Breaking News: తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ ఫైట్- ఉప్పల్‌లో ఐపీఎల్ హీట్
Latest Telugu breaking News: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.
KCR In Karimnagar Tour: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రోడ్డు మార్గంలో కరీంనగర్ వెళ్తున్నారు. పార్టీ శ్రేణులతో ఆయన ఉదయం ఇంటి నుంచి ఎన్నికల కోసం సిద్ధం చేసుకున్న ప్రత్యేక బస్సులో బయల్దేరి వెళ్లారు. కాసేపట్లో కరీంనగర్ చేరుకోనున్న కేసీఆర్ అక్కడ ఎండిపోయిన పంటలు పరిశీలించనున్నారు.
First Telugu News Reader Santh Swarup Passed Away : తొలితరం తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఇక లేరు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దూరదర్శనలో వార్తలు చదివిన తొలి యాంకర్ ఆయనే. ఆయన స్ఫూర్తితోనే చాలా మంది న్యూస్ ప్రజెంటర్స్‌గా రాణిస్తున్నారు. 1978లో ఉద్యోగంలో జాయిన్ ఆయన 1983 నుంచి వార్తలు చదువుతున్నారు. 2011లో పదవీ విరమణ చేశారు.
Telangana News : హైదరాబాద్ పోలీసులు గురువారం 15 లక్షల విలువ చేసే కిలో అల్ఫాజోలం పట్టుకున్నారు. జీనోమ్ వ్యాలీ పరిధిలోని అచైపల్లీ ఎక్స్ రోడ్ వద్ద ఒక తెల్ల బ్రెజ్జా కారు పట్టుకొని చెక్ చేయగా రూ. 7,89,500/- నగదుతోపాటు ఒక కిలో అల్ఫాజోలం లభ్యమైంది. వాటిని స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శివ్వంపేట, మేడ్చల్ ప్రాంతాల్లోని కల్లు దుకాణాలకు దీన్ని సరఫరా చేస్తున్నట్టు ఎల్లంకి సాయి కుమార్ గౌడ్ వెల్లడించాడు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పోలీసుల తనిఖీలు చేయగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సాయితోపాటు కొత్తపల్లి సత్య నారాయణ, రాకేష్ అనే ఇద్దర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి అల్ఫాజోలం(సింథటిక్ డ్రగ్) - 1 కేజీ, 5స్మార్ట్ ఫోన్లు, మారుతీ బ్రీజా కారు, 7,89,500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
Congress And CPi Seat Sharing In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ మధ్య సీట్ల పంపకాలు పూర్తి అయ్యాయి. ఆపార్టీకి 1 ఎంపీ స్థానాన్ని 8 అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తూ కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ షర్మిల, సీబీఐ కార్యదర్శి రామకృష్ణతో జరిగిన చర్చల్లో భాగంగా ఈ మేరకు సీట్ షేరింగ్‌పై నిర్ణయం తీసుకున్నట్టు కాంగ్రెస్ వెల్లడించింది.
సీపీఐ పోటీ చేయనున్న స్థానాలు
గుంటూరు ఎంపీ స్థానం
1. విజయవాడ పశ్చిమ అసెంబ్లీ స్థానం (Vijayawada West)
2. విశాఖపట్నం పశ్చిమ అసెంబ్లీ స్థానం (Visakhapatnam West)
3. అనంతపురం(Anantapur)
4.పత్తికొండ (Pattikonda)
5. తిరుపతి (Tirupati)
6.రాజంపేట(Rajampet)
7. ఏలూరు(Eluru)
8.కమలాపురం (Kamalapuram)
Quthbullapur Former MLA Srisailam Goud join to Congress : కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్‌లో చేరనున్నారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆయనతో కాంగ్రెస్ నేతల సమావేశమయ్యారు. పార్టీలోకి రావాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధినాయకత్వ కోరుకుంటుందని ఆయనకు తెలియజేశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని సమాచారం. ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. కుత్బుల్లాపూర్‌లోని కూన శ్రీశైలం గౌడ్ నివాసానికి వెళ్లి చర్చించిన మైనంపల్లి హన్మంత రావు, పట్నం మహేందర్ రెడ్డి, కొలన్ హన్మంతరెడ్డి, భూపతి రెడ్డి.
Background
Latest Telugu Breaking News: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వాతావరణం మరింత హీట్ ఎక్కనుంది. ఇవాళ్టి నుంచి జగన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున చెల్లెళ్లు పీసీసీ చీఫ్ షర్మిల, వివేక కుమార్తె సునీత ప్రచారం ప్రారంభించనున్నారు. కడప నుంచి వీరి ప్రచారం ప్రారంభంకానుంది.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా ఉన్న షర్మిల కడప నుంచి ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారాన్ని అక్కడి నుంచే షర్మిల ప్రారంభించనున్నారు. గురువారం ఆమె తన తల్లి విజయమ్మ ఆశీర్వాదం తీసుకొని ప్రచారానికి బయల్దేరారు. షర్మిలకు అండగా... వివేక హత్య కేసులో హంతకులకు వంతపాడుతున్నారని జగన్‌కు వ్యతిరేకంగా సునీత ప్రచారం చేయనున్నారు. ఆమె కూడా షర్మిలతో కలిసి ప్రచారంలో పాల్గొంటారు. షర్మిల చేపట్టే ప్రచార యాత్ర బద్వేల్ నుంచి ప్రారంభంకానుంది. ఈ బస్సు యాత్ర మొదటి విడతలో ఎనిమిది రోజుల పాటు కొనసాగనుంది. ఆమె బస్సు యాత్ర ఇవాళ బద్వేలు ప్రాంతంలో జరగనుంది. ఆరున కడప , 7న మైదుకూరు, 8న కమలాపురం, 10న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగనుంది.
పురందేశ్వరి ప్రచారం
మరోవైపు బీజేపీ ఆంధ్రప్రదేస్ అధ్యక్షురాలు పురందేశ్వరి నేటి నుంచి ప్రచారం చేయనున్నారు. రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆమె... అక్కడ నుంచే ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. పలు ప్రాంతాల్లో స్థానికులతో మీటింగ్‌లు పెట్టనున్నారు. టీడీపీ, జనసేన నాయకుల సమన్వయంతో ఆమె ప్రచారం చేయనున్నారు.
జగన్ యాత్రకు బ్రేక్
పది రోజుల నుంచి కొనసాగుతున్న మేమంతా సిద్ధం బస్ యాత్రకు వైసీపీ అధ్యక్షుడు జగన్ విరామం ప్రకటించారు. ఈ ఒక్కరోజు ప్రచారానికి విశ్రాంతి ఇచ్చిన జగన్ ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో బస చేసి ఉన్నారు. అక్కడే నెల్లూరులోని ముఖ్య నేతలతో కీలక సమావేశం అవుతారు.
సమన్వయ సమావేశాలు
ఎన్డీఏ కూటమి పార్టీలు నేటి నుంచి సమన్వయ సమావేశాలు జరపనున్నాయి. పార్లమెంట్ స్థాయి నేతలతో ఈ సమావేశాలు జరపనున్నారు. అమరావతి వేదికగా భేటీ అయ్యి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఓటు బదిలీలో ఉన్న అడ్డంకులపై చర్చించి వాటి నివారణకు చర్యలు తీసుకోనున్నారు.
ప్రచారంలో ప్రజాసమస్యలు
తెలంగాణలో కూడా రాజకీయం వేడెక్కింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తుతున్నాయి. ఓవైపు బీఆర్‌ఎస్ క్షేత్రస్థాయి పర్యటనలతో రేవంత్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే దీక్షల పేరుతో బీజేపీ రైతుల ఓట్ల కోసం ప్రయత్నిస్తోంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం చేయాల్సిన పార్టీలి ఇలా కొత్త పంథాను ఎంచుకున్నాయి.
సత్యాగ్రహ దీక్షలు
తెలంగాణ బీజేపీ నేడు రైతు సత్యాగ్రహ దీక్షలు పేరుతో నిరసనలు చేపట్టింది. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని కలెక్టరేట్ల ముందు సత్యాగ్రహ దీక్షలు చేపట్టనుంది. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, రైతుల భరోసా ఇవ్వాలని, వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్, రుణమాఫీ చేయాలని డిమాండ్లతో దీక్షలు చేస్తోంది.
నేడు కేసీఆర్ ప్రెస్‌మీట్
మరోవైపు కేసీఆర్ కూడా కరీంనగర్ జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలించనున్నారు. శభాష్‌పల్లి బ్రిడ్జి వద్ద మిడ్‌మానేర్ ప్రాజెక్టును పరిశీలిస్తారు. అనంతరం మీడియాతో కేసీఆర్ మాట్లాడనున్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టో
కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల కోసం మ్యానిఫెస్టోను విడుదల చేయనుంది. ఉదయం 11.30 నిమిషాలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ మరికొందరు సీనియర్ నాయకులతో కలిసి మేనిఫెస్టో విడుదల చేయనున్నారు.
ఉప్పల్‌లో హై టెన్షన్ మ్యాచ్
హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. సాయంత్ర 6.30కి టాస్ వేయనున్నారు. 7.30కి మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇక్కడ జరిగిన మొదటి మ్యాచ్‌లో హైదరాబాద్ టీం దుమ్ము రేపింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ చేసి కొత్త రికార్డు నమోదు చేసింది. అటు చెన్నై కూడా 3 విజయాలతో దూసుకెళ్తోంది. మరి ఈసారి ఎవరిది పై చేయి అవుతుంది, ఏ జట్టు ఎలాంటి అద్భుతం చేస్తుందో అన్న అంచనాలు మ్యాచ్‌పై ఉన్నాయి.
- - - - - - - - - Advertisement - - - - - - - - -