Indiramma Atmiya Bharosa Scheme: హైదరాబాద్: ఉపాధి కూలీలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేసింది. ఎన్నికల కోడ్ (MLC Elections) అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం నిధులు జమ చేస్తున్నారు. రాష్ట్ర (Telangana) ప్రభుత్వం జనవరి 26న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ప్రారంభించడం తెలిసిందే.

ఆ జిల్లాల వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు

ప్రతి మండలంలోని ఒక పైలెట్ గ్రామంగా ఎంచుకుని గ్రామ సభలు నిర్వహించి ఉపాధి కూలీల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేసింది. మొత్తం 18,180 మంది కూలీల ఖాతాల్లో 6 వేల చొప్పున జనవరిలో జమ చేసింది. ఆ తర్వాత శాసన మండలి ఎన్నికలు (టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు)తో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధుల విడుదలకు బ్రేక్ పడింది. అయితే ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాలకు నిధులు విడుదల చేయాలని మంత్రి సీతక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదలయ్యాయి. 

ఇప్పటివరకు ఎంత లబ్ది చేకూరింది..

ఆ రెండు జిల్లాల్లో 66,240 మంది ఉపాధి కూలీ లబ్ధిదారులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. దాంతో 66,240 మంది కూలీల ఖాతాల్లో 39.74 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ లో భాగంగా ఇప్పటివరకు మొత్తం 83,420 మంది ఉపాధి కూలీలకు కాంగ్రెస్ ప్రభుత్వం 50.65 కోట్లు చెల్లించింది.  

ఎన్నికల కోడ్ అనంతరం మిగతా కూలీల ఖాతాల్లోకి నగదు

రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాక, ఎన్నికల కోడ్ ముగియగానే లబ్ధిదారులందరికీ నిధులను చెల్లించనున్నామని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల తెలిపారు. ఉపాధి కూలీలకు ఆర్థికంగా చేయూత అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ఉపాధి కూలీలకు ఆర్దిక చేయుత కల్పిస్తూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం తీసుకొచ్చింది. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఒక సీజన్ కు రూ.6000 చొప్పున కూలీలకు తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. డిబిటి పద్ధతిలో ఉపాధి కూలీల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నిధులను జమ చేస్తున్నారు. ఏడాదికి రూ.12 వేల చొప్పున లబ్దిదారుల ఖాతాల్లో నగదు రెండు సీజన్లలో జమ కానున్నాయి.

Also Read: CM Revanth Reddy Meets PM Modi: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, బీసీ రిజర్వేషన్లు సహా పలు కీలక అంశాలపై చర్చలు 

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేసి, లబ్దిదారుల ఖాతాల్లో  జమ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. తమ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.