Minister Ambati Rambabu Comments on Sagar Water Dispute: నాగార్జున సాగర్ (Nagarjuna Sagar Dam Water Dispute) నీటి వివాదంపై మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) స్పందించారు. ఈ విషయంలో ప్రభుత్వ చర్య సరైనదేనని, తమ ప్రభుత్వం ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. ఏపీ పోలీసులు (AP Police) చేసింది దండయాత్ర అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దేందుకు యత్నిస్తే అది దండయాత్ర ఎలా అవుతుందని ప్రశ్నించారు. తమకు రావాల్సిన నీటిని రైతుల పంటల కోసం విడుదల చేస్తే తప్పేంటని నిలదీశారు. 'తెలంగాణలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉంటాయి. తెలంగాణలో మా పార్టీ లేదు. మేము పోటీ చేయడం లేదు. అలాంటప్పుడు ఎవరినీ ఓడించాల్సిన అవసరం మాకు లేదు. మా వాటాకు మించి మేము ఒక్క నీటి బొట్టునూ వాడుకోం.' అని అంబటి స్పష్టం చేశారు.


'హక్కుల్ని కాపాడేందుకే'


నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 13వ నెంబర్ గేట్ వరకూ భౌగోళికంగా ఏపీకే చెందుతాయని, వాటినే తాము స్వాధీనం చేసుకున్నట్లు మంత్రి అంబటి ప్రకటించారు. సమయానుగుణంగా వ్యూహాత్మక నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని, ఏపీ ప్రభుత్వ హక్కుల్ని కాపాడుకునేందుకే తమ నీటిని తాము వదులుకున్నట్లు చెప్పారు. అయితే, తాము దండయాత్ర చేశామంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2015 ఫిబ్రవరి 12న 7 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు యత్నిస్తే తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుందని, ఆ రోజు చంద్రబాబు అసమర్థత వల్లే సాగర్ భూ భాగాన్ని వదులుకున్నారని ఆరోపించారు. విభజన చట్టంలో కృష్ణా నదిని కూడా విభజించారని, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాయని, విడిపోయిన తర్వాత కూడా ఉమ్మడిగానే ఉన్నందున కెఆర్‌ఎంబిని ఏర్పాటు చేశారన్నారు. కెఆర్‌ఎంబి తాము నిర్వహిస్తామని కేంద్రం చెప్పినా తెలంగాణ అంగీకరించలేదని అంబటి  వివరించారు.


ఆంధ్రా ప్రయోజనాలకు విఘాతం


సాగర్ జలాల విషయంలో ఏపీ హక్కులకు భంగం కలిగేలా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు మొత్తాన్ని స్వాధీనం చేసుకుని నిర్వహించడం వల్ల ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టు 26 గేట్లలో 13 గేట్ల బాధ్యత ఏపీకి ఉందని వివరించారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వ అసమర్థత వల్లే రైట్ కెనాల్ నిర్వహణ తెలంగాణ చేతుల్లోకి వెళ్లిందని విమర్శించారు. తెలంగాణ చెక్ పోస్టులు ఆంధ్రాలో ఎందుకున్నాయని ప్రశ్నించారు. చట్టంలో సమాన హక్కులు వచ్చిన ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వ పెత్తనం ఏంటని నిలదీశారు. సాగర్ విషయంలో ఏపీ పోలీసుల తీరును మంత్రి సమర్థించారు. వారు తమ భూభాగంలో ఉన్నారే తప్ప, తెలంగాణలోకి వెళ్లి స్వాధీనం చేసుకోలేదని స్పష్టం చేశారు. ఆంధ్రా భూభాగంలో ఆంధ్రా పోలీసులు వెళ్లడం తప్పెలా అవుతుందని, ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసులు చెల్లవన్నారు. 'మేము వారితో ఘర్షణ పడలేదు. మా హక్కు సాధించుకున్నాం. ఈ విషయాన్ని తెలుగు ప్రజలందరూ గమనించాలి.' అని అంబటి పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో ఏపీకి 66 శాతం ఏపీకి, తెలంగాణకు 34 శాతం దక్కుతాయని, ఆంధ్రా వాటాకు మించి ఒక్క బొట్టునూ వాడుకోమని తేల్చిచెప్పారు.


'ఎవరి అనుమతి అవసరం లేదు'


తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో ఎడమగట్టున ఉన్న విద్యుత్ కేంద్రాలను పూర్తి స్వేచ్ఛగా వాడుకుంటోందని అంబటి అన్నారు. తమ భూభాగంలో తమ కాల్వల గేట్లను తెరిపించుకోడానికి ఎవరి అనుమతి అవసరం లేదని స్పష్టం చేశారు. కృష్ణా బోర్డు సభ్యులకు కూడా తమ వాదనలు వినిపిస్తామని, ఇంతటి వివాదం జరగడానికి చంద్రబాబే కారణమని మండిపడ్డారు. 


Also Read: Tension at Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ వద్ద హై టెన్షన్ - డ్యామ్ పరిశీలించిన కృష్ణా రివర్ బోర్డు సభ్యులు, ఏపీ పోలీసులపై కేసు నమోదు