IIT Madras: హైపర్ లూప్ పరిశోధనల్లో భారత్ ముందడుగు వేస్తోంది. ఐఐటీ మద్రాస్ సహకారంతో భారతీయ రైల్వే, ఈ హైపర్‌లూప్ ట్రాక్‌ను 422 మీటర్ల మేరకు సిద్ధం చేసింది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న ఇతర దేశాల కన్నా భారత్ ముందు ఉంటుంది. హైపర్ లూప్ అందుబాటులోకి వస్తే ఢిల్లీ నుంచి జైపూర్ వరకు దాదాపు 300 కి.మీ. దూరాన్ని కేవలం 30 నిమిషాల్లోనే ప్రయాణించవచ్చు. ఈ విషయాన్ని అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు.
మారుతున్న కాలంతో పరుగులు పెట్టేలా లాజిస్టిక్స్ కూడా కళ్లు మూసి తెరిచేంతలోగానే డెలివరీ అయిపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. వస్తువులు మాత్రమే కాదు.. మనుషుల్ని కూడా అలాగే తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు. బుల్లెట్ ట్రైన్స్ వంటి వాటికి ఆదరణ పెరుగడానికి ఇదే కారణం. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ కా బాప్ లాంటి హైపర్ లూప్ అనే టెక్నాలజీతో బుల్లెట్ ట్రైన్ కన్నా వేగవంతమైన రవాణా సౌకర్యంపై పరిశోధనలు జరుగుతున్నాయి. దీన్ని మన దేశంలో మొదటి సారి టెస్ట్ ట్రాక్ ఐఐటీ మద్రాస్ రెడీ చేసింది.
ఐఐటీ మద్రాస్,భారత్ రైల్వేలు, ఇతర స్టార్టప్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారత్ తొలి హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్ ను సిద్ధం చేశారు. ఐఐటీ చెన్నైలోని క్యాంపస్‌లో 422 మీటర్ల హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్ తొలి హైపర్‌లూప్ టెస్ట్ ట్రాక్. రైల్వేస్, ఐఐటీ-మద్రాస్ ఆవిష్కార్ హైపర్ లూప్ బృందం కృషి చేసింది. ఓ స్టార్టప్ సంస్థ భాగస్వామ్యంలో ఈ హైపర్ లూప్ ప్రయోగాలను చేస్తున్నారు.
హైపర్ లూప్ అనేది ఓ ప్రత్యేక నిర్మాణం. సాధారణంగా భూమిపై ప్రయాణించే వాహనాలకు గాలి అనేది పెద్దగా ఆటంకం. దానివల్ల అవి ఒక పరిమితికి మించిన వేగంతో రోడ్డుపై వెళ్లడం సాధ్యంకాదు. ఈ హైపర్ లూప్ వాక్యూం రూపంలో ఉన్న గొట్టాలలో ప్రయాణిస్తుంది. దీని కారణంగా ఏరోడైనమిక్ ప్రభావం ఉండదు. అంటే ఏ విధమైన బాహ్యపరమైన ఒత్తిడి రైలుపై గానీ దాని వేగంపై గానీ ప్రభావం చూపే అవకాశం లేదు. ఈ కారణంగానే హైపర్ లూప్ టెక్నాలజీలో రైలు అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది. కానీ గాలి పీడనం బాగా తక్కువగా ఉండే హైపర్ ల్యూబ్ ట్యూబ్‌లోకి బోగీని ప్రవేశపెడితే, దాని వేగంగావెళ్లొచ్చు.
హైపర్‌లూప్ రైలు లేదా కారు ప్రయాణం విమాన ప్రయాణం కంటే చౌకగా ఉంటుంది. చాలా తక్కువ కాలుష్యం ఉంటుంది. రోడ్లపై ఒత్తిడిని తగ్గించడానికి, నగరాల మధ్య ప్రయాణాన్ని సులభతరం చేయడానికి బాగా ఉపయోగపడుతంది. టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ కూడా ఈ హైపర్ లూప్ విధానంపై పరిశోధనలు చేయిస్తున్నారు. ఈ విషయంలో మన దేశం ఓ అడుగు ముందుకు వేసిందని చెప్పుకోవచ్చు.