్ & గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఒక్కసారి సిరీస్ స్టార్ట్ చేస్తే చివరి వరకు చూసేలా చేశాయి. ఇటీవల వచ్చిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్‌లో 'బృంద' ఒకటి. ఇందులో సస్పెన్స్, డ్రామా, థ్రిల్... అన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఎంగేజ్ చేసే క్రైమ్ థ్రిల్లర్ డ్రామా! డోంట్ మిస్ ఇట్!


Also Read: బ్లడీ ఇష్క్ రివ్యూ - Hotstarలో అవికా గోర్ హారర్ ఫిల్మ్ - ఈ ఎఫైర్స్ ఏంటి డాడీ బ్రో?