Mahakumbh at Prayagraj:  కుంభమేళా జరిగే ప్రయాగ్ రాజ్ చారిత్రకంగానూ చాలా ముఖ్యపాత్రనే పోషించింది. ఆరో శతాబ్దంలోనే హర్షవర్తన చక్రవర్తి ప్రయాగలో నదీ మేళా లు.. ఆధ్యాత్మిక చర్చలు..దానాలు చేసేవాడని చైనా యాత్రికుడు హుయత్ సాంగ్ పేర్కొన్నాడు. మొగల్ చక్రవర్తుల కాలం వచ్చే నాటికి ఈ ప్రాంతమంతా వారి పాలనలోకే వెళ్ళింది. ఇక్కడి ఆధిపత్యం కోసం  అక్బర్ చక్రవర్తి కట్టిన కోట  కుంభమేళాకు ప్రత్యేక ఆకర్షణగా  నిలుస్తోంది.


కోటను కట్టింది దీనికోసమే 


త్రివేణి సంగమంలో  అక్బర్ చక్రవర్తి 1583లో ఈ కోటను కట్టాడు. ఆయన తన జీవితంలో కట్టిన అతిపెద్ద కోట ఇదే. ఆయన ఆస్థాన కవి,మిత్రుడు అబుల్ ఫజల్ తాను రాసిన 'అక్బర్ నామా ' లో " ప్రయాగ లో ఒక పెద్ద నగరాన్ని కట్టాలన్నది అక్బర్ ఆశయం"గా పేర్కొన్నాడు. ముఖ్యంగా సామ్రాజ్యపు తూర్పు భాగంలో  చెలరేగుతున్న తిరుగుబాటులను అణచివేయడానికి ఇక్కడ ఒక కోటను నిర్మించడం ద్వారా నిఘా ఏర్పాటు చేయొచ్చని అక్బర్ భావించినట్టు  ఆయన పేర్కొన్నాడు.  పుణ్యస్నానాల కోసం వచ్చే హిందువులపై పన్నులు వసూలు చేయడానికి  ఇక్కడ కోటను కట్టాడంటూ కొన్ని కథలు ప్రచారంలో ఉన్నా అది నిజం కాదని చరిత్రకారులు అంటారు. ఎందుకంటే ఈ కోట కట్టడానికి చాలా కాలం ముందే అంటే 1563లోనే తీర్థయాత్రల టాకక్స్ లను అక్బర్ రద్దు చేశాడు.


Also Read: మౌని అమావాస్య, శివరాత్రికి భారీ రద్దీలో కుంభమేళాకి పరిగెత్తకండి.. ఇంట్లోనే ఇలా చేయండి చాలు!


ఆత్మహత్యల చెట్టు -నరబలి దానం


ఈ కోటలోని మరొక విశేషం ఈ కోటలోని రావి చెట్టు. దీనిని సంస్కృతం లో 'అక్షయ వట' వృక్షం గా పేర్కొంటారు. ఈ జన్మ నుంచి ముక్తి పొందడం కోసం చాలామంది హిందువులు, సన్యాసులు నదీ సంగమం లో స్నానం చేసి ఈ చెట్టుకు ఉరివేసుకునే వారట. ఆ అలవాటును మాన్పించడం కోసం అక్బర్ చక్రవర్తి ఆ చెట్టు  కోట లోపల భాగంలోకి  వచ్చేలాగా డిజైన్ చేయించి  కోటను కట్టాడని  ఫజల్ పేర్కొన్నాడు. ఈ కోటను కట్టిన తర్వాత  'illahbas'( అల్లా వల్ల దీవించబడింది ) అనే పేరు పెట్టాడు. అదే తర్వాత కాలంలో అలహాబాద్ గా మారింది. ప్రస్తుతం ఆ పేరును మార్చి  పూర్వపు నామమైన ' ప్రయాగ్ రాజ్ 'గా పిలుస్తున్నారు. 


మరొక గాధ ప్రకారం 


అక్బర్ చక్రవర్తి ఈ కోటను కట్టే ప్రయత్నం చేసినప్పుడు నేల కుంగిపోయి పునాది నిలబడేది కాదట. అప్పుడు పండితులు ఎవరైనా ప్రాణత్యాగం చేస్తేనే  ఇక్కడ కోట కట్టడం పూర్తవుతుందని చెప్పడం తో ఒక బ్రాహ్మణుడు అందుకు సిద్ధపడ్డాడనీ అయితే అందుకు బదులుగా తన వంశస్తులకే ప్రయాగ వచ్చే యాత్రికులతో పూజలు చేయించే అధికారం దక్కాలని కోరడంతో అక్బర్ దానికి ఒప్పుకున్నాడని  ప్రచారంలో ఉంది. ఇప్పటికీ త్రివేణి సంగమం లో పూజా సంస్కారాలు చేయించే బ్రాహ్మణులలో  " ప్రయాగవాలా లు " తామే ఆ వంశస్థులమని  చెప్పుకుంటారు. అయితే ఈ కథకు సంబంధించిన చారిత్రక ఆధారాలు లేవు.


కోట మధ్యలో అశోకుని స్థంభం -శాసనం 


అలహాబాద్ కోటలో  అశోకుని స్తంభం, ఆయన చెక్కించిన శిలాశాసనం ఉన్నాయి. అయితే ఇవి నిజానికి ఇక్కడ వేయించినావు కావు 'కౌశంబి ' నుండి అక్బర్ చక్రవర్తి వాటిని రప్పించి అలహాబాద్ కోటలో  తిరిగి ప్రతిష్టించాడు అని చెబుతారు. కొంతమంది మాత్రం ఈ పిల్లర్ అశోకుని కంటే చాలా ముందుదని చెబుతుంటారు. ప్రస్తుతం ఈ కోట మొత్తం ఆర్మీ కంట్రోల్లో ఉండడంతో  మరిన్ని పరిశోధనలకు అనుమతి దొరకడం కష్టం. 


Also Read: శివరాత్రులు ఎన్ని .. భోళా శంకరుడికి మహా శివరాత్రి ఎందుకు మరింత ప్రత్యేకం - శివయ్యకు ఏ అలంకారం ఇష్టం!


అక్బర్ పై తిరుగుబాటు చేసిన కొడుకు సలీం 


అక్బర్ చక్రవర్తి తో వచ్చిన మనస్పర్ధలు కారణంగా యువరాజు సలీం ఆయనపై తిరుగుబాటు చేశాడు. ఆ సమయంలో అలహాబాద్ కోటనే తన స్థావరంగా సలీం మలుచుకున్నాడు. కొంతకాలానికి తండ్రి చేతిలో ఓడిపోయినా అక్బర్ క్షమించి వదిలేసాడు. ఆ యువరాజు సలీమే  తరువాతికాలం లో 'జహంగీర్ ' పేరుతో మొగల్ చక్రవర్తి అయ్యాడు. మొగల్ చక్రవర్తులు బలహీన పడిన తర్వాత  1801 నాటికి ఈ కోట పూర్తిగా బ్రిటీష్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. దీనిని వారు తమ మిలిటరీ అవసరాల కోసం వాడేవారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ కోటను ఇండియన్ మిలటరీ  తన అవసరాల కోసం స్థావరంగా మార్చుకుంది. ఇప్పటికీ ప్రయాగ రాజ్ వెళ్లిన వాళ్లకి  త్రివేణి సంగమం సమీపంలో కనిపించే  అలహాబాద్ కోట ఎంతో హుందా గా కనిపిస్తూ ఉంటుంది. గంగా నదిలో పడవపై ప్రయాణిస్తూ దాని ఒడ్డునే కనిపించే అలహాబాద్ కోట గోడల పక్కనుంచి విహరించడం పర్యాటకులకు ఒక మరుపురాని అనుభూతి.


Also Read: ఫిబ్రవరి 26 or 27.. మహా శివరాత్రి ఎప్పుడు - మిగిలిన దేవుళ్ల కన్నా శివుడు ఎందుకు ప్రత్యేకం!