Niharika Konidela's Committee Kurrollu Movie Review In Telugu: మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన సినిమా 'కమిటీ కుర్రోళ్ళు'. దర్శకుడు యదు వంశీకి తొలి చిత్రమిది. ఇందులో 11 మంది హీరోలు, 4 హీరోయిన్లు. డైలాగ్ కింగ్ సాయి కుమార్, మోస్ట్ హ్యాపెనింగ్ ఆర్టిస్ట్ గోపరాజు రమణ, సీనియర్ నటి శ్రీ లక్ష్మి, 'కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ కిశోర్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటి వరకు నిహారిక వెబ్ సిరీస్‌లు నిర్మించారు. ఓటీటీల్లో విడుదల చేశారు. థియేట్రికల్ రిలీజ్, సినిమా ప్రొడ్యూస్ చేయడం ఆమెకు ఇదే తొలిసారి. నిహారిక సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించిన ఈ సినిమా (Committee Kurrollu Review Telugu) ఎలా ఉందంటే?


కథ (Committee Kurrollu Story): గోదావరి జిల్లాల్లోని ఓ గ్రామంలో పన్నెండేళ్లకు ఒకసారి జాతర వస్తుంది. ఈసారి జాతర జరిగిన పది రోజులకు ఎన్నికలు కూడా. ఆ ఎన్నికల్లో శివ (సందీప్ సరోజ్) సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి ముందుకు వస్తాడు. లాస్ట్ జాతరలో శివ స్నేహితుల్లో ఒకడు ప్రాణాలు కోల్పోతాడు. అందుకు కారణం స్నేహితుల మధ్య జరిగిన కులాల గొడవ. అందుకని, జాతర జరిగే వరకు ఎటువంటి ఎన్నికల ప్రచారం వద్దని ఊరి పెద్దలు పంచాయితీలో తీర్పు ఇస్తారు.


రిజర్వేషన్స్, కులాల గొడవ కారణంగా విడిపోయిన స్నేహితులు మళ్లీ కలిశారా? లేదా? పన్నెండేళ్ల క్రితం జరిగిన గొడవను ఎప్పటికప్పుడు రగిలిస్తూ తమ స్వార్థ ప్రయోజనాల కోసం పరితపించే ఊరి జనాలు ఎవరు? ఇందులో ప్రెసిడెంట్ పోలిశెట్టి బుజ్జి (సాయి కుమార్) పాత్ర ఏమిటి? జాతరలో బలిచాట ఎత్తడానికి ఎవరూ లేకపోతే శివ, అతని స్నేహితులు ఏం చేశారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.


విశ్లేషణ (Committee Kurrollu Review): 'కమిటీ కుర్రోళ్ళు'ను కథగానో, సినిమాగానో చూడటం కంటే ఓ ఊరిగా, ఊరిలో ప్రజలుగా చూడటం కరెక్ట్. పరిస్థితులకు తగ్గట్టు, పరిస్థితుల ప్రభావం వల్ల ప్రవర్తించే పాత్రలు, విచక్షణతో వ్యవహరించే మనుషులు ఈ సినిమాలో మనకు కనిపిస్తారు. ఫస్టాఫ్, ఆ పాత్రల పరిచయంతో ఓ పల్లెటూరికి - ఆ కాలం యువతను అయితే జ్ఞాపకాల్లోకి తీసుకు వెళ్లారు దర్శకుడు యదు వంశీ. మరి, కాన్‌ఫ్లిక్ట్ ఎలా ఉంది? అనేది చూస్తే... 


'కమిటీ కుర్రోళ్ళు'కు బలం కల్మషం లేని స్నేహం, ఆ క్యారెక్టర్లు. ఊహ తెలియని వయసులో, కులాల గురించి అవగాహన లేని మనసుల మధ్య స్నేహాన్ని యదు వంశీ చక్కగా ఆవిష్కరించారు. మొబైల్స్ లేని రోజుల్లో పిల్లల జీవితం ఎలా ఉండేదో చూపిస్తూ నోస్టాల్జియాలోకి తీసుకు వెళ్లారు. యదు వంశీ రచనకు తోడు అనుదీప్ దేవ్ సంగీతం (పాటలు) తోడు కావడంతో కథ గురించి ఆలోచించకుండా కామెడీని ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళతారు ప్రేక్షకులు. 'ముద్దు పెట్టాడు, నాకు కడుపు వస్తుంది' అని అమ్మాయి ఏడవడం, రికీ పాంటింగ్ బ్యాట్‌లో స్ప్రింగ్స్ పెట్టడం వల్ల 2003 వరల్డ్ కప్‌లో సిక్సులు కొట్టాడని డిస్కస్ చేయడం, అప్పట్లో అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ వీడియోలు ఎడిటింగ్, సీడీల్లో హాలీవుడ్ సీన్లు కోసం కుర్రాళ్లు వెళ్లి అడిగే సన్నివేశం... ప్రతిదీ నవ్విస్తుంది. 


