నాగార్జున సాగర్ వద్ద హై టెన్షన్
నాగార్జున సాగర్ డ్యాం (Nagarjuna Sagar Dam) వద్ద రెండో రోజు కూడా ఉద్రిక్తతలు కొనసాగాయి. డ్యాం వద్ద ఇప్పటికే ఇరు రాష్ట్రాల పోలీసులు భారీగా మోహరించారు. మొత్తం 26 గేట్లలో 13వ నెంబర్ వద్ద ఏపీ పోలీసులు (AP Police) కంచె ఏర్పాటు చేశారు. కృష్ణా రివర్ బోర్డు (Krishna River Board) నిబంధనల ప్రకారం 13వ నెంబర్ గేటు వరకూ తమ పరిధిలో ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. అందుకే కంచె ఏర్పాటు చేసినట్లు చెబుతుండగా, దీన్ని తొలగించేందుకు శుక్రవారం ఉదయం తెలంగాణ పోలీసులు యత్నించగా వీరిని ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే సాగర్ కుడి కాలువ ద్వారా ఏపీకి నీటి విడుదల కొనసాగుతోంది. దీన్ని అడ్డుకునేందుకు తెలంగాణ అధికారులు యత్నిస్తుండగా, నాగార్జున సాగర్ కంట్రోల్ రూంను ఐజీ స్థాయి పోలీస్ ఉన్నతాధికారులు తమ స్వాధీనంలోకి తీసుకుని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం డ్యాం వద్ద ఏపీ పోలీసులు 1500 మంది, తెలంగాణ పోలీసులు 1000 మంది ఉన్నట్లు సమాచారం. ఇంకా చదవండి
ఏపీ చర్యలు సరైనవేనన్న మంత్రి అంబటి
నాగార్జున సాగర్ (Nagarjuna Sagar Dam Water Dispute) నీటి వివాదంపై మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) స్పందించారు. ఈ విషయంలో ప్రభుత్వ చర్య సరైనదేనని, తమ ప్రభుత్వం ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. ఏపీ పోలీసులు (AP Police) చేసింది దండయాత్ర అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దేందుకు యత్నిస్తే అది దండయాత్ర ఎలా అవుతుందని ప్రశ్నించారు. తమకు రావాల్సిన నీటిని రైతుల పంటల కోసం విడుదల చేస్తే తప్పేంటని నిలదీశారు. 'తెలంగాణలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉంటాయి. తెలంగాణలో మా పార్టీ లేదు. మేము పోటీ చేయడం లేదు. అలాంటప్పుడు ఎవరినీ ఓడించాల్సిన అవసరం మాకు లేదు. మా వాటాకు మించి మేము ఒక్క నీటి బొట్టునూ వాడుకోం.' అని అంబటి స్పష్టం చేశారు. ఇంకా చదవండి
ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం
తెలంగాణలో (Telangana Elections 2023) పోలింగ్ ప్రక్రియ పూర్తైంది. ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంల్లో (EVM) నిక్షిప్తం చేశారు. డిసెంబర్ 3న (ఆదివారం) ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ (Counting Process) ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ (Postal Ballot Counting) తర్వాత ఈవీఎంల కౌంటింగ్ చేపట్టనున్నారు. ఈ క్రమంలో కౌంటింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లోని పలు విద్యా సంస్థలు, కార్యాలయాల్లో లెక్కింపు కేంద్రాలు సిద్ధం చేస్తున్నారు. స్ట్రాంగ్ రూంల వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. ఇంకా చదవండి
బానిసత్వం, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు - అమెరికాలో వైసీపీ నేత సత్తారు వెంకటేష్ రెడ్డి అరెస్ట్ !
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్‌సీపీ నేతగా చెలామణి అవుతున్న సత్తారు వెంకటేష్ రెడ్డి అనే వ్యక్తిని అమెరికాలో సెయింట్ లూయిస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ చేయడం సహా అనేక నేరాల కింద కేసు నమోదు చేశారు. ఇరవై ఏళ్ల యువకుడ్ని చదువు పేరుతో అమెరికాకు తీసుకు వచ్చి ఇంట్లో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాడు. చెప్పిన మాట వినకపోతే ఇష్టం వచ్చినట్లుగా దాడి చేస్తున్నాడు. పీవీసీ పైపులతో కొడుతున్నారు. రోజుకు కనీసం మూడు గంటలుకూడా నిద్రపోనీయకుండా పని చేయించుకుంటూ… పదే పదే హింహిస్తూండటంతో ఆ ఇరవై ఏళ్ల యువకుడు పూర్తిగా బలహీనపడ్డాడు. ఇతని పరిస్థితి చూసిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సత్తారు వెంకటేష్ రెడ్డితో పాటు మరో ఇద్దర్ని అరెస్టు చేశారు. బాధితుడ్ని ఆస్పత్రికి తరలించారు. ఇంకా చదవండి
చాలా కాలం తర్వాత ప్రశాంతంగా నిద్రపోయా - మంత్రి కేటీఆర్ ట్వీట్
చాలా రోజుల తర్వాత తాను ప్రశాంతంగా, కంటి నిండా నిద్రపోయినట్లు మంత్రి కేటీఆర్ (KTR) తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయన్న ఎగ్జిట్ పోల్స్ (Exit Polls 2023) అంచనాపైనా ఆయన స్పందించారు. 'ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో అతిశయోక్తులు ఉన్నాయి. డిసెంబర్ 3న విడుదలయ్యే అసలైన ఫలితాలు మాకు శుభవార్త చెబుతాయి.' అని స్పష్టం చేశారు. కాగా, తెలంగాణ ఎన్నికల ముగిసిన నేపథ్యంలో పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెల్లడించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ సీట్లు వస్తాయని సదరు సంస్థలు అంచనా వేశాయి. ఇంకా చదవండి