Breaking News Live: ఈ నెల 12న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 7న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 07 Oct 2021 06:06 PM
ఈ నెల 12న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం 

ఈ నెల 12న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం కానుంది. కృష్ణా నదిపై కేంద్ర జల్‌శక్తిశాఖ గెజిట్ అమలుపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. కేంద్ర జలశక్తిశాఖ జులై 15న జారీ చేసిన నోటిఫికేషన్ ఈ నెల 14 నుంచి అమల్లోకి రావల్సి ఉంది. ఈలోగా అందుకు సంబంధించి మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలి. అయితే రెండు రాష్ట్రాల నుంచి పూర్తి సమాచారం ఇంకా బోర్డులకు అందలేదు. నిర్వహణ కోసం కావాల్సిన సమాచారం కూడా ఇవ్వలేదు. నోటిఫికేషన్​లోని కొన్ని ప్రాజెక్టులను రెండో షెడ్యూల్ నుంచి తొలగించాలని రెండు రాష్ట్రాలు కోరుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అమలు కార్యాచరణ దిశగా ఇప్పటి వరకు జరిగిన కసరత్తు, రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన సమాచారం సహా అన్ని అంశాలపై కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులతో కేంద్ర జలశక్తి శాఖ గురువారం సమీక్షించింది.

నిజామాబాద్ జిల్లాలో దారుణం.. చాక్లెట్ల ఆశ చూపి ఇద్దరు బాలికలపై అత్యాచారం

నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఇద్దరు బాలికలకు ఓ వ్యక్తి చాక్లెట్ల ఆశ చూపి అత్యాచారం చేశాడు. ఐదు రోజుల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

శ్రీకృష్ణ జ్యువెలరీ షోరూంలు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు

హైదరాబాద్‌లోని శ్రీకృష్ణ జ్యువెలరీ షోరూంలలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేస్తుంది. శ్రీకృష్ణ జ్యువెలరీ షాపులు, కార్యాలయాల్లో ఒకేసారి ఈడీ అధికారులు ఈ దాడులు చేస్తున్నారు. సుమారు రూ.330 కోట్ల విలువైన 1,100 కేజీల బంగారు ఆభరణాలను మళ్లించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలపై గతంలో డీఆర్ఐ ఓ కేసు నమోదు చేసింది. 2019 లో ఈ కేసులో ఎండీ ప్రదీప్ కుమార్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఆ కేసు ఆధారంగానే మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ అధికారులు వివరాలు సేకరించారు. ప్రస్తుతం నగరంలోని బంజారాహిల్స్‌ రోడ్ నెంబరు 1లో ఉన్న హెడ్ ఆఫీసు సహా ఇతర బ్రాంచీలు, జ్యువెలరీ షాపులు ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు ఆరో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. ఉద‌యం 10 గంట‌ల‌కు శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఇవాళ ప్రశ్నోత్తరాల్లో భాగంగా చేప‌ల పెంప‌కానికి ప్రోత్సాహం, కొత్త ఆహార‌ భ‌ద్రత కార్డుల జారీ, అర్బన్ మిష‌న్ భ‌గీర‌థ‌, క‌ల్యాణ‌ల‌క్ష్మి - షాదీముబార‌క్‌, ఆర్టీసీ కార్గో సేవ‌లు, ఇండ్ల స్థలాల క్రమ‌బ‌ద్దీక‌ర‌ణ‌పై సభ్యులు చ‌ర్చించ‌నున్నారు. ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంత‌రం ప‌ల్లె, ప‌ట్టణ ప్రగ‌తిపై స్వల్పకాలిక చ‌ర్చ చేప‌ట్టనున్నారు.

యూపీలో ఘోర ప్రమాదం.. 9 మంది దుర్మరణం

ఉత్తర ప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కు - బస్సు ఢీకొన్న ప్రమాదంలో 9 మంది దుర్మరణం చెందారు. మరో 27 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లుగా బారాబంకీ జిల్లా కలెక్టర్ తెలిపారు.





దిశ హైపవర్ కమిషన్ ముందుకు సజ్జనార్

దిశ ఎన్ కౌంటర్ కేసులో సుప్రీంకోర్టు నియమించిన హైపవర్ కమిషన్ ముందు ఇవాళ సజ్జనార్ మరోసారి హాజరుకానున్నారు. సజ్జనార్ ఇవాళ ఇచ్చే స్టేట్ మెంట్ కీలకం కానుంది. ఇప్పటికే సిట్ చీఫ్ మహేశ్ భగవత్, సాక్షుల వాంగ్మూలాలను కూడా కమిషన్ నమోదు చేసుకుంది.

విజయవాడ: గాల్లోనే విమానం 10 రౌండ్లు చక్కర్లు

విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి వస్తున్న ఓ విమానానికి సాంకేతిక సమస్య తలెత్తింది. సిగ్నల్స్ అందకపోవడం వల్ల విమానం చాలాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. దాదాపు 10 రౌండ్ల వరకూ విమానం చక్కర్లు కొట్టింది. చివరికి గన్నవరం ఎయిర్ పోర్టులో సేఫ్ ల్యాండింగ్ అయింది. ఈ ఎయిర్ ఇండియా విమానం 165 మంది ప్రయాణికులతో మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి వచ్చింది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ విమానాన్ని గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ చేసినట్లు తెలుస్తోంది.

పాకిస్థాన్‌లో భూకంపం.. 20 మంది మృతి

పాకిస్థాన్​లో భారీ భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో హర్నాయ్ ప్రావిన్స్‌కు 14 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని ఆ దేశ జాతీయ భూగర్భ పరిశోధన కేంద్రం వెల్లడించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6గా నమోదైనట్లు వెల్లడించింది. ఈ భూప్రకంపనల వల్ల కనీసం 20 మంది చనిపోయి ఉంటారని పాక్ విపత్తు ప్రతిస్పందక అధికారులు చెప్పినట్లుగా అంతర్జాతీయ వార్తా సంస్థ ఏఎఫ్‌పీ వెల్లడించింది.









Background

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 7న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.