నోస్టాల్జియా కామెడీ నుంచి కథను సీరియస్ ఇష్యూ వైపు తీసుకు వెళ్లిన తీరు సైతం బావుంది. 'కమిటీ కుర్రోళ్ళు'లో ఇంటర్వెల్ బ్యాంగ్ పదిహేను నిమిషాలు సినిమా అంతటికీ పీక్స్. అక్కడ ఉత్కంఠ, ఉద్విగ్నత కలుగుతాయి. అంతటి హై ఇచ్చిన తర్వాత ప్రేక్షకులు ఇంకా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అయితే... ఆ తర్వాత కథలో వేగం తగ్గింది. కులాల కుంపటి, రిజర్వేషన్స్ గురించి డిస్కస్ చేయడం కత్తి మీద సాము లాంటి వ్యవహారం. దాన్ని దర్శకుడు బాగా డీల్ చేశారు. కానీ, కులాల కుంపటి కారణంగా దూరమైన స్నేహితులు మళ్లీ కలిసేటప్పుడు వారి మధ్య ఆ డిస్కషన్ లేకుండా ముగించడం సినిమాటిక్ అనిపించింది. కథ కులాల వైపు నుంచి స్నేహితుడి మరణం వైపు టర్న్ తీసుకోవడం వల్ల ఎమోషనల్ మూమెంట్స్ చక్కగా కుదిరాయి. కానీ, ఏదో వెలితి కొట్టొచ్చినట్టు కనపడింది. 


సర్పంచ్ ఎన్నికల ఎపిసోడ్ నేపథ్యంలో వచ్చే కొన్ని డైలాగులు జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను గుర్తు చేస్తాయి. 'గెలవాలనే ఆశ... ఓడిపోతమనే భయం లేనోడు నిజమైన నాయకుడు' వంటివి గానీ, ఓటమి తర్వాత హీరో చెప్పే డైలాగులు గానీ జనసేన ప్రస్థానాన్ని గుర్తు చేసేవే.


సర్పంచ్ ఎన్నికలకు ముందు పల్లెటూళ్లలో జరిగే దృశ్యాలను వినోదాత్మకంగా చూపించారు. అయితే... అక్కడ పాట అనవసరం అనిపించింది. బాణీ బావున్నా మిస్ ఫిట్ ఫీలింగ్ కలిగింది. అనుదీప్ దేవ్ సంగీతం సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకు వెళ్ళింది. పాటలు బావున్నాయి. నేపథ్య సంగీతం అంతకు మించి ఉంది. జాతర ఎపిసోడ్ అంతా రీ రికార్డింగ్ హైలైట్ అవుతుంది. అలాగే, కెమెరా వర్క్ కూడా బావుంది. నిహారిక, పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక ఖర్చుకు రాజీ పడలేదని ప్రతి సన్నివేశంలో తెలుస్తుంది. సెకండాఫ్ రన్ టైమ్ పది పదిహేను నిమిషాలు తగ్గితే బావుంటుంది.


Also Read: బృంద రివ్యూ: Sonyliv OTTలో త్రిష వెబ్ సిరీస్ - సౌత్ క్వీన్ ఓటీటీ డెబ్యూ హిట్టా? ఫట్టా?



ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని కాదు... 11 మంది హీరోలు బాగా చేశారు. అయితే శివ పాత్రలో సందీప్ సరోజ్, సుబ్బుగా త్రినాథ్ వర్మ, విలియం పాత్రలో ఈశ్వర్ రచిరాజు, సూర్యగా యశ్వంత్ పెండ్యాల నటన ఎక్కువ రిజిస్టర్ అవుతుంది. ఆ నలుగురూ ఎమోషనల్ సన్నివేశంలో పరిణితి చూపించారు. నటీనటులు అందరూ టీనేజ్, ట్వంటీస్ మధ్య డిఫరెన్స్ చూపించారు. సాయి కుమార్, గోపరాజు రమణ నటనలో అనుభవం కనిపించింది. 'కేరాఫ్ కంచరపాలెం' కిశోర్, శ్రీలక్ష్మి రెండు మూడు సన్నివేశాల్లో కంటతడి పెట్టిస్తారు. ప్రసాద్ బెహరా తన యూట్యూబ్ ఇమేజ్‌కు భిన్నంగా సీరియస్ ఎమోషనల్ రోల్ చేశారు. తనలో కామెడీ మాత్రమే కాదని, నటుడు కూడా ఉన్నాడని చూపించాడు.


Committee Kurrollu Review In Telugu: పల్లెటూరికి వెళ్లి కొన్ని రోజులు ఉన్న అనుభూతి ఇచ్చే సినిమా 'కమిటీ కుర్రోళ్ళు'. ఆ వాతావరణం తెలియని సిటీ ప్రేక్షకులకు కొత్తగా ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగాల్లో పడిన జనాలకు అప్పటి రోజులు గుర్తు చేస్తుంది. ప్రేక్షకులంతా తప్పకుండా నోస్టాల్జియాలోకి వెళతారు. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్, హై ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత సెకండాఫ్ స్లో అయ్యింది. కానీ, అక్కడ కూడా పైసా వసూల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లస్ శాటిస్‌ఫ్యాక్టరీ ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. డోంట్ మిస్ ఇట్.


Also Readబహిష్కరణ రివ్యూ: Zee5 OTTలో లేటెస్ట్ బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ - అంజలి వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?