LPG cylinder price hike today: మన దేశంలో, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ‍‌(Assembly Elections of 5 States) అలా ముగిశాయో లేదో, గ్యాస్‌ రేట్లు ఇలా పెరిగాయి. దేశంలోని 5 రాష్ట్రాల్లో నిన్నటితో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి, ఈ రోజు (శుక్రవారం, డిసెంబర్‌ 1, 2023) నుంచి LPG సిలిండర్‌ ధరలను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు (OMCs) పెంచాయి. ఈ పెంపు నేటి నుంచి అమల్లోకి వచ్చింది.


పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్‌ ధర
19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్‌ ధర (Commercial LPG Cylinder Price Today) సిలిండర్‌కు రూ. 21 చొప్పున పెరిగింది. ఈ రోజు నుంచి, దేశ రాజధాని దిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ కోసం రూ. 1796.50 చెల్లించాల్సి ఉంటుంది. గత నెలలో ఈ ధర సిలిండర్‌కు రూ. 1775.50గా ఉంది. కొత్త రేటు... కోల్‌కతాలో రూ, 1908.00, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ. 1749.00, దక్షిణాదిలో ప్రముఖ నగరం చెన్నైలో రూ. 1968.50 గా మారింది.    


కమర్షియల్‌ ఎల్‌పీజీ రేటు పెరిగితే ఆతిథ్యం, ఆహార రంగాలపై ఆ ప్రభావం కనిపిస్తుంది. రోడ్‌ సైడ్‌ టిఫిన్‌ బండ్ల దగ్గర నుంచి ఫైవ్‌ స్టార్‌ హోటళ్ల వరకు నిర్వహణ వ్యయం పెరుగుతుంది. వాళ్లు కూడా ఆహార పదార్థాల రేట్లను పెంచి, ఫైనల్‌గా ఆ భారాన్ని తిరిగి ప్రజలపైకే నెడతారు. విహార యాత్రల బడ్జెట్‌ కూడా పెరుగుతుంది.       


గత నెలలోనూ పెరిగిన కమర్షియల్‌ సిలిండర్‌ రేటు 
తాజా రివిజన్‌కు ముందు, నవంబర్ 16న (5 రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్లు స్టార్ట్‌ కావడానికి ముందు), వాణిజ్య LPG సిలిండర్‌ రేటును రూ.57.05 చొప్పున OMCలు తగ్గించాయి. అంతకుముందు, నవంబర్ 1వ తేదీన, 19 కిలోల సిలిండర్ రేటును రూ.100కు పైగా పెంచాయి. ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీన కూడా కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.101.50 పెరిగింది, దిల్లీలో రేటు రూ.1731.50 నుంచి రూ.1833 కి చేరింది.     


మరో ఆసక్తికర కథనం: ప్రస్తుతం సిమెంట్ రేట్ల పరిస్థితేంటి? - ఇల్లు ఇప్పుడే కట్టాలా, కొంతకాలం ఆగాలా?


సామాన్యుడికి కూడా ఊరట లేదు
ఇళ్లలో వాడే దేశీయ ఎల్‌పీజీ సిలిండర్‌ ధర (Domestic LPG Cylinder Price Today) మారలేదు. రేట్లు తగ్గుతాయేమోనని ఎదురు చూసిన సాధారణ ప్రజలకు ఊరట దక్కలేదు. 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర దిల్లీలో రూ.903, కోల్‌కతాలో రూ.929, ముంబైలో రూ.902.50, చెన్నైలో రూ.918.50, హైదరాబాద్‌లో రూ.955, విజయవాడలో రూ.944.50 గా ఉంది. రవాణా ఛార్జీలను బట్టి ఈ రేటులో చిన్నపాటి మార్పులు ఉండొచ్చు.     


LPG సిలిండర్ కొత్త రేట్లను ఎలా తెలుసుకోవాలి?
LPG సిలిండర్ రేటును ఆన్‌లైన్‌లో చెక్‌ చేయాలనుకుంటే, ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్‌సైట్ https://iocl.com/prices-of-petroleum-products లో చూడవచ్చు. ఈ సైట్‌లో LPG ధరలతో పాటు జెట్ ఫ్యూయల్‌, ఆటో గ్యాస్, కిరోసిన్ వంటి ఇంధనాల కొత్త రేట్లు కనిపిస్తాయి.      


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి