Bengaluru schools Gets Bomb Threat: 



బెంగళూరులో కలకలం..


బెంగళూరులో ఒకేసారి 15 స్కూళ్లకు బాంబు బెదిరింపులు (Bengaluru Schools Bomb Threat) రావడం కలకలం సృష్టించింది. అన్ని స్కూల్స్‌కీ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈమెయిల్స్ వచ్చాయి. ఫలితంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ముందుగా ఏడు స్కూల్స్‌కి బెదిరింపులు వచ్చాయి. బసవేశ్వర్‌నగర్‌లోని రెండు పాఠశాలల యాజమాన్యాలు ఈ బెదిరింపులతో వణికిపోయాయి. కర్ణాటక డిప్యుటీ సీఎం డీకే శివకుమార్ ఇంటి ముందే ఉన్న స్కూల్‌కీ ఇవే బెదిరింపులు రావడం మరింత ఆందోళన కలిగించింది. అప్పటికే పోలీసులు అప్రమత్తమయ్యారు. విచారణ చేపడుతుండగానే మరో 7 స్కూల్స్‌కి ఇవే మెయిల్స్ పంపారు. బాంబు పెట్టామని బెదిరించారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. విద్యార్థులు, స్టాఫ్‌ని బయటకు పంపించేశారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్‌ అన్ని స్కూల్స్‌కీ వెళ్లాయి. అన్ని పాఠశాలల ప్రాంగణాల్లో తనిఖీలు చేపడుతున్నారు. అయితే...ఎక్కడా బాంబు పెట్టిన దాఖలాలు కనిపించలేదు. ప్రస్తుతానికి అలాంటి సమాచారమేమీ లేదు. గతేడాది కూడా బెంగళూరులో కొన్ని స్కూల్స్‌కి ఇలాంటి బెదిరింపు మెయిల్సే వచ్చాయి. ఆ తరవాత అదంతా కేవలం బెదిరించడం కోసం చేసిందేనని తేలింది. 


"ఇవాళ అన్ని స్కూల్స్‌లోనూ ఆందోళనకర వాతావరణం కనిపిస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు బాంబు పెట్టామని బెదిరిస్తూ మెయిల్స్ వచ్చాయి. విద్యార్థుల భద్రతే మాకు ముఖ్యం. అందుకే వెంటనే అందరినీ బయటకు పంపేశాం"


- స్కూల్ యాజమాన్యం