Mahakumbh 2025 : ప్రయాగ్‌రాజ్ మహాకుంభాన్ని సందర్శించే ప్రతి భక్తులు స్నాన ఘాట్‌లో సగటున 45 నిమిషాలు గడిపారు. రేడియో ఫ్రీక్వెన్సీ రిస్ట్ బ్యాండ్‌ల ద్వారా సేకరించిన డేటా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అంతే కాకుండా జాతరకు వచ్చే భక్తుల సంఖ్యను లెక్కించేందుకు ఆర్‌ఎఫ్ రిస్ట్ బ్యాండ్ నుంచి  వివరాలు సేకరిస్తున్నారు. 


ఈసారి మహా కుంభమేళాకు ఎంత మంది వస్తారో తెలుసుకునేందుకు మూడు పద్ధతులను ఉపయోగిస్తున్నారు. వీటిలో ఒకటి RF రిస్ట్‌బ్యాండ్ డేటా విశ్లేషణ. ఇందులో భక్తులకు మణికట్టుకు కట్టుకునేందుకు రిస్ట్ బ్యాండ్ అందజేశారు. 


మకర సంక్రాంతి, పుష్య మాస పూర్ణిమ సందర్భంగా జాతరకు వచ్చిన భక్తులు ఒక్కొక్కరు సగటున 45 నిమిషాలపాటు స్నాన ఘాట్‌లో గడిపినట్లు ఆర్‌ఎఫ్ ఐడీ చిప్‌లతో కూడిన రిస్ట్‌బ్యాండ్‌ల నుంచి సేకరించిన సమాచారం వెల్లడించింది. స్నానానికి ఘాట్ కి వచ్చనప్పటి నుంచి తిరిగి వెళ్లేవరకూ 45 నిముషాల సమయం పడుతోంది.


Also Read: ప్రయాగ్‌రాజ్‌లో విదేశీ భక్తుల సందడి- కుంభమేళా చాలా పవర్ ఫుల్, మేరా భారత్ మహాన్ అని కామెంట్స్
 
ఘాట్‌లో భక్తులు సగటున గడిపే సమయాన్ని కనుక్కోవడం రద్దీ నిర్వహణకు సహాయపడుతుందని పోలీసు అధికారులు అంటున్నారు. దీని ఆధారంగా జాతరలో భక్తుల ప్రవేశ, నిష్క్రమణలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవచ్చు. సాధారణ ట్రాఫిక్ ప్లాన్ ద్వారా ట్రాఫిక్ ఎప్పుడు నిర్వహించాలో మరియు అత్యవసర ట్రాఫిక్ ప్రణాళికను ఎప్పుడు అమలు చేయాలనేది నిర్ణయించవచ్చు. ఆర్‌ఎఫ్ రిస్ట్‌బ్యాండ్ డేటా అనాలిసిస్ టెక్నాలజీ ద్వారా లభించే ఫలితాలు క్రౌడ్ మేనేజ్‌మెంట్‌లో సహాయపడతాయని ఎస్‌ఎస్‌పి రాజేష్ కుమార్ ద్వివేది తెలిపారు.


మకర సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగిన తోపులాటలో 200 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. వీరిని సెక్టార్ 2 లో ఉన్న హాస్పిటల్ కి తరలించారు. వీరిలో ఆరుగురి చేతి మణికట్టుకి గాయమైంది. ఏడుగురికి కాలువిరిగింది...మిగిలినవారికి చిన్న చిన్న గాయాలయ్యాయని హాస్పిటల్ ఆర్థోపెడిక్ విభాగం సర్జన్ డాక్టర్ వినయ్ యాదవ్ తెలిపారు. 


Also Read: మహా కుంభ మేళా 2025 తేదీలివే.. కుంభ మేళా అర్థం, చరిత్ర, ప్రాముఖ్యత వంటి ఇంట్రెస్టింగ్ విషయాలివే
 
కుంభమేళా మొదటి నాలుగు రోజుల్లో షటిల్ బస్సుల్లో ఐదు లక్షల మంది ఉచితంగా ప్రయాణించారు. ఆదివారం ప్రారంభమైన ఈ సేవ బుధవారం అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగింది. ఈ కాలంలో గరిష్టంగా 2.50 లక్షల మంది ప్రయాణించారు. మౌని అమావాస్యకు ఒకరోజు ముందు ప్రయాణికులకు షటిల్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కానుకగా లభిస్తుందని తెలిపారు యూపీ రోడ్‌వేస్ రీజినల్ మేనేజర్ ఎంకే త్రివేది. గురువారం నుంచి ఈ బస్సుల్లో ప్రయాణికులు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం 200 E బస్సులు వాటి షెడ్యూల్ చేసిన రూట్లలో నడుస్తాయి.


1932 తర్వాత మొదటిసారిగా ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమానం బయలుదేరింది. 1932లో ప్రయాగ్‌రాజ్ నుంచి లండన్‌కు ఒక విమానాన్ని నడిపారు. 93 ఏళ్ల తర్వాత బుధవారం ప్రయాగ్‌రాజ్‌ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమానం బయలుదేరింది. అమెరికాకు చెందిన బిలియనీర్ మహిళా పారిశ్రామికవేత్త లారెన్ పావెల్ జాబ్స్ కోసం ఈ విమానం ఇక్కడికి వచ్చింది. ఈ విమానం భూటాన్‌కు వెళ్లింది. ఈసారి మహాకుంభ్ సందర్భంగా NRIలు , విదేశీ పౌరులు నేరుగా విమానంలో ప్రయాగ్‌రాజ్‌కు రావచ్చు. ఈ కారణంగానే తొలిసారిగా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్ మెంట్ ఉద్యోగులను కూడా విమానాశ్రయంలో మోహరించారు.


బుధవారం ఉదయం రాయల్ భూటాన్ ఎయిర్ లైన్స్ విమానం ల్యాండ్ కాగా.. దాన్ని చూసి ఉద్యోగులంతా ఆశ్చర్యపోయారు. ఈ విమానం రాక గురించి కొందరికి మాత్రమే తెలియడంతో దాన్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. 1932 ముందు బ్రిటీష్ పాలనలో, ప్రయాగ్‌రాజ్ నుంచి అంతర్జాతీయ విమానాలు నడిచేవి. 1932 వరకు ఇక్కడి నుంచి లండన్‌కు నేరుగా విమానం ఉండేది. 93 సంవత్సరాల విరామం తర్వాత, జనవరి 15, బుధవారం ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమానాలు నడిచాయి.