Earthquake In Indonesia | జకార్తా: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపూ భూకంప తీవ్రత 6.1గా నమోదైట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6:55 గంటలకు పలుచోట్ల భూమి కంపించింది. ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్స్ సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని USGS తెలిపింది. 

ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని సమాచారం. సునామీ వచ్చే అవకాశం లేదని తెలపడంతో ఆ దీవులలోని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పసిఫిక్ "రింగ్ ఆఫ్ ఫైర్" లో ఉన్న కారణంగా ఇండోయేషియాలో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. జపాన్ నుంచి ఆగ్నేయాసియా, పసిఫిక్ బేసిన్ అంతటా విస్తరించి ఉన్న టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొనే చర్యలతో ఇండోనేషియా ద్వీపాలలో తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. 

భారీ భూకంపాలకు కేంద్రం..

2021 జనవరిలో సులవేసిలో సంభవించిన భూకంపం విషాదాన్ని నింపింది. 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అంతకుముందు 2018లో ప్రస్తుతం భూకంపం సంభవించిన సులవేసిలోని పాలూలో సునామీ వచ్చి 2,200 మందికి పైగా చనిపోయారు. ఆ సమయంలో రిక్టర్ స్కేలుపై భూకంపతీవ్రత 7.5గా నమోదైంది. 

తీవ్ర విషాదాన్ని నింపిన సునామీ

ప్రపంచాన్ని వణికించిన భూకంపం, సునామీ ఇండోనేషియాలోని దీవులలో 2004లో సంభవించాయి. ఆషే ప్రావిన్స్‌లో 9.1 తీవ్రతతో భారీ భూకంపంగా మొదలై అది సునామీగా మారింది. ఆ విషాద ఘటనలో ఇండోనేషియాలో ఏకంగా 1,70,000 (ఒక లక్షా 70 వేలు) మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అందుకే అప్పటినుంచి 6.5 తీవ్రతతో భూకంపం అనగానే దేశ ప్రజలు, సమీప ద్వీపాలలో ప్రజలు సునామీ వస్తుందేమోనని ఆందోళన చెందుతుంటారు.

Also Read: Kash Patel as FBI Director: ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా భగవద్గీత మీద ప్రమాణం చేసిన కాష్‌ పటేల్‌, మూలాలు మరిచిపోలేదంటూ ప్రశంసలు