Revanth Reddy Visits PM Modi In Delhi | న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. మంగళవారమే ఢిల్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలిశారు. తెలంగాణ (Telangana) రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సాయంపై, రాష్ట్ర అభివృద్ధిపై గంట పాటు చర్చించారు. ఫ్యూచర్ సిటీకి, రీజనల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2లకు కేంద్రం సాయం అందించాలని కోరారు. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్ (SLBC Tunnel) కూలి 8 మంది చిక్కుకుపోయిన ఘటనను ప్రధాని వద్ద సీఎం రేవంత్ ప్రస్తావించారు. లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఏమేం సహాయక చర్యలు చేపట్టారో ప్రధానికి వివరించారు. రేవంత్ రెడ్డి వెంట రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు.

కులగణన నివేదిక, బీసీలకు రిజర్వేషన్లపై చర్చలు

రాష్ట్ర విభజన చట్టంలో ఇంకా పరిష్కారం కానీ అంశాలపై కేంద్రం చొరవ చూపాలని కోరినట్లు తెలుస్తోంది. ప్రధానంగా బీసీలకు రిజర్వేషన్ల అంశంపై సైతం ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశాలు ఉన్నాయి. బీసీలకు రిజర్వేషన్ల కేటాయింపుపై క్లారిటీ కోసం కేంద్రాన్ని కోరనున్నారు. దేశంలోనే చట్టబద్ధమైన కులగణనను తెలంగాణ ప్రభుత్వం చేసిందని, రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్ లో పెట్టాలని ప్రధానిని రేవంత్ కోరినట్లు తెలుస్తోంది.

ఢిల్లీ పర్యటనలో ప్రధానితో భేటీ అనంతరం కొందరు కేంద్ర మంత్రుల్ని తెలంగాణ సీఎం కలవనున్నారు. పలు శాఖలకు సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల పురోగతి పనులపై చర్చించనున్నారు.  కేంద్ర మంత్రులతో భేటీల అనంతరం ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర పార్టీ ముఖ్య నేతలతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారని తెలుస్తోంది. రాష్ట్ర కేబినెట్ విస్తరణ అంశంపై చర్చిస్తారని ప్రచారం జరుగుతోంది. రేవంత్ ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా కేబినెట్ విస్తరణ అంశం హాట్ టాపిక్ అవుతుంది.

క్లారిటీ వస్తే స్థానిక సంస్థల ఎన్నికలు

బీసీలకు రిజర్వేషన్ల అంశంపై స్పష్టత కోసం కాంగ్రెస్ అధిష్టానం యత్నిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీతో భేటీకి అపాయింట్ మెంట్ దొరకడంతో నిన్న ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి నేడు భేటీ అయ్యారు. బీసీలకు రిజర్వేషన్ల కేటాయింపుపై స్పష్టత వస్తే కనుక తెలంగాణలో స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్ అవుతుంది. కానీ రాజ్యాంగ పరంగా చూస్తే కొత్తగా రిజర్వేషన్లు కల్పించడం దాదాపుగా అసాధ్యమని విశ్లేషకులు చెబుతున్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటన జరిగిన సమయం కావడంతో రేవంత్ కు ప్రధాని మోదీ టైం కేటాయించారని సైతం బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తోంది.

Also Read: MLC Elections: ఓటమి భయంతోనే రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు, బీజేపీపై విషం కక్కారు: ఈటెల రాజేందర్