KCR And Harish Rao Quash Petitions In High Court: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR), మాజీ మంత్రి హరీశ్‌రావు (Harishrao) హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందన్న అంశంపై భూపాలపల్లి కోర్టు ఇచ్చిన నోటీసులను కొట్టేయాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. మేడిగడ్డ నిర్మాణంలో ప్రమాణాలు పాటించలేదని, దీని వల్ల ప్రజాధనం వృథా అయ్యిందని రాజలింగమూర్తి అనే వ్యక్తి భూపాలపల్లి కోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన జిల్లా న్యాయస్థానం జులై 10న కేసీఆర్, హరీశ్‌రావు సహా ఆరుగురికి నోటీసులు జారీ చేసింది. వీటిని సవాల్ చేస్తూ కేసీఆర్, హరీశ్ రావు తాజాగా కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది.
సర్వ శిక్ష ఉద్యోగుల నిరసనకు మద్దతు
మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీని కూడా అబద్ధాలకు వేదికగా మార్చిందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. మెదక్, హనుమకొండలో సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ సమస్య ముఖ్యమైందని.. కానీ, ప్రజల సమస్యలు ముఖ్యం కావా? అని ప్రశ్నించారు. 20 వేల సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు రోడ్డు మీద పడితే ఎందుకు పట్టించుకోవని నిలదీశారు. 'అన్ని వర్గాల ప్రజలను రేవంత్ రెడ్డి, మంత్రులు మోసం చేశారు. ఎంతమంది మాట్లాడినా చలనం లేకుండా ఉన్నారు. విద్యా శాఖకు మంత్రి లేడు. బడ్జెట్‌లో 15 శాతం నిధులు అని, 7 శాతం కూడా పెట్టలేదు. నిరసన చేయడం వల్ల లక్షల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యింది. రేవంత్ ఇచ్చిన హామీ అమలు చేసే వరకూ నిరంతరం మీకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. ముల్లును ముళ్ళు తోనే తీయాలన్నట్లు, సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించండి. రేవంత్‌ను నిలదీయండి.' అని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
Also Read: Sandhya Theater: సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం