Kash Patel takes oath on Bhagavad Gita: అమెరికా 9వ ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా ప్రవాస భారతీయుడు కాష్ పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌గా కాష్ పటేల్‌ను అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరుువాత డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేయడం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం నాడు ఓటింగ్ నిర్వహించగా అమెరికా సెనెట్ లో 51 -49 ఓట్ల తేడాతో భారత సంతతికి చెందిన కాష్ పటేల్ విజయం సాధించారు. ఇదివరకే భారత సంతతికి చెందిన పలువురు అమెరికాలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 


భగవద్గీత మీద ప్రమాణం..
ఎఫ్‌బీఐ కొత్త డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన కశ్యప్ అలియాస్ కాష్ పటేల్‌ బాధ్యతలు స్వీకరించారు. అయితే కాష్ పటేల్ FBI డైరెక్టర్‌గా ఇండియా స్టైల్ లో భగవద్గీత మీద ప్రమాణం చేయడం హాట్ టాపిక్ అవుతోంది. గాళ్‌ఫ్రెండ్ అలెక్సీస్ విల్ కిన్స్ భగవద్గీతను చేతిలో పట్టుకోగా దానిపై చేయి ఉంచి ఎఫ్‌బీఐ నూతన డైరెక్టర్‌గా కాష్ పటేల్ ప్రమాణం చేశారు. కాష్ పటేల్ చేత అటార్నీ జనరల్‌ పామ్‌ బోండీ ప్రమాణం చేయించారు. ఎక్కడ ఉన్నా భారత సంప్రదాయాలు, మూలాలు మరిచిపోలేదు అంటూ కాష్ పటేల్ పై భారతీయులు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.



FBI ఏజెంట్లలో డైరెక్టర్‌గా కాష్ పటేల్ నియామకాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. ‘అతడి పట్ల ఏజెంట్లు నమ్మకం, ఎంతో నమ్మకం కలిగి ఉన్నారు. అందువల్లే పటేల్‌ను ఆ పదవికి నామినేట్ చేశాను. అతను అద్భుతమైన వ్యక్తి. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా అత్యుత్తమ సేవలు అందిస్తారని నమ్మకం ఉంది. ఆయన సామర్థ్యంపై నాకు సందేహం లేదు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. గురువారం జరిగిన ఓటింగ్ లో ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు అలాస్కాకు చెందిన లిసా ముర్కోవ్స్ కి, మైనేకు చెందిన సుసాన్ కాలిన్స్.. పటేల్ కు వ్యతిరేకంగా డెమోక్రాట్ అభ్యర్థికి మద్దతుగా ఓటేశారు. అయినా  51-49 ఓట్లతో పటేల్ ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు.