Ram Gopal Varma did not attend the CID investigation:  ఏపీసీఐడీ పోలీసుల విచారణకు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డుమ్మా కొట్టారు. ఆయన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా తీశారు. ఆ సినిమా న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కోవడంతో ఆయన ఆ సినిమా పేరు మార్చారు. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అని మార్చారు. అయితే ఈ సినిమా ఆడలేదు. తర్వాత యూట్యూబ్ లో విడుదల చేశారు. అయితే కోర్టు అభ్యంతరం తెలిపిన టైటిల్ ను అలాగే వాడారు. అది తమ మనోభావాలను దెబ్బతీసిందని టీడీపీ యుూత్ వింగ్ కు చెందిన వారు సీఐడీకి ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసిన సీఐడీ పోలీసులు ఇటీవల ఒంగోలు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైనప్పుడు నోటీసులు ఇచ్చారు. పదో తేదీన హాజరు కావాలన్నారు. అయితే హాజరు కాలేదు. 

రామ్ గోపాల్ వర్మ విచిత్రమైన కారణాన్ని పోలీసులకు పంపారు. తాను  తీసిన శారీ అనే సినిమా ప్రమోషన్లలో చాలా బిజీగా ఉంటానని చెప్పుకొచ్చారు. అయితే ఆ సినిమా గురించి ఆయన చాలా కాలంగా చెబుతున్నారు. ఎప్పుడు ఎలాంటి ప్రమోషన్లు చేస్తారో కానీ.. ఎనిమిది వారాల తర్వాత మాత్రం అందుబాటులో ఉంటానని చెప్పుకొచ్చారు. నిజానికి ఆర్జీవీ సాక్షి కాదు. తన చాయిస్ ప్రకారం డేట్స్ ఇవ్వడానికి. ఆయన నిందితుడు. పోలీసులు చెప్పినప్పుడు విచారణకు  రాకపోతే అరెస్టు చేసే అవకాశాలు ఉంటాయి.  పోలీసుల విచారణకు సహకరించకపోతే ఏం జరుగుతుందో ఆయనకు తెలిసేలా చేయడానికి సీఐడీ పోలీసులు సిద్ధంగానే ఉన్నారన్న  ప్రాచారం జరుగుతోంది. ప్రొసీజర్ ప్రకారం మరోసారి నోటీసులు జారీ చేయనున్నట్లుగా చెబుతున్నారు. 

వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన  కూటమి నేతలపై అసభ్య పోస్టులు పెట్టారు. ఎన్నో మాటలన్నారు. అదే సమయంలో తాను తీసిన వ్యూహం, శపథం అనే సినిమాలను ఏపీ ఫైబర్ నెట్ కు అమ్మారు. గట్టిగా రెండు వేల వ్యూస్ రాకపోయినా  రూ. రెండు కోట్ల వరకూ వసూలు చేశారు. దీనిపై ఏపీ పైబర్ నెట్ ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేసింది. తన వద్ద డబ్బు లేదని ఆయన సమాచారం ఇచ్చారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏపీ ఫైబర్ నెట్ ప్రకటించింది.  ఇలాంటి సమయంలో విచారణకు సహకరించకుండా  ఆర్జీవీ వారాలకు వారాలు గడువు కావాలని కోరుతున్నారు. 

సోషల్ మీడియా కేసుల్లో మాత్రమే ఆర్జీవీకి ముందస్తు బెయిల్ ఇచ్చారు. దర్యాప్తునకు సహకరించాలని హైకోర్టు ఆదేశిచింది. ఇతర కేసుల్లో మాత్రం ఆయనకు ముందస్తు బెయిల్ రాలేదు. ఇటీవల ఓ చెక్  బౌన్స్ కేసులో ఆయనకు ముంబై కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. ఏపీలో రాజకీయాల్లో ఆయన జోక్యం చేసుకోవడం పెను సమస్యగా మారింది. పాత సినిమాలన్నీ వదిలేస్తానని కొత్తగా సిండికేట్ అనే సినిమా తీస్తానని ఆయన అంటున్నారు. ఈ కేసుల వల్ల ఆయన సినిమా తీసే అవకాశాలు కూడా తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. 

Also Read: Tirumala Ghee Adulteration: తిరుమలలో నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం, సీబీఐ అదుపులో నలుగురు నిందితులు