Maha Shivaratri 2025 Date and Time : భోళాశంకరుడంటే భక్తులకు ఎంతో ప్రీతి. ఆయన్ని ఎంత స్తుతించినా తనివి తీరదనే 15 రోజులకోసారి, నెల రోజులకు మాస శివరాత్రి , ఏడాదికి మహాశివరాత్రి అంటూ ఆరాధిస్తారు.
ఈ ఏడాది (2025) మహా శివరాత్రి ఫిబ్రవరి 26 బుధవారం వచ్చింది
వాస్తవానికి తెలుగువారి పండుగలన్నీ సూర్యోదయానికి ఉండే తిధిని పరిగణలోకి తీసుకుంటారు. కానీ కార్తీక పౌర్ణమి, దీపావళి అమావాస్య, శివరాత్రికి మాత్రం రాత్రికి తిథి ఉండడం ప్రధానం. ముఖ్యంగా శివరాత్రికి లింగోద్భవ సమయానికి చతుర్థశి తిథి ఉండాలి. అందుకే నిస్సందేహంగా మహాశివరాత్రి ఫిబ్రవరి 26నే జరుపుకోవాలి..ఈ విషయంలో ఎలాంటి గందరగోళం అవసరం లేదు
- ఫిబ్రవరి 26 బుధవారం ఉదయం 9 గంటల 48 నిముషాల వరకూ త్రయోదశి ఉంది...ఆ తర్వాత చతుర్థశి ఘడియలు ప్రారంభమయ్యాయి
- ఫిబ్రవరి 27 గురువారం ఉదయం 8 గంటల 43 నిముషాల వరకూ మాత్రమే చతుర్థశి తిథి ఉంది..
అంటే సూర్యోదయానికి తిథిని పరిగణలోకి తీసుకుంటే ఫిబ్రవరి 27 శివరాత్రి జరుపుకోవాలి..కానీ లింగోద్భవ సమయానికి చతుర్ధశి ఉండడం ముఖ్యం కాబట్టి ఫిబ్రవరి 26 బుధవారమే శివరాత్రి...
Also Read: జ్యోతిర్లింగాలను ఒకే ట్రిప్లో ఎలా కవర్ చేయొచ్చో తెలుసా? హైదరాబాద్ నుంచి ఇలా స్టార్ట్ అయిపోండి
శివ పూజ ఐశ్వర్యం, ఆనందం కోసం కాదు...
హిందువులకు శివారాధన మీదున్న మక్కువ ఏటికేడు పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. భోళా శంకరుడు ఐశ్వర్యాన్నిస్తాడు, ఆనందాన్నిస్తాడు, బాధలన్నీ తీర్చేస్తాడని కాదు...సృష్టి తత్వాన్ని బోధిస్తాడని, సంసార బంధాల నుంచి విముక్తి కల్పిస్తాడని ..తనలో ఐక్యం చేసుకుంటాడని భక్తుల విశ్వాసం.
మిగిలిన పండుగల కన్నా భిన్నం
ఏ పండుగ అయినా స్నానం, పూజ, కొత్తబట్టలు, పిండివంటలు, ఇల్లంతా సందడి ఉంటుంది. కానీ శివరాత్రి పండుగ అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. రోజంతా ఉపవాసం, రాత్రంతా జాగరణ, సంసార సుఖాలకు దూరంగా ఉంటు అనుక్షణం శివయ్య ధ్యానంలోనే రోజు గడుస్తుంది.
ఆ సమయం అత్యద్భుతం
శంకరుడు లింగరూపంలో దర్శనం ఇచ్చిన సందర్భమే మహా శివరాత్రి. దీని వెనుకున్న పురాణ గాధ అందరికీ తెలిసినదే. బ్రహ్మ, శ్రీ మహావిష్ణువు మధ్య తమలో ఎవరు గొప్ప అని వాదించుకోవడం మొదలుపెట్టారు. ఈ సమస్యని తీర్చాలంటూ శివుడిని ఆశ్రయించారు. అప్పుడు లింగ రూపంలో దర్శనమిచ్చిన శివుడు ఆది-అంతం కనుక్కోమని ఇద్దర్నీ పంపించాడు. విష్ణువు శివలింగం ఆది తెలుసుకునేందుకు వెళితే.. బ్రహ్మ అంతం తెలుసుకునేందుకు వెళ్లాడు. ఎంత కిందకు వెళ్లినా ఆది తెలియకపోవడం విష్ణువు తిరిగొచ్చేసి నిజం చెప్పాడు. కానీ బ్రహ్మ మాత్రం అంతం కనుక్కోలేక...ఓటమిని అంగీకరించలేక..చూశానంటూ సాక్ష్యం చెప్పమని మార్గమధ్యలో కనిపించిన మొగలిపువ్వు, గోవును సాక్ష్యం చెప్పమన్నాడు. ఆ విషయం తెలుసుకున్న శివుడు..బ్రహ్మకు ఆలయాలు ఉండవని, మొగలిపూవు పూజకు పనికిరాదని, గోవు ముఖం చూస్తే పాపం అని శపించాడు. అందుకే బ్రహ్మదేవుడికి ఆలయాలు లేవు, మొగలి పూవు పూజకు వినియోగించరు..గోవు ముఖం భాగాన్ని కాకుండా తోక భాగాన్ని పూజిస్తారు. ఈ సమయంలోనే...ప్రాణకోటిని సృష్టించి రక్షించే బాధ్యత బ్రహ్మకు.. మోక్షాన్నిచ్చే బాధ్యత విష్ణువుకు అప్పగించాడు శివుడు... ఈ విషయాలన్నీ కూర్మ, వాయు, శివ పురాణాల్లో ఉన్నాయి.
Also Read: కుంభమేళాలో స్నానఘాట్ కి వెళ్లొచ్చేందుకు ఎంత సమయం పడుతోందో తెలుసా.. మొదటి 4 రోజుల్లో ఎన్ని విశేషాలో!
సాధారణంగా ఏకాదశి వ్రతం ఆచరించేవారు దశమి నుంచి నియమాలు పాటించినట్టే..మహాశివరాత్రి పాటించేవారు త్రయోదశి నుంచి నియమాలు పాటించాలి. త్రయోదశి రోజు ఓ పూట భోజనం చేసి నేలపై నిద్రించాలి. చతుర్ధశి రోజు శివాలయాన్ని దర్శించుకుని ఉపవాసం, జాగరణ చేయాలి.