KTR Tweet on Elections Exit Polls 2023: చాలా రోజుల తర్వాత తాను ప్రశాంతంగా, కంటి నిండా నిద్రపోయినట్లు మంత్రి కేటీఆర్ (KTR) తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయన్న ఎగ్జిట్ పోల్స్ (Exit Polls 2023) అంచనాపైనా ఆయన స్పందించారు. 'ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో అతిశయోక్తులు ఉన్నాయి. డిసెంబర్ 3న విడుదలయ్యే అసలైన ఫలితాలు మాకు శుభవార్త చెబుతాయి.' అని స్పష్టం చేశారు. కాగా, తెలంగాణ ఎన్నికల ముగిసిన నేపథ్యంలో పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెల్లడించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే మెజార్టీ సీట్లు వస్తాయని సదరు సంస్థలు అంచనా వేశాయి. 






'హ్యాట్రిక్ కొడతాం'


గతంలోనూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చాలా వరకూ తమకు వ్యతిరేకంగా వచ్చాయని, అయినా తాము విజయం సాధించామని కేటీఆర్ అన్నారు. డిసెంబర్ 3న 70కు పైగా సీట్లతో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ సీఎంగా కేసీఆర్ మూడోసారి బాధ్యతలు చేపడతారని స్పష్టం చేశారు. 'కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంటూ దుష్ప్రచారం చేస్తున్నాయి. 2018లో ఒక్క ఏజెన్సీ మాత్రమే సరైన ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది. 3 నెలలుగా పార్టీ కోసం కృషి చేసిన వారికి కృతజ్ఞతలు. కార్యకర్తలందరూ అధైర్యపడొద్దు.' అంటూ పోలింగ్ ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ పై స్పందిస్తూ మీడియా సమావేశంలో మాట్లాడారు.


 






ఎగ్జిట్ పోల్స్ తప్పైతే క్షమాపణ చెబుతారా.?


ఈ రకమైన ఎగ్జిట్‌ పోల్స్‌ను గతంలోనూ చూశామని, ఎగ్జిట్‌పోల్స్‌ తప్పని నిరూపించడం తమకు కొత్తేమీ కాదని కేటీఆర్‌ తెలిపారు. ఈ ఎన్నికల్లో తమకు 88 సీట్లు వస్తాయని భావించామని అయితే కొన్ని చోట్ల చిన్న చిన్న ఆటంకాల వల్ల సీట్లు తగ్గుతాయని భావిస్తున్నట్లు చెప్పారు. అలా ఎందుకు తగ్గుతాయనేదే డిసెంబర్ 3న చెప్తామని స్పష్టం చేశారు. 'కొన్ని మీడియా సంస్థలు సర్వేలు చేయకుండా, ఏదో 200 మందిని అడిగినట్లు దాన్నేదో రాకెట్ సైన్స్ మాదరిగా గొప్పగా చేసి చూపిస్తారు. గతంలోనూ ఇవే మీడియా సంస్థలు సర్వేలు చేస్తే అందులో ఒకటే నిజమైంది. ఈ పోల్స్ చేసిన సంస్థలకు ఒకటే చెబుతున్నా. డిసెంబర్ 3న ఫలితాలు చూడండి. మీ అంచనాలు తప్పైతే ఆ రోజు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెబుతారా.?' అంటూ కేటీఆర్ నిలదీశారు. ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పేటప్పుడు సంచలనాలే కాదని, సంస్థల క్రెడిబిలిటీ గురించి కూడా ఆలోచించాలని హితవు పలికారు. 


Also Read: Counting Centers in Telangana: ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం - ఓట్ల లెక్కింపునకు జిల్లాల వారీగా కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్ రూంల వద్ద భారీ భద్రత