Chilukur Temple Rangarajan | అమరావతి: చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ పై ఒక మూక దాడి చేసిందని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను, ఇది దురదృష్టకరమైన ఘటన అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అర్చకులు రంగరాజన్ పై దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడిగా కాకుండా- ధర్మ పరిరక్షణపై జరిగిన దాడిగా భావించాలన్నారు. కొన్ని దశాబ్దాలుగా అర్చకులు రంగరాజన్ ధర్మ పరిరక్షణకు, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు సేవలు అందిస్తున్నారు.
కానీ, రామరాజ్యం అనే సంస్థ సభ్యులమని చెప్పుకుంటూ ఒక గ్రూపు అర్చకులు రంగరాజన్ పై దాడి చేయడానికి గల కారణాలేంటో పోలీసులు నిగ్గు తేల్చాలి. ఆ మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించి బాధ్యులను కఠినంగా శిక్షించాలి. ఈ దాడిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని పవన్ కళ్యాణ్ కోరారు.
సనాతన ధర్మం కోసం నాకు సూచనలు చేశారు
సనాతన ధర్మ పరిరక్షణ కోసం రంగరాజన్ పలు విలువైన సూచనలను నాకు అందించారు. టెంపుల్ మూమెంట్ అనే కార్యక్రమం ఏ దశలో ప్రారంభించాల్సి వచ్చిందో నాకు తెలిపారు. హిందూ ఆలయాల నిర్వహణ, ధర్మ పరిరక్షణపై ఎంతో తపించే వ్యక్తి ఆయన అలాంటి ఆయనపై వీరరాఘవరెడ్డి, అతడి గ్రూపు చేసిన దాడిని ప్రతి ఒక్కరం ఖండించాలి. చిలుకూరు వెళ్లి అర్చకులు రంగరాజన్ ని పరామర్శించాలని, వారికి అండగా ఉంటామని భరోసా ఇవ్వాలని జనసేన తెలంగాణ విభాగాన్ని ఆదేశించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.
నిందితుడి అరెస్ట్
మొయినాబాద్ మండలంలోని చిలుకూరులోని బాలాజీ ఆలయంలో రంజరాజన్ ప్రధాన అర్చకులుగా సేవలు అందిస్తున్నారు. శుక్రవారం వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి చిలుకూరు వెళ్లి రంగరాజన్‌ను కలిశారు. తనది ఇక్వాకు వంశమని, తాను రాముడి వంశస్తుడినని పరిచయం చేసుకున్న వ్యక్తి రామరాజ్యం స్థాపించేందుకు మద్దతివ్వాలని ఒత్తిడి చేయగా.. రంగరాజన్ అతడి ప్రతిపాదన తిరస్కరించారు. అతడి వాలకం చూస్తే ఆయనకు అనుమానం వచ్చి, అతడి మాటల్ని పట్టించుకోలేదు. దీంతో ఆవేశానికి లోనైన ఆ గ్రూపు అర్చకులు రంగరాజన్ పై దాడి చేయగా ఆయన కంటి వద్ద స్వల్ప గాయమైంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అతడి అనుచరుల కోసం కొన్ని టీమ్స్ గాలింపు చర్యలు చేపట్టాయి